నవీన రీతి..ప్రగతి ఏ గతి
కొత్త ఆశలు.. కోటి కాంతులు.. నవీన రీతుల నడుమ ప్రజానీకానికి సంబరాలు తీసుకొచ్చిన కొత్త సంవత్సరంలో అయినా పశ్చిమగోదావరి జిల్లా ప్రగతి ప్రభవిస్తుందా.. ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక.. అలా అలా గడిపేసిన టీడీపీ నూతన సంవత్సరంలో అయినా హామీల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందా.. ఇప్పటికే రుణమాఫీ సహా వాగ్దానాల అమలులో దారుణంగా విఫలమైన సర్కారుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో సమరశంఖం పూరించనుంది.. కొన్నేళ్లుగా మసకబారిన కమ్యూనిస్టులు ఈ ఏడాదిలో ప్రజా ఉద్యమాలతో పుంజుకుంటారా.. టీడీపీ పొత్తుతో నలిగిపోతున్న భాజపా శ్రేణులు కొత్త సంవత్సరంలో సొంతంగా ఏ మాత్రం బలం పుంజుకుంటారు.. నూతన సంవత్సరంలో జిల్లా రాజకీయ ముఖచిత్రంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి.. జిల్లాలో ప్రగతి ఏ మేరకు సాగుతుందనే అంశాలపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, ఏలూరు :రాజధాని భాగ్యం దక్కకపోయినా రాజధానికి రాదారి అయిన పశ్చిమగోదావరి జిల్లా నవ్యాంధ్రలో అయినా సిసలైన ప్రగతి ద్వారాలను తెరచుకుంటుందన్న ఆశలు ఫలి స్తాయూ.. లేక అత్యాశలే అవుతాయా అన్నది ఈ కొత్త సంవత్సరంలోనే తేలిపోనుంది. విద్య, వైద్య, వాణిజ్య రంగాలకు పెట్టని కోటగా.. తెలుగువాడి జీవనాడి అయిన ‘పశ్చిమ’లో వనరుల్ని, ప్రత్యేకతలను మునుపెన్నడూ లేనంతటి స్థాయిలో వినియోగిస్తామని పాలకులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు కనీస కార్యాచరణ ప్రకటించలేదు. సహజ వనరులతో, ప్రాథమిక సదుపాయాలతో అలరారుతూ పరిశ్రమల స్థాపనకు భౌగౌళికంగా మన జిల్లా అనువుగా ఉన్నా.. పారిశ్రామికంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధించలేదు. జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని చెబుతున్న పాలకులు ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ రూపొందించలేదు. జిల్లా అభివృద్ధిపై గళం విప్పాల్సిన ప్రజాప్రతి నిధులు ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయూలని అడిగే ధైర్యం లేక కాలం వెళ్లదీస్తున్నారు.
వాగ్దాన భంగంతో చేటు
అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీసిన టీడీపీ నేతలు కొత్త సంవత్సరంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోనున్నారనే చెప్పాలి. ఇప్పటికే రుణమాఫీ అమలులో అవకతవకలతో జిల్లా రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కౌలు రైతులు, డ్వాక్రా మహిళలు నిస్తేజంలో కొట్టుమిట్టాడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టి పట్టిసీమ ఎత్తిపోతల పథకంపైనే దృష్టి పెట్టిన రాష్ర్ట ప్రభుత్వ నిర్వాకంపై డెల్టా రైతులు ఎడతెగని పోరాటాలకు సిద్ధమవుతున్నారు. గడచిన ఆరు నెలల కాలంలో చూస్తాం.. చేస్తామంటూ చెప్పుకొచ్చిన టీడీపీ నేతలు 2015లో ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. సర్కారు తీరుపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అధికార పక్షం ఇబ్బందులు పడక తప్పదని జిల్లావ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు స్పష్టం చేస్తున్నారుు.
వైఎస్సార్ సీపీ పునరుత్తేజం
సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని పరాజయంతో కుదేలై.. టీడీపీ నేతల అరాచకాలు, దాడులతో దిగాలు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణులు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మనోధైర్యంతో పునరుత్తేజం పొందారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలన్న లక్ష్యంతో పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించారు. వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ జిల్లా సారథిగా బాధ్యతలు చేపట్టిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు జరిపారు. పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలతో రుణమాఫీ మొదలు అన్ని హామీల అమల్లో నయవంచనకు గురైన రైతులు, మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు బాసటగా నిలిచారు. ఆరు నెలల కాలంలోనే పడిలేచిన కెరటంలా ఎగసిన వైఎస్సార్ సీపీ 2015లో ప్రజా ఉద్యమాల ద్వారా సమరోత్సాహంతో మరింత ముందుకు దూసుకువెళ్తోంది. అన్నీ గెలిచామని విర్రవీగుతున్న టీడీపీ శ్రేణులకు రానున్న కాలంలో ప్రజా వ్యతిరేకత చూసి ముచ్చెమటలు పట్టడం ఖాయమని నమ్మిన వైఎస్సార్ సీపీ జిల్లా శ్రేణులు ప్రజలతో మమేకమై పోరాటాలకు సిద్ధమవుతున్నారు.
వామపక్షాల పోరుబాట
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉనికే ప్రశ్నార్థకంగా మారడంతో కమ్యూనిస్టు నాయకులు పూర్తిగా పోరాటాలపైనే దృష్టి సారిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రణాళికలు రచించుకుంటున్నారు. రుణమాఫీ జాప్యం, అమలులో మోసాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగడూతూ బ్యాంకుల ఎదుట ధర్నాలు చేస్తున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన బి.బలరాం కొత్త సంవత్సరాన్ని ప్రభుత్వంపై పోరాటాల సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు. హామీల అమలే లక్ష్యంగా ఉద్యమాలు చేపట్టేందుకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. రైతుల సమస్యలపైనే కాదు.. నిరుపేదల పక్షాన నిలబడి ఎక్కవగా పోరాటాలు చేస్తామంటూ సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ ఎడతెగని ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నారు.
పార్టీ పునాదులపై కమల నాథుల కన్ను
భారతీయ జనతా పార్టీ నేతలు ఈ ఏడాదిలో జిల్లావ్యాప్తంగా పార్టీ పునాదులను బలంగా నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నారు. అయితే వాస్తవ పరిస్థితి ఆశాజనకంగా కానరావడం లేదు. జిల్లాలో ఓ ఎంపీ, ఓ మంత్రి ఉన్నా.. రెండు మూడు నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడా పార్టీ ప్రభావం కానరావడం లేదన్నది నిర్వివాదాంశం. పార్టీ సభ్యత్వ నమోదు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో నిస్తేజంగా ఉన్న బీజేపీ నేతలకు జనసేన వ్యవహారం తలనొప్పిగా పరిణమిస్తోంది. జిల్లాలో అక్కడక్కడా జనసేన పేరిట హల్‌చల్ చేస్తున్న యువతలో ఎక్కువమంది కమలనాథులే. ఇంకా ఓ రూపులోని ఆ పార్టీ పేరిట హడావుడి చేస్తున్న యువకులు బీజేపీ యువమోర్చా వైపు కన్నెత్తి చూడటం లేదట. ఈ నేపథ్యంలో కేవలం ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌నే ప్రచారాస్త్రంగా చేసుకుని పార్టీకి జిల్లాలో ఓ రూపు తీసుకురావాలని బీజేపీ నేతలు యత్నిస్తున్నారు. ఓ పక్క టీడీపీతో పొత్తు, మరో పక్క జనసేనతో మితృత్వం నేపథ్యంలో పశ్చిమలో 2015లో కమల వికాసం ఎలా సాధ్యమో చూడాల్సిందే.