అగ్గి ‘రాజు’ కుంది!
టీడీపీ, బీజేపీల సిగపట్లు
రాజధానికి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల పయనం
నేడు సీఎంకు ఫిర్యాదు
విశాఖపట్నం: టీడీపీ-బీజేపీల మధ్య అగ్గిరాజుకుం ది. ఇప్పటికే ఈ రెండు పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీతోపాటు ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకున్న బీజేపీని నగరంలో రోజురోజుకు బలహీనపర్చడమే లక్ష్యంగా మంత్రి గంటా శ్రీనివాసరావు బృందం చేస్తున్న రాజకీయాలను కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ ఎంపీ కె.హరిబాబు, పార్టీ శాసనసభాపక్ష నాయకుడు, విశాఖ-ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాటలకు మంత్రులే కాదు.. జిల్లా అధికారులు కూడా ఏ మాత్రం విలువనివ్వడం లే దని ఆ పార్టీనేతలు గుర్రుగా ఉన్నారు. మిత్ర ధర్మానికి విరుద్ధంగా టీడీపీ నేతలు చేస్తున్న రాజకీయాలు, జరుగుతున్న పరిణామాలపై ఇటీవల పలు వేదికలపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే బాహాటంగానే తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నాలుగు రోజుల క్రితం మీడియా సమక్షంలోనే మంత్రి గంటా, విష్ణుకుమార్‌రాజుల మధ్య జరిగిన సంవాదం ఈ రెండు పార్టీల మధ్య అగాథం ఏ స్థాయికి చేరుకుందో కళ్లకు కట్టింది.
ఆ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు గణబాబు, పీలా గోవిందలు విష్ణుకుమార్‌రాజుపై ఎదురుదాడి చేశారు. ఈ రెండు పార్టీల మధ్య ముదురుతున్న విభేదాలు ప్రస్తుతం తారస్థాయికి చేరాయి. జిల్లాలో ఇరు పార్టీల నేతల మధ్య కొరవడిన సమన్వయం, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కేటాయింపులో మంత్రులు, అధికారుల తీరుపై శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు బీజేపీ నేతలు విజయవాడ పయనమయ్యారు. బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజులు పార్టీ ముఖ్యనేతలతో కలిసి శనివారం సీఎంను కలవనున్నారు. నగరంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో తమను భాగస్వామ్యం చేయడం లేదని.. చివరకు కేంద్ర నిధులతో చేపట్టే కార్యక్రమాల విషయంలోనూ తమను పట్టించుకోవడం లేదని సీఎంకు వివరించనున్నట్టు సమాచారం.
ఇంతకంటే వివక్ష ఉంటుందా?
గత 18 నెలల్లో నగరంలో టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్ని కోట్ల విలువైన పనులు జరిగాయి? నా నియోజకవర్గంలో ఎన్ని కోట్ల పనులు జరిగాయో చూడండి. మీకే అర్ధమవుతుంది. ఇంతకంటే వివక్ష మరొకటి ఉంటుందా? తూర్పు నియోజకవర్గంలో రూ.80 కోట్లు, పశ్చిమలో రూ.32 కోట్లు, దక్షిణంలో రూ.70 కోట్లు, గాజువాకలో రూ.40 కోట్లు, పెందుర్తిలో ఏకంగా 120 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరిగాయి. నా ఉత్తర నియోజకవర్గంలో రూ.50 కోట్ల విలువైన పనులు ప్రతిపాదిస్తే కేవలం రూ. 4.02 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. నేను ఇచ్చిన ప్రతిపాదనలపై జీవీఎంసీ కమిషనర్‌కు 50కు పైగా ఉత్తరాలు రాసినా పట్టించుకోలేదు. ఈ విషయాలనే సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించా. ఎంపీతో కలిసి సీఎంకు ఫిర్యాదు చేస్తా.
-విష్ణుకుమార్‌రాజు, ఉత్తర ఎమ్మెల్యే