జీవితమే రద్దయ్యింది!
నెలకిన్ని తిండి గింజలు పెడుతున్న రేషన్ కార్డు పోయింది.. దాంతో పాటే పింఛన్‌నూ రద్దు చేసిపారేశారు. ఆ పేద వృద్ధుడికి రెండు రేషన్ కార్డులున్నాయని సర్వే బృందాల తప్పుడు రిపోర్టే దీనికి కారణం. తనకు ఒకటే కార్డుంది మొర్రో.. అంటూ మూడు నెలలుగా ఆ వృద్ధుడు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. కార్డు, పింఛను పునరుద్ధరించాలని అధికారులను వేడుకున్నాడు. ఇంతలో తుపాను వచ్చింది. ఆపై తెగుళ్లు దాడి చేశాయి. పంటంతా ఊడ్చేశాయి. అప్పులు మాత్రం మిగిలాయి. కౌలు రైతును మానసిక క్షోభకు గురి చేశాయి. రద్దయిన కార్డు, పింఛన్ పునరుద్ధరణ కావన్న బెంగతో ఆ పేద రైతు తన జీవితాన్నే రద్దు చేసుకున్నాడు.
పేటపాడు (కోటబొమ్మాళి):అదికారుల నిర్లక్ష్యం ఓ పేద రైతు జీవితాన్ని బలిగొంది. అతని కుటుంబాన్ని అనాథలను చేసింది. ఎంతోకొంత ఆసరాగా ఉన్న రేషన్ కార్డు, వృద్ధాప్య పింఛను రద్దు కావడం, అదే సమయంలో పంట నాశనమై అప్పులు మిగలడం కోటబొమ్మాళి మండలం రేగులపాడు పంచాయతీ పేటపాడుకు చెందిన కౌలురైతు సంపతిరావు బలరామ్(66)ను కుంగదీశాయి. ఆత్మహత్యకు పురిగొల్పాయి.సెంటు భూమి కూడా లేని పేద రైతు అయిన బలరాం కుటుంబ పోషణ కోసం గ్రామానికి చెందిన ఇతర రైతుల నుంచి 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. సుమారు రూ.80 వేల అప్పులు చేసి వరి సాగు చేశాడు. నెలరోజుల క్రితం హుద్‌హుద్ తుపాను చేసిన దాడిలో పంట చాలావరకు పోయింది. ఆ తర్వాత తెగుళ్లు సోకి మిగిలిన కాస్త పంటనూ నాశనం చేశాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమయ్యాడు.
ఈ పేద కుటుంబానికి డబ్ల్యూఎపి 012868400129 నంబర్‌తో తెల్ల రేషన్‌కార్డు ఉండేది. దీనికి తోడు ఆరేళ్లుగా బలరామ్‌కు వృద్ధాప్య పింఛన్ అందుతోంది. వాటి సాయంతో కుటుంబం కొంతవరకు గట్టెక్కేది. కానీ మూడు నెలల క్రితం ప్రభుత్వం చేపట్టిన పింఛన్ లబ్ధిదారుల సర్వే బలరాం కుటుంబానికి శరాఘాతంగా మారింది. వీరికి రెండుచోట్ల రేషన్‌కార్డులు ఉన్నాయని సర్వే అధికారులు తేల్చడంతో రేషన్ కార్డుతోపాటు పింఛన్‌నూ అధికారులు రద్దు చేసేశారు. అప్పటి నుంచి తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ బలరాం ప్రదక్షిణలు చేస్తున్నాడు. తమ కుటుంబానికి ఒక్క రేషన్‌కార్డే ఉందని, అదే తమకు ఆధారమని.. కార్డుతోపాటు పింఛన్‌నూ పునరుద్ధరించాలని అధికారులను వేడుకున్నాడు. అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించాడు. అయినా ఎవరూ కనికరించలేదు. ఇదే సమయంలో తుపాను దాడిలో చేతికి రావాల్సి పంట పోయింది. కళ్ల ముందు రూ. 80 వేల అప్పు కొండలా కనిపిస్తోంది. వీటన్నింటితో బలరాం తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యాడు. కుటుంబ పోషణ కష్టమని, బతకలేనన్న అభిప్రాయనికొచ్చాడు.
సోమవారం రాత్రి 8 గంటల సమయంలో తన పొలం వద్దే పురుగుల మందు తాగి ఇంటి చేరుకున్నాడు. అస్వస్థతకు గురైన ఆయన నుంచి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం ఆస్పత్రిలోనే బలరాం మృతి చెందాడు. మృతునికి భార్య తులసమ్మ, కుమారుడు లక్ష్మణరాజు ఉన్నారు. రేషన్‌కార్డు, పింఛన్ రద్దు కావడం, పంట పోవడంతో కుంగిపోయిన తన భర్త రోజూ ఇదే విషయం చెబుతూ మధనపడేవారని వివరిస్తూ తులసమ్మ భోరున విలపించింది. ఏ ఆధారం లేక అనాధలమైన తమ కుటుంబాన్ని ఫ్రభుత్వమే ఆదుకోవాలని ఆమె కోరారు. మంచి వ్యక్తిగా గ్రామంలో పేరుపొందిన బలరాం బలవన్మరణంతో పేటపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి.నారాయణమూర్తి తెలిపారు