సమష్టిగా పనిచేసి పూర్వవైభవం తీసుకొద్దాం | TDP exercise for back to its former glory | Sakshi
Sakshi News home page

సమష్టిగా పనిచేసి పూర్వవైభవం తీసుకొద్దాం

Published Mon, May 25 2015 12:29 AM | Last Updated on Fri, Aug 10 2018 8:30 PM

TDP exercise for back to its former glory

శ్రీకాకుళం అర్బన్: టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అందరమూ కలిసికట్టుగా పనిచేద్దామని రాష్ట్ర కార్మికశాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఆదివారం టీడీపీ జిల్లా మినీమహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు పర్యాయాలు టీడీపీ అధ్యక్షునిగా చౌదరి బాబ్జి పనిచేసి పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేశారన్నారు. ప్రస్తుత అధ్యక్షురాలు శిరీష కూడా రాజకీయ నేపధ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తని, ఆమెకు నాయకులు, కార్యకర్తలు సహకరించాలన్నారు. జిల్లాలో అన్ని వనరులు ఉన్నప్పటికీ వినియోగించుకోలేకపోతున్నామని, రెండేళ్లలో జిల్లాను అగ్రగామిగా ఉంచుదామన్నారు.
 
 జూలై నెలాఖరుకు తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. నారాయణపురం ఆనకట్ట నిర్మాణానికి కూడా కృషిచేస్తామన్నారు. చంద్రబాబు నిర్ణయాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా పవర్‌కు లోటులేదన్నారు. అధికారం చేపట్టి వచ్చేనెల 2వ తేదీకి ఏడాది కావస్తోందని, జిల్లాలోని అన్ని గ్రామాల్లో నవనిర్మాణదీక్ష కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రభుత్వ విప్ రవికుమార్ మాట్లాడుతూ ఓర్పు, సహనం, అవగాహనతో  మూడు తరాలను కలుపుకొంటూ పనిచేయాలని పార్టీ అధ్యక్షురాలు శిరీషకు సూచించారు. జిల్లా మహానాడులో మొదటితీర్మానంగా ఆమదాలవలసలోని సుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు చేపట్టాలని, దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పెట్టాలని కోరారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీని బలోపేతం చేస్తానన్నారు.
 
 ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి మాట్లాడుతూ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా శిరీష పనిచేయాలన్నారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ 32సంవత్సరాలుగా పార్టీ కొనసాగుతూ వస్తోందంటే దానికి కారణం కార్యకర్తలేనన్నారు. వారి అభిప్రాయానికి అనుగుణంగానే పార్టీ నడుస్తుందని స్పష్టం చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి మాట్లాడుతూ ఏడాది కాలంలో *20 కోట్లతో మంచినీటి సమస్యలు పరిష్కరించినట్టు వెల్లడించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ మాట్లాడుతూ జిల్లాలో పార్టీని పరుగెత్తించాల్సిన అవసరం ఉందన్నారు.
 
 శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణ అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ప్రజలపక్షాన పోరాడే పార్టీ టీడీపీగా కొనియాడారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాట్లాడుతూ ఉద్దానం ప్రాజెక్టుకు ఎర్రన్న పేరు పెట్టాలని తీర్మానం చేశారు. ఈ సమావేశానికి ముందుగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్, ఎర్రన్న చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చౌదరి బాబ్జి, హరిబాబునాయుడు, బి. మాధురి, నిమ్మక జయకృష్ణ, బి.గోవిందరాజులు, ఎ. మోహనరావు, ఎల్.ఎల్.నాయుడు, కె.అప్పలనాయు డు, ఎం.వెంకటేష్, జామి బీమశంకర్, పి.వి.రమణ, ఎస్.చంద్రమోహన్, కె.అప్పలనాయుడు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement