కాయ్ రాజా కాయ్
♦ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు
♦ లక్షల్లో కాస్తూ సై అంటే సై...
♦ 30వ డివిజన్ ఫలితంపై రెట్టింపు సంఖ్యలు
♦ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ‘పోటీ’దారులు
కాకినాడ క్రైం : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగియడంతో సెప్టెంబర్ ఒకటో తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో విజయం కోసం అధికార టీడీపీ కోట్లాది రూపాయలను తృణప్రాయంగా ఖర్చు చేసింది. ఎన్నడూలేని రీతిలో ఎన్నికలకు రెండు రోజుల ముందే ఓటర్ స్లిప్పులతోపాటు డబ్బులు పంచి ఓటర్లను పలు ప్రలోభాలకు గురిచేశారు. మద్యాన్ని వరదలా పారించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పార్టీ అధినేత జగన్ పర్యటనతో రెట్టించిన ఉత్సాహంతో విజయం కోసం అహర్నిశలూ శ్రమించారు. అక్కడక్కడా కొన్ని సంఘటనలు జరిగినా మొత్తంమీద ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థుల విజయంపై జోరుగా బెట్టింగులకు తెరదీశారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపుపై జోరుగా పందేలు కడుతున్నారు. వేల నుంచి లక్షల రూపాయల మేర పందాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆ డివిజన్ వైపే చూపంతా...
కాకినాడ డివిజన్ పరిధిలోని 30వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాదం బాలకృష్ణల మధ్య ఎన్నికల ఫలితంపై జోరుగా పందేలు సాగుతున్నాయి. ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థి బాలకృష్ణ గెలుపు కోసం ప్రభుత్వానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా తిష్టవేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. వైఎస్పార్‌సీపీ అభ్యర్థిని తరపున మాజీ ఎమ్మెల్యే, సిటీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అభ్యర్థిని భర్త ప్రూటీకుమార్ విస్త్రుత ప్రచారం నిర్వహించారు.
అధినేతలంతా ఇక్కడే...
ఏడేళ్ల విరామం తర్వాత నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం పోరాడాయి. తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం సీఎం చంద్రబాబు నాయుడుతో సహా కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించి విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజులపాటు కాకినాడలో కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జ్వరంతో బాధపడుతున్నా, పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఒకరోజు కాకినాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డితో పలువురు వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రచారం నిర్వహించారు.
కాకినాడ కార్పొరేషన్‌పరిధిలో 50 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా విలీన పంచాయతీలపై కొంత మంది కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో రెండు డివిజన్లను మినహాయించి 48 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. గెలుపు అవకాశాలపై లెక్కలు వేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమై ఉన్నారు. పోలింగ్ సరళి, పోలైన ఓట్లు, ఏ వర్గం ఓట్లు తమకు అనుకూలంగా పడ్డాయి, ఎక్కడ వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయనే విషయంపై అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. మరో రోజులో తేలే ఎన్నికల ఫలితాల కోసం ఇటు అభ్యర్థులతోపాటు అటు పార్టీశ్రేణులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.