
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి
►కత్తులు, కర్రలతో బీభత్సం
►తీవ్రంగా గాయపడినా కేసు నమోదు చేయని పోలీసులు
►బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
లక్కిరెడ్డిపల్లె : మండలంలోని కుర్నూతల గ్రామం వాయల్‌రాజుగారిపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కొండూరు బాలకృష్ణంరాజు, సీతంరాజు, సరోజమ్మలపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు వేంపల్లె వెంకట్రామరాజు (గన్‌మెన్ రాజు), వేంపల్లె మల్లికార్జునరాజులు తమ వర్గీయులతో కత్తులు, కర్రలతో దాడి చేసి గాయపరిచారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని బాధితులు వాపోయారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.గతంలో జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ప్రచారం చేశారనే నెపంతో టీడీపీ వర్గీయులు వేంపల్లె వెంకట్రామరాజు(గన్‌మెన్‌రాజు), వేంపల్లె మల్లికార్జునరాజులు కక్ష పెంచుకున్నారు.
ఈ నేపథ్యంలో తాగునీటి బోరు వద్ద విద్యుత్ సమస్యపై మాటామాట పెరిగింది. పాతకక్షలను మనసులో ఉంచుకున్న టీడీపీ వర్గీయులు రాయచోటి నుంచి కొంతమంది మనుషులను తీసుకొచ్చి పిడిబాకులు, బండరాళ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.దాడి జరుగుతున్న సమయంలో కొందరు అడ్డుకోగా వారిపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండూరు బాలకృష్ణంరాజుకు ఎడమ భుజంపై పిడిబాకుతో దాడి చేస్తుండగా, అతని తల్లి కొండూరు సరోజమ్మ అడ్డుకోగా ఆమెపై బండరాళ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
దాడి విషయాన్ని తెలుసుకున్న రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, లక్కిరెడ్డిపల్లె జెడ్పీటీసీ సభ్యుడు మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, ఎంపీపీ అంబాబత్తిన రెడ్డెయ్యలు బాధితులను పరామర్శించారు. రాత్రి 11 గంటల వరకు పోలీసుస్టేషన్‌లో ఉండి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఎదుట వారు కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేయకపోతే న్యాయం జరిగేవరకు పోరాడతామని వారికి భరోసా ఇచ్చారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా దాడి చేస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట ఆ గ్రామ సర్పంచ్ గాదిముతక లక్ష్మిదేవి, ఎంపీటీసీ సభ్యుడు దిద్దికుంట విజయభాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ శివారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల నాయకులు జనార్ధన్‌రెడ్డి, రమణయ్య, సుబ్బయ్య తదితరులు ఉన్నారు.