
బీజేపీ ఆగ్రహం... టీడీపీ విస్మయం
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలిలో సభ్యులుగా కొందరి పేర్లు అనూహ్యంగా తెరమీదకు రావడం అటు తెలుగుదేశంలో, ఇటు మిత్రపక్షమైన బీజేపీలోనూ కలకలం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలపై రాష్ట్ర బీజేపీ నేతల్లో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తమవుతోంది. సొంత పార్టీ టీడీపీ నేతలను సైతం ఈ నియామకాలు విస్మయానికి గురిచేసినట్టు తెలుస్తోంది.
ప్రధానంగా తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి పేరు జాబితాలో చేరడంపై రెండు పార్టీల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ నాయకుల సిఫారసు మేరకో, తమిళనాడుకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతల సిఫారసు మేరకో ఆయన పేరు ఖరారైందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని బీజేపీ నేతలంటున్నారు. తమ నేతలను పక్కదారి పట్టించడానికి జరుగుతున్న ప్రచారంగా వారు పేర్కొంటున్నారు. మరోవైపు మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి ఒకరు మధ్యవర్తిగా ఉండి వ్యవహారం నడిపించారని, కృష్ణమూర్తిని సభ్యుడిగా నియమించే విషయంలో స్వయంగా చంద్రబాబే నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నేతలే అంటుండడం గమనార్హం.
ఆయన నియామకం విషయంలో తెరవెనుక మతలబు వేరే ఉందని వారంటున్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితాలో తన పేరు ఖాయంగా ఉంటుందని 4 నెలల నుంచే కృష్ణమూర్తి ప్రచారం చేసుకుంటున్నారని వారు చెబుతున్నారు. ఇదిలావుండగా గత ఆదివారం ఉదయం సీఎం చంద్రబాబుతో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరమే టీటీడీ పాలకవర్గం పేర్లు ఖరారైనట్టు సమాచారం. ఆ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీఅవడం గమనార్హం.
వారి పేర్లు తొలగించడం వెనుక మతలబు!
బీజేపీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి(ఖైరతాబాద్), ఏపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ(రాజమండ్రి), చిత్తూరు జిల్లా తిరుపతి నేత భానుప్రకాష్‌రెడ్డికి అవకాశం కల్పిస్తున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరిగింది. చింతల రామచంద్రారె డ్డికి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్వయంగా ఫోన్ చేసి టీటీడీ పాలకవర్గ సభ్యుడిగా నియమితులవుతున్నారంటూ అభినందనలు సైతం తెలిపారు. దీంతో రామచంద్రారెడ్డిని పార్టీ నేతలు అభినందనలతో ముంచెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వీట్లు కూడా పంచుకున్నారు.
మిగిలిన ఇద్దరు నేతలు సైతం సహచరుల నుంచి అభినందనలు అందుకున్నారు. ఇంత జరిగిన తర్వాత హఠాత్తుగా జాబితా నుంచి వారి పేర్లు తొలగించడం వెనుక పెద్ద మతలబే ఉందని వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలను బుజ్జగించాలన్న లక్ష్యంతోనే ఉద్దేశపూర్వకంగా ఆ పార్టీ జాతీయ నేతలు అమిత్‌షా, ఉమాభారతి, రాజ్‌నాథ్‌సింగ్ తదితరుల సిఫారసు మేరకు నియమించినట్టు లీకులిచ్చారని వాదన కూడా వినిపిస్తోంది.