సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘నువ్వు తమలపాకుతో ఒకటేస్తే...నేను తలుపుచెక్కతో రెండేస్తాను..’ అన్నట్టుగా ఉంది జిల్లా టీడీపీలో వర్గపోరు. జిల్లా పార్టీపై ఆధిపత్యం కోసం కరణం - దామచర్ల వర్గాలు ఎత్తులు పైఎత్తులతో కుస్తీపడుతున్నాయి. పార్టీలో పైచేయి సాధించేందుకు కరణం బలరాం వ్యూహం పన్నుతుంటే...జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ప్రతివ్యూహంతో తిప్పికొడుతున్నారు. దామచర్ల వ్యూహాత్మకంగా బలరాం ముందరికాళ్లకు బంధాలు వేస్తున్నారు. ఈ వ్యూహ ప్రతివ్యూహాలకు కాంగ్రెస్ నేతలు కేంద్రబింధువుగా మారడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన - సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ పరిస్థితి మునిగిపోయే నావలా తయారైంది. వ్యక్తిగతంగా కూడా ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటూ ఎవరు పిలుస్తారా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేతలే టీడీపీ వర్గపోరుకు అస్త్రాలుగా మారుతున్నారు. అలాంటి కాంగ్రెస్ నేతలను కరణం, దామచర్ల తమ వ్యూహాల్లో భాగస్వాములుగా చేసుకుంటున్నారు. జిల్లాలో అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పరిస్థితి కరణం - దామచర్ల ఎత్తులు జిత్తులతో మరింతగా దిగజారుతోంది.
దామచర్లపై కరణం కాంగ్రెస్ అస్త్రం!
అద్దంకి నియోజకవర్గంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో కరణం బలరాం ఒంగోలు ఎంపీ స్థానంపై దృష్టిపెట్టారు. కానీ అందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల ప్రతిబంధకంగా మారడంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అందుకే ముందు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో దామచర్లకు చెక్ పెట్టాలని ఆయన భావించారు. దామచర్లకు పోటీగా ఒంగోలు నియోజకవర్గంలో కొత్త నేతను తెరపైకి తేవాలని పావులు కదిపారు. అందుకోసమే జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతతో బలరాం సంప్రదింపులు జరిపారు. కాంగ్రెస్ పరిస్థితి మునిగిపోయే నావలా ఉండటంతోపాటు ఆ ముఖ్య నేత వ్యక్తిగతంగా కూడా నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన్ని తమ గుటిలోకి తీసుకువచ్చి దామచర్ల జనార్దన్‌కు చెక్ పెట్టాలని బలరాం భావించారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ ముఖ్యనేతను అభ్యర్థిగా ప్రతిపాదించి తద్వారా ఒంగోలులో జనార్దన్‌కు స్థానం లేకుండా చేయాలన్నది ఆయన వ్యూహం. ఈమేరకు చాపకింద నీరులా పావులు కదిపారు. విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.
కానీ...బలరాంకు దామచర్ల ఝలక్!
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో బలరాం ఎత్తుగడను గుర్తించిన దామచర్ల జనార్దన్ ఎదురుదాడి చేశారు. బలరాం ప్రతిపాదించిన కాంగ్రెస్ ముఖ్య నేతకు వ్యతిరేకంగా అధినేత చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు. సదరు కాంగ్రెస్ నేత తన నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న ప్రజా వ్యతిరేకతను చంద్రబాబుకు జనార్దన్ నివేదించారు. అదే విధంగా ఆయన గత నాలుగేళ్లలో టీడీపీ కార్యకర్తలను ఎంతగా ఇబ్బంది పెట్టిందీ వివరించారు. ఆయన్ను పార్టీలో చేర్చుకుంటే తాము వ్యతిరేకిస్తామని తేల్చిచెప్పారు. దాంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. అంతేకాదు బలరాంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. వివాదాస్పదులను ఎందుకు పార్టీలోకి తేవాలనుకుంటున్నావని సున్నితంగా మందలించినట్టు తెలుస్తోంది. ‘అసలే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఇక ఇలాంటి వారు వస్తే డిపాజిట్టు కూడా దక్కదు’ అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. దామచర్ల వేసిన ప్రతివ్యూహంతో బలరాం కంగుతినాల్సి వచ్చింది.
బలరాం కట్టడికి దామచర్ల సై...
బలరాంపై పైచేయి సాధించిన జనార్దన్ ఎదురుదాడికి మరింత పదును పెట్టారు. అసలు ఆయనకు ఎంపీ టికెట్టు రాకుండా చేయడం కోసం ముందస్తు వ్యూహానికి తెర తీశారు. బలరాం మాదిరిగానే కాంగ్రెస్ అస్త్రాన్నే ప్రయోగించాలని నిర్ణయించారు. ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఓ కాంగ్రెస్ నేతతో మంతనాలు సాగించారు. ఆయన పార్టీలోకి వస్తే ఎంపీ అభ్యర్థిగా ప్రతిపాదిస్తామని చెప్పారు. తద్వారా బలరాంను అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గానికే పరిమితం చేయాలన్నది జనార్దన్ వ్యూహం. అద్దంకి నియోజకవర్గంలో బలరాం చాలా బలహీనంగా ఉన్నారు. ఈ విషయం తెలిసే జనార్దన్ ఆ ఎత్తుగడ వేశారు. భవిష్యత్తులో తనకు బలరాం ప్రతిబంధకంగా మారకుండా చేయాలన్నది ఆయన వ్యూహంగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కరణం-దామచర్ల వర్గ విభేదాల పీటముడి మరింతగా బిగుసుకుంటోంది.