తెలుగుతమ్ముళ్లకు శృంగభంగం
► ఆదికి అమాత్య యోగం
► అడ్డుకునేందుకు యత్నించినా దక్కని ఫలితం
కడప: ‘ముందొచ్చిన చెవుల కన్నా, వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్నట్లు ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి అమాత్యయోగం దక్కింది. మొదటి నుంచి ఉన్నవారిని కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేకు మంత్రిపదవి ఇవ్వడంపై పార్టీ జిల్లా అధ్యక్షుడితో సహా జిల్లా నేతలంతా తీవ్రంగా వ్యతిరేకించినా పార్టీ అధిష్టానం వారి బెదిరింపులను ఖాతరు చేయలేదు. ముందే నిర్ణయించిన ప్రకారం ఆదితో మంత్రిగా ప్రమాణస్వీకారం తంతు పూర్తి చేయించారు. ఏళ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకొని క్లిష్టసమయాల్లో అండగా నిలిచిన జిల్లాలోని తెలుగుతమ్ముళ్లకు ఈ పరిణామం ఏమాత్రం మింగుడుపడటం లేదు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లానుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఎస్‌వీ సతీష్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఇచ్చారు. అది కేబినెట్ ర్యాంకు పదవే అయినప్పటికీ, రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి స్వేచ్ఛగా వ్యవహరించడానికి వీలులేకుండా పోయిందన్న భావన ఉంది. అలాగే జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి విప్ పదవి మాత్రమే ఇచ్చారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో తనకు తప్పకుండా మంత్రిపదవి లభిస్తుందని భావించిన మేడా మల్లికార్జునరెడ్డికి తీవ్ర నిరాశే ఎదురైంది.
మంత్రివర్గ విస్తరణ సందర్భంగా తమ మాటకు కనీస విలువ కూడా ఇవ్వలేదని, ఇలాగైతే పార్టీలో చీలికలు తప్పవని జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, వీరశివారెడ్డి, రమేష్‌రెడ్డి, మాజీమంత్రి రామసుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి హెచ్చరికలు జారీ చేసినా పార్టీ అధిష్టానం వారి అభిప్రాయాలను ఖాతరు చేయనట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఆదికి మంత్రిపదవి ఇస్తే పార్టీని వీడేందుకు కూడా వెనుకాడనని హెచ్చరించిన రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీతోపాటు విప్ పదవి ఇస్తామనడంతో మిన్నకుండిపోవడంపట్ల కూడా జమ్మలమడుగు నేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలే కొంపముంచాయా!
స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడమే ఈ పరి ణామాలన్నింటికీ కారణమా...అంటే అవుననే సమాధానమిస్తున్నారు సగటు టీడీపీ అభిమానులు. అందరూ వ్యతిరేకించినా అధినేతను ఒప్పించి బీటెక్ రవికి టికెట్ ఇప్పించుకొని ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ పార్టీ వద్ద తమ పట్టును నిలుపుకున్నారని, ఇక ఎన్నికల సమయంలో నియోజకవర్గాల వారీగా నేతలందరిపై అధినేతకు ఫిర్యాదు చేసి పార్టీకి సహకరించక తప్పని పరిస్థితిని సృష్టించారని చెబుతున్నారు.
లోలోన తీవ్ర వ్యతిరేకత ఉన్నా పార్టీ విజయం సాధిస్తే తమకు రాజకీయంగా తగిన గుర్తింపు లభిస్తుందనే ఆశతో ప్రతిఒక్కరూ నిజాయితీగా బీటెక్ రవి విజయానికి కృషి చేసినట్లు సమాచారం. జిల్లాలోని అగ్రనేతలతోపాటు చిన్న కార్యకర్తకు కూడా ఈ విజయంలో భాగస్వామ్యమున్నప్పటికీ ఆది మాత్రం తనవల్లే ఈ విజయం సాధ్యమైందని క్రెడిట్ కొట్టేసి మంత్రి పదవి ఎగురేసుకుపోయినట్లు తెలుస్తోంది. నమ్ముకున్నపార్టీ ఇలా నమ్మకద్రోహం చేసి నట్టేట ముంచుతుందనుకుంటే ముందే జాగ్రత్త పడేవారమని కొందరు నేతలు లోలోన రగిలిపోతున్నట్లు తెలిసింది.