ఇంటి ‘గుట్టు’ రట్టు  | TDP Corruption In The Grant Of Houses In Srikakulam District | Sakshi
Sakshi News home page

ఇంటి ‘గుట్టు’ రట్టు 

Published Thu, Dec 12 2019 9:18 AM | Last Updated on Thu, Dec 12 2019 9:18 AM

TDP Corruption In The Grant Of Houses In Srikakulam District - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : తీగ లాగితే ఇళ్ల అక్రమాల డొంక కదిలింది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొత్త ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని విచారించేసరికి బోగస్‌ ఇళ్ల బాగోతం వెలుగు చూస్తోంది. గత ఐదేళ్లలో జన్మభూమి కమిటీల ముసుగులో చెలరేగిపోయిన తెలుగు తమ్ముళ్ల స్వాహా పర్వం బట్టబయలైంది. టీడీపీ హయాంలో మంజూరైన వాటిలో  32 వేల ఇళ్లను పరిశీలిస్తే 1822 ఇళ్లు అనర్హత గలవని అధికారులు గుర్తించారు. వాటికి కోటి 78లక్షల 92వేలు చెల్లించేశారు. గృహ నిర్మాణ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా వాస్తవాలు వెలుగు చూశాయి. ఇప్పటివరకు చెల్లించిన ఆ బిల్లులు రాబట్టేందుకు ప్రస్తుతం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

తమ్ముళ్ల అక్రమాలు..  
గత ఐదేళ్ల కాలంలో టీడీపీ చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. మొదటి రెండేళ్లు ఇళ్లే మంజూరు చేయకుండా అర్హులైన వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. ఒక్కో ఇంటికి రూ. 25వేల నుంచి రూ. 50వేలు చొప్పున మంజూరు చేస్తామంటూ జన్మభూమి కమిటీల ముసుగులో టీడీపీ నేతలు వసూళ్లకు తెరలేపారు. ఆ తర్వాత ఇళ్లు మంజూరు చేయకుండా నిర్మాణాలు చేపట్టినట్టు 19వేల ఇళ్లకు రికార్డులను సృష్టించారు. వాటిలో కొన్ని నిర్మించినా చాలావరకు నిర్మించకుండానే బిల్లులు కొట్టేద్దామని ఎత్తుగడ వేశారు. ఇక, ఎనీ్టఆర్‌ హౌసింగ్, గ్రామీణ్‌ హౌసింగ్, హౌస్‌ ఫర్‌ ఆల్‌ అంటూ దాదాపు దాదాపు 80వేల వరకు ఇళ్లు మంజూరు చేశారు. వీటికి కూడా సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో ప్రారంభాలు సక్రమంగా జరగలేదు.

తేలిన బోగస్‌ ఇళ్లు..  
టీడీపీ అధికారం నుంచి దిగే పోయే సరికి 32,225 ఇళ్లు మాత్రం పూర్తి చేసినట్టు చూపించారు. కానీ అధికారంలో ఉన్న కాలంలో వాటికి బిల్లులు పూర్తిగా చెల్లించలేదు. దాదాపు రూ. 81.66కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉందని హౌసింగ్‌ అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి నివేదించారు. వీటిలో చాలా వరకు నకిలీలు, బోగస్‌ ఇళ్లు ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో ప్రస్తుత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో హౌసింగ్‌ అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేసేసరికి 1822 ఇళ్లు బోగస్‌ అని తేలింది. కాకపోతే, వాటిలో 1761 ఇళ్లకు సంబంధించి కోటి 78లక్షల 92వేల రూపాయలు చెల్లింపులను గత ప్రభుత్వం చేసేసింది. దీనికంతటికీ నాటి పాలకుల ఒత్తిళ్లు, అ«ధికారులు వాస్తవా లు చూడకుండా చెల్లింపులు చేయడమే కారణం. ఇప్పుడా సొమ్ము రికవరీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  

వసూలు చేసేందుకు చర్యలు..
క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత 1862 ఇళ్లు అనర్హత గలవని తేలాయి. వాటిలో 1761 ఇళ్లకు రూ. కోటి 78 లక్షల 92వేల చెల్లింపులు జరిగిపోయాయి. ఇప్పుడు వాటిని వసూలు చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకే క్షేత్రస్థాయి పరిశీలన చేయగా వీటి వివరాలు బయటపడ్డాయి.
– టి.వేణుగోపాల్, ప్రాజెక్టు డైరెక్టర్, గృహ నిర్మాణ సంస్థ, శ్రీకాకుళం

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement