
అంత్యోదయానికీ అడ్డుచక్రం
శ్రీకాకుళం పాతబస్టాండ్: పేదల సంక్షేమమే లక్ష్యమని ఢంకా బజాయిస్తున్న టీడీపీ సర్కారు కొత్త పథకాల మాటెలా ఉన్నా.. ఉన్న పథకాల ఊపిరి తీసేస్తోంది. చివరికి నిరుపేదల కు నెలనెలా అందించాల్సిన బియ్యం గింజలనూ విదల్చడం లేదు. ఫలితంగా గత మూడు నెలలుగా అంత్యోదయ కార్డుదారులు నానా అగచాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ కార్డులున్న లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ బియ్యం కోటా విడుదల చేయలేదు. కుష్ఠు, ఎయిడ్స్, క్యాన్సర్ వంటి దీర్ఘ వ్యాధులతోపాటు అంగవైకల్యంతో బాధపడుతూ ఎటువంటి ఆధారం లేని అభాగ్యులకు అంత్యోదయ కార్డులు మంజూరు చేస్తారు. ఒక్కో కార్డు మీద ప్రతి నెలా 35 కిలోల బియ్యం అందజేస్తారు. జిల్లాలో 3,300 మందికి ఈ కార్డులు మంజూరు చేయగా, గత మూడు నెలలుగా వీరందరికీ బియ్యం అందడంలేదు.
అంత్యోదయంలోనూ రెండు రకాలు
అంత్యోదయ కార్డుల్లోనూ రెండు రకాలు ఉన్నాయి. మొదటి నుంచీ అంత్యోదయ కార్డు తీసుకున్నవారు ఒక రకం కాగా, ఇంతకుముందు తెల్లకార్డులు కలిగి ఉండి, ఆ తర్వాత వాటిని అంత్యోదయ కార్డుగా మార్చుకున్నవారు రెండో రకం. ఇలా తెల్ల కార్డు నుంచి అంత్యోదయకు మారిన కార్డుదారులు 940 మంది ఉన్నారు. వీరికి గతంలో తెల్లకార్డుపై ఇచ్చే బియ్యం విడుదల చేస్తున్నారే తప్ప.. అంత్యోదయకు ఇచ్చే 35 కిలోల బియ్యం ఇవ్వడం లేదు. అలాగే 273 మిస్సింగ్ కార్డులకు పూర్తిగా రేషన్ విడుదల కావడంలేదు. మిగిలిన అంత్యోదయ కార్డులకు మాత్రం మూడు నెలలుగా బియ్యం కోటా నిలిచిపోయింది. ఈ విషయం అధికారుల వద్ద ప్రస్తావిస్తే ఆధార్ అనుసంధానం చేయకపోవడం, లబ్ధిదారులు స్థానికంగా లేకపోవడం వంటి కారణాలతో గతంలో నిర్వహించిన తనిఖీల అనంతరం ఈ కార్డులకు సరఫరా నిలిపివేశారని చెబుతున్నారు.
అయితే అధికారులు తలచుకుంటే జిల్లాస్థాయిలోనే బియ్యం బఫర్ స్టాక్ నుంచి ఈ కార్డుదారులకు బియ్యం సర్దుబాటు చే సే అవకాశం ఉన్నా జిల్లా అధికార యంత్రాంగం మానవీయ కోణంలో ఆలోచించడం లేదు. అభాగ్య లబ్ధిదారులు మాత్రం ఆశగా ఇప్పటికీ తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.అంత్యోదయ కార్డులకు బియ్యం మంజూరు కాకపోవడంపై జిల్లా సరఫరాల అధికారి సీహెచ్. అనందకుమార్ వద్ద ప్రస్తావించగా ఈ కార్డులకు ప్రభుత్వం బియ్యం కేటాయించడం లేదని స్పష్టం చేశారు. అయితే తమ ప్రయత్నంగా పౌరసరఫరాల కమిషనరేట్‌కు లేఖలు రాశామని అన్నారు. పెండింగ్‌లో ఉన్న కార్డుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో కూడా పంపించామని వివరించారు.