Chaudhary babji
-
సమష్టిగా పనిచేసి పూర్వవైభవం తీసుకొద్దాం
శ్రీకాకుళం అర్బన్: టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అందరమూ కలిసికట్టుగా పనిచేద్దామని రాష్ట్ర కార్మికశాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఆదివారం టీడీపీ జిల్లా మినీమహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు పర్యాయాలు టీడీపీ అధ్యక్షునిగా చౌదరి బాబ్జి పనిచేసి పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేశారన్నారు. ప్రస్తుత అధ్యక్షురాలు శిరీష కూడా రాజకీయ నేపధ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తని, ఆమెకు నాయకులు, కార్యకర్తలు సహకరించాలన్నారు. జిల్లాలో అన్ని వనరులు ఉన్నప్పటికీ వినియోగించుకోలేకపోతున్నామని, రెండేళ్లలో జిల్లాను అగ్రగామిగా ఉంచుదామన్నారు. జూలై నెలాఖరుకు తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. నారాయణపురం ఆనకట్ట నిర్మాణానికి కూడా కృషిచేస్తామన్నారు. చంద్రబాబు నిర్ణయాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా పవర్‌కు లోటులేదన్నారు. అధికారం చేపట్టి వచ్చేనెల 2వ తేదీకి ఏడాది కావస్తోందని, జిల్లాలోని అన్ని గ్రామాల్లో నవనిర్మాణదీక్ష కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రభుత్వ విప్ రవికుమార్ మాట్లాడుతూ ఓర్పు, సహనం, అవగాహనతో మూడు తరాలను కలుపుకొంటూ పనిచేయాలని పార్టీ అధ్యక్షురాలు శిరీషకు సూచించారు. జిల్లా మహానాడులో మొదటితీర్మానంగా ఆమదాలవలసలోని సుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు చేపట్టాలని, దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పెట్టాలని కోరారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీని బలోపేతం చేస్తానన్నారు. ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి మాట్లాడుతూ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా శిరీష పనిచేయాలన్నారు. ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ 32సంవత్సరాలుగా పార్టీ కొనసాగుతూ వస్తోందంటే దానికి కారణం కార్యకర్తలేనన్నారు. వారి అభిప్రాయానికి అనుగుణంగానే పార్టీ నడుస్తుందని స్పష్టం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి మాట్లాడుతూ ఏడాది కాలంలో *20 కోట్లతో మంచినీటి సమస్యలు పరిష్కరించినట్టు వెల్లడించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ మాట్లాడుతూ జిల్లాలో పార్టీని పరుగెత్తించాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణ అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ప్రజలపక్షాన పోరాడే పార్టీ టీడీపీగా కొనియాడారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాట్లాడుతూ ఉద్దానం ప్రాజెక్టుకు ఎర్రన్న పేరు పెట్టాలని తీర్మానం చేశారు. ఈ సమావేశానికి ముందుగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్, ఎర్రన్న చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చౌదరి బాబ్జి, హరిబాబునాయుడు, బి. మాధురి, నిమ్మక జయకృష్ణ, బి.గోవిందరాజులు, ఎ. మోహనరావు, ఎల్.ఎల్.నాయుడు, కె.అప్పలనాయు డు, ఎం.వెంకటేష్, జామి బీమశంకర్, పి.వి.రమణ, ఎస్.చంద్రమోహన్, కె.అప్పలనాయుడు పాల్గొన్నారు. -
కార్యకర్తల అభీష్టం మేరకే పాలన
శ్రీకాకుళం సిటీ: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే ప్రధాన కారణమని, వారి ఆలోచనలు, సూచనల మేరకు ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు చెప్పారు. గురువారం ఆయన స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ నెల 17, 18 తేదీల్లో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటిస్తారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో పాలన గాడిలో పడాల్సి ఉందన్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి కలెక్టర్ 90 సెంట్ల భూమి కేటాయించారని, ప్రతి కార్యకర్త గర్వపడేలా భవనం నిర్మిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రదర్శించిన వైఖరి సరిగా లేదన్నారు. విధాన నిర్ణయాలు వ్యతిరేకించే అధికారుల భరతం పడతాం:కూన ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ అధికారులెవరైనా సరే టీడీపీ ప్రభుత్వ పరంగానే పనిచేయా ల్సి ఉంటుందని, అలాకాకుండా పార్టీ విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తే వారి భరతం పడతామని హెచ్చరించారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని చెప్పారు. ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ జిల్లా సమర్థులకే పార్టీ పదవులు కట్టబెట్టిందని, జిల్లా ప్రగతి పథం పడుతుందని పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయానికి తన తండ్రి ఎర్రన్నాయుడు పేరు పెట్టాలని కోరారు. చౌదరి బాబ్జీ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ వైభవానికి దివంగత ఎర్రంనాయుడే కారణమని, జిల్లాకు, పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని తీర్మానం చేశామన్నారు. అంతకుముందు పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ పదేళ్లుగా ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి, శ్రీకాకుళం, నరసన్నపేట, ఇచ్ఛాపురం ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబునాయుడు, మాజీ ఎమ్మెల్యేలు దువ్వాడ నాగావళి, తలే భద్రయ్య, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జిలు శత్రుచర్ల విజయరామరాజు, నిమ్మక జయకృష్ణ, జిల్లా పార్టీ ముఖ్యులు పి.వి.రమణ, పేర్ల గోవిందరాజులు, జామి భీమశంకర్, గొండు వెంకటరమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.