నిధులిచ్చేది మా పార్టీ... దోపిడీ చేసేది టీడీపీ
బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు ఏరువ
దర్శి : బీజేపీ రాష్ట్రానికి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయమంటే ఇక్కడ టీడీపీ ఆ నిధులన్నీ దిగమింగుతున్నారని జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షుడు ఏరువ లక్ష్మీనారాయణరెడ్డి మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మార్చి 6 న రాజమండ్రిలో జరిగే అమిత్‌షా బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ భారతీయ జనతాపార్టీ కరపత్రాలను విడుదల చేసింది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా, విశ్వవిద్యాలయాల ప్రారంభం, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఏడు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం, పారిశ్రామిక పోత్సాహకాలు, రూ. 65వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులు, కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు జాతీయ జలమార్గం, పట్టణ పేదలకు రూ.1.93 లక్షలతో ఇళ్లు, స్మార్ట్ సిటీలు, నూతన రాజధానికి రూ.1500 కోట్ల మంజూరు తదితరాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవేనన్నారు.
ఇసుక మాఫియా, రాజధాని భూముల మాఫియాలు, పట్టిసీమ, కాల్‌మనీలు వీటిలో ఏఏ నేతలు ఉన్నారో ప్రజలకు తెలుసని, తెలియని వారికి కూడా త్వరలో తెలియచెప్తామన్నారు. కేంద్రంలో టీడీపీ నమ్మకాన్ని కోల్పోయిందని, గతంలో ఇచ్చిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేసి లెక్క చెప్పకపోవడం వల్లే పరిస్థితులు మారుతున్నాయని అన్నారు. ఈ నెల 6న జరిగే బహిరంగ సభలో ఈ విషయాలపై అమిత్‌షా మాట్లాడతారన్నారు.