నాటి మాటల్ని.. కానివ్వకండి..నీటిమూటలు
మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ నెరవేర్చండి
విలీన మండలాల సమస్యల్ని పరిష్కరించండి
చంద్రబాబును కోరిన జిల్లా తెలుగుదేశం
అన్నవరం మినీమహానాడులో పలు తీర్మానాలు
అన్నవరం:జిల్లాకు సంబంధించి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అన్ని హామీలను పూర్తిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కోరుతూ జిల్లా తెలుగుదేశం మినీమహానాడులో తీర్మానించారు. అన్నవరం శివారు వల్లభ ఎస్టేట్‌లో ఆవరణలో ఆదివారం జరిగిన మినీ మహానాడుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఇన్చార్జి, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. చినరాజప్ప ప్రసంగిస్తూ పోలవరం ప్రాజెక్ట్‌ను నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఖమ్మం జిల్లాలోని నాలుగు మండలాలను ఆంధ్రలో కలపడం వెనుక చంద్రబాబు కీలకపాత్ర పోషించారన్నారు.
అందుకే ఈ రబీ లో నీటి ఎద్దడి ఏర్పడినా సీలేరు, శబరి నుంచి నీరు తెచ్చుకుని పండించుకున్నామన్నారు. విలీన మండలాల ప్రజలకు గల పెక్కు సమస్యలను పరిష్కరించాలని సీఎం ను కోరుతూ తీర్మానించారు. కాకినాడలో నిర్మించతలపెట్టిన పెట్రోలియం ప్రాజెక్ట్‌కు వెంటనే భూమి పూజ చేసి పనులు ప్రారంభించాలని, రాజమండ్రిలో రూ.80 కోట్లతో నిర్మించనున్న టూరిజం ప్రాజెక్ట్ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని కోరుతూ తీర్మానించారు. సుబ్బారెడ్డి ప్రాజెక్ట్, చంద్రబాబు సాగర్, ఏలేరు, తదితర ప్రాజెక్టుల ఆధునికీకరణ, కాల్వల నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ తీర్మానించారు. రైతు రుణమాఫీ అమలు చేసినందుకు సీఎంను అభినందించారు.
అధికారుల గుణగణాలు పరిశీలించండి..
ఎవరైనా అధికారి బదిలీకి సిఫార్స్ చేసేముందు నీతిమంతుడో, కాదో తెలుసుకుని సిఫార్స్ చేయాలని దేవినేని ప్రజాప్రతినిధులకు సూచించారు. అవినీతిపరులకు సిఫార్స్‌చేస్తే ఆ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. 2013-2015 మధ్య మృతి చెందిన జిల్లా టీడీపీ నాయకులకు సంతాపం ప్రకటించే తీర్మానంతో బాటు ఆర్థిక వ్యవహారాలు, శాంతిభద్రతలు, సాగు నీటి సమస్య, సంక్షేమం, మేనిఫెస్టోలో చేర్చిన అంశాలు, పారిశ్రామిక ప్రగతి, ఈ గవర్నెన్స్, గిరిజన, మహిళా సంక్షేమం తదితర అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీలు మురళీమోహన్, పండుల రవీంద్రబాబు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడే జిల్లాలో పార్టీకి సుప్రీం
జిల్లా ఇన్చార్జి, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రసంగిస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు జిల్లాలో పార్టీకి సుప్రీం అని, మంత్రులైనా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలైనా ఆయన సూచనల మేరకు నడవాల్సిందేని అన్నారు. ‘పదేళ్లు అధికారానికి దూరమై ఎన్నో బాధలు పడ్డాం. ఇంక అలాంటి పరిస్థితి రానీయవద్దు. కార్యకర్తలు, నాయకులు అంతా కలిసికట్టుగా సాగుదాం’ అన్నారు. ‘ఇకపై పార్టీ సమావేశాలు మొక్కుబడిగా కాకుండా బాధ్యతాయుతంగా జరగాలి. జెడ్పీ సమావేశానికి ముందు పార్టీ జిల్లా మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఇన్చార్జి మంత్రిగా నే ను కూడా వస్తా. జెడ్పీ సమావేశం కూడా 8 గంటలు జరగాలి. అన్నీ చర్చించాలి’ అన్నారు. ఎన్నికలప్పుడు జిల్లా మేనిఫెస్టోలో పెట్టిన అన్ని నీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మినీ మహానాడు తీర్మానాలపై 27, 28, 29 తేదీల్లో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు.