టీడీపీ వర్గవిభేదాలతో సీఎంకు సంకటం
అయ్యన్నపై ఆగ్రహం!... గంటాపై అపనమ్మకం
త్వరలో జిల్లా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయం
విశాఖపట్నం: మొన్న ఆర్డీవోల బదిలీ వ్యవహారం... నిన్న మాడుగుల నియోజకవర్గంలో కార్యక్రమాల వివాదం... నేడు పెందుర్తి నియోజకవర్గంలో పోటాపోటీగా బలప్రదర్శనలు... ఇలా టీడీపీ టీడీపీ తమ్ముళ్ల చెలగాటం సీఎం చంద్రబాబుకు సంకటప్రాయంగా మారింది. తన ఆదేశాలనే బేఖాతరు చేస్తూ రోజుకో రీతిగా పార్టీ బజారున పడుతుండడంతో ఆయన్ని అసహనానికి గురిచేస్తోంది. ఇరువర్గాలను కట్టడి చేయలేకపోతున్న నిస్సహాయ స్థితి చంద్రబాబును తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్న అయ్యన్న తీరుపై ఆగ్రహం... ఎమ్మెల్యేలను కూడగట్టి రహస్య భేటీలు నిర్వహిస్తున్న గంటాపై సందేహంతో చంద్రబాబు కొట్టుమిట్టాడుతున్నారు.
అయ్యన్నపై ఆగ్రహం!
అయ్యన్నపాత్రుడి తీరుపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మాడుగుల, పెందుర్తి నియోజకవర్గాల్లో అయ్యన్న ఒంటెద్దు పోకడకు పోయినట్టు భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని ఎంపీ అవంతి శ్రీనివాస్ చెప్పినప్పటికీ హడావుడిగా మాడుగులలో కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టినట్టు సమాచారం. దీనిపై అయ్యన్నను నేరుగానే మందలించాలని భావించారు. అంతలోనే పెందుర్తి నియోజకవర్గంలో మరోసారి ఆయన జోక్యం వివాదాస్పదమైంది. ఈ రెండు వ్యవహారాల వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. దాంతో చంద్రబాబు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అయ్యన్న తీరుపై కొందరి వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
గంటాపై అపనమ్మకం!?
మరోవైపు మంత్రి గంటా వ్యవహార శైలి కూడా చంద్రబాబు తప్పుబడుతున్నారు. అయ్యన్న మాదిరిగా వీధినపడకపోయినప్పటికీ గంటా జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలతో ఓ వర్గాన్ని కూడగట్టడాన్ని సహించలేకపోతున్నారు. ఈ వర్గం అడపాదడపా సమావేశమవుతుండడం కూడా ఆయన దృష్టిలో ఉంది. ఈ భేటీలో భవిష్యత్తులో ఎలాంటి మలుపులైనా తిరగొచ్చని చంద్రబాబు సందేహిస్తున్నారు. దీన్ని ఆదిలోనే కట్టడి చేసే విషయాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నార
త్వరలో జిల్లా నేతలతో భేటీ
తాజా పరిణామాల నేపథ్యంలో జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాట చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. జిల్లా పార్టీ విభేదాలపై హైదరాబాద్‌లో తనను కలిసిన నేతలతో క్లుప్తంగా మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఈ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. చివరి సారిగా అందర్నీ హెచ్చరించాలని ఆయన భావిస్తున్నారు. అప్పటికీ మార్పు రాకపోతే తీవ్రమై నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు. మరి ఆయన అంత తీవ్ర చర్య తీసుకుంటారా?... తీసుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
తమ్ముళ్ల పోరు... బాబు బేజారు!
Published Sun, Mar 8 2015 12:38 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM