కమిటీల కర్ర పెత్తనం
గ్రామాల్లో జన్మభూమి
కమిటీల అరాచకం
అర్హులను సైతం నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న వైనం
కమిటీలకే వత్తాసు
పలుకుతున్న అధికారులు
అనంతపురం సెంట్రల్ :జన్మభూమి కమిటీలు గ్రామాల్లో కర్ర పెత్తనం చలాయిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పక్షపాత ధోరణితో అర్హులకు సైతం తీరని అన్యాయం చేస్తున్నాయి. కమిటీ సభ్యుల కనుసన్నల్లో లేకపోతే పథకాలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. అధికారులు కూడా వారు చెప్పిందే శాసనంగా అమలు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో జన్మభూమి కమిటీల సిఫారసుతో 44,417 మందికి పింఛన్ తొలగించారు. కొత్తగా 27,071 పింఛన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా గతంలో తొలగించిన వారిలో కొంతమందికి పునరుద్ధరించినా.. ఇంకా చాలామంది అర్హులకు అందడం లేదు. జిల్లావ్యాప్తంగా దాదాపు 84 వేల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. వీరందరికీ ఎప్పటిలోగా మంజూరు చేస్తారో అర్థం కావడం లేదు.
ప్రతినెలా రూ.1.83 కోట్ల మిగులు
ప్రస్తుతం వికలాంగులు 2,084 మంది, వృద్ధులు, వితంతువులు, ఇతరులు కలిపి 15,262 మందికి పింఛన్ రద్దు చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి ప్రతినెలా రూ.1.83 కోట్లు మిగులుతోంది. అభయహస్తం పింఛన్ దారులకు వాస్తవానికి రూ.1,500 చొప్పున ఇవ్వాల్సి ఉండగా .. అందరితో సమానంగా రూ.వెయ్యి మాత్రమే పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రూ.200 పింఛన్ మొత్తానికి అదనంగా రూ.300 కలిపి మొత్తం రూ.500 అభయహస్తం లబ్ధిదారులకు ఇచ్చేవారు. ప్రస్తుతం పింఛన్ మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచడంతో అభయహస్తం లబ్ధిదారులకు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. ప్రభుత్వం అదనపు మొత్తం గురించి పట్టించుకోవడం లేదు. దీనివల్ల ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి డ్వాక్రా మహిళలు ముందుకు రావడం లేదు.