టీడీపీపై ఆపేక్ష.. అన్యులపై వివక్ష | TDP Government Not Supported To Jntuk | Sakshi
Sakshi News home page

టీడీపీపై ఆపేక్ష.. అన్యులపై వివక్ష

Published Sat, May 18 2019 11:06 AM | Last Updated on Sat, May 18 2019 11:07 AM

TDP Government Not Supported To Jntuk - Sakshi

కాకినాడ సిటీ: మరో ఐదు రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదలై కొత్త ప్రభుత్వం రానున్న నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా హడావుడిగా కొందరికి అదనపు బాధ్యతలు కట్టాబెట్టారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా తనకు పట్టనట్టు రిజిస్ట్రార్‌ ఇష్టానుసారంగా వ్యవహరించడం జేఎన్‌టీయూకేలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ డైరెక్టరేట్ల జోలికి వెళ్లని వర్సిటీ అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి సానుభూతిపరులుగా ఉన్న వారికి ఉన్నత పదవులు కట్టబెట్టారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు నియామక ఉత్తర్వులు ఇస్తే మరో ఏడాది వరకూ మార్పు చేయడానికి ఉండదు కదా అన్న ఉద్దేశంతో హడావుడిగా ఈ పని చేశారని అర్థమవుతోంది. 

పెత్తనమంతా ఆయనదే!
వర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించిన ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన ఒకాయన ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ నియామక కమిషన్‌ చైర్మన్‌ హోదాలో ఉండి అక్కడి నుంచి వర్సిటీని నడిపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి నెలా ఏదో సదస్సు పేరుతోనో లేక సన్మానం వంకతోనో వర్సిటీకి వచ్చే ఆయన తన వర్గం వారిని కలుసుకుంటూ వారికి కావలసిన అధికారాలు కట్టబెడుతుంటారు. ఆ విధంగా వర్సిటీ పరిపాలన మొత్తం తన చేతుల్లో పెట్టుకుని కీలక స్థానంలో ఉన్న వారిని డమ్మీగా చేశారనే విమర్శలు ఉద్యోగ వర్గాల్లో బహిరంగంగానే వినిపిస్తున్నాయి. వర్సిటీతో సంబంధం లేని వ్యక్తి ఇలా అనధికారికంగా పరిపాలన వ్యవహారాల్లో వేలుపెట్టి వర్సిటీ ప్రతిష్ట దిగజారుస్తున్నారని కొంతమంది అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

టీడీపీపై ఆపేక్ష.. అన్యులపై వివక్ష
వర్సిటీ పాలనలో చక్రం తిప్పుతున్న ఆయన అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ పలు పోటీ పరీక్షల్లో టీడీపీ సంక్షేమ పథకాలపై ప్రశ్నలు వచ్చేలా చూస్తున్నారంటూ విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో «ఆందోళన చేపట్టారు కూడా. ఆ ఉన్నతాధికారి అమరావతిలో ఉంటూ కొత్త ప్రభుత్వం వచ్చేలోగా మార్పులు చేపట్టాలని చెప్పడంతో ఉన్నపళంగా నియామక ఉత్తర్వులు వెలువడ్డాయని కొంతమంది అ«ధ్యాపకులు పేర్కొంటున్నారు. ఎంతోమంది విద్యావంతుల జీవితాలకు వెలుగులు ప్రసాదించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పట్ల అభిమానంతో కొంతమంది ప్రొఫెసర్లు ఉండటంతో వారి పట్ల వివక్ష చూపుతున్నారని, ఇలా వర్సిటీలో రాజకీయాలు జొప్పించి అధికార పార్టీకి అనూకులంగా వ్యవహరించడం ఎంతవరకూ సమంజసమని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. విచిత్రమేమిటంటే సివిల్‌ ప్రొఫెసర్‌ ఏసురత్నంను ఐఎస్‌టీ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన రెండు గంటలకే రెండు నెలలు సెలవు పెట్టి అమెరికా వెళ్లిపోయారు. టీచింగ్‌ అసోసియేషన్లలో ఉన్న వారికి డైరెక్టరేట్లు కట్టబెట్టారు.

ఉత్తర్వులు జారీచేసింది వీళ్లకే...
సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాద్‌రాజును ఐక్యూ ఏసీ ఇన్‌చార్జ్‌గా, సీఎస్‌ఈ ప్రొఫెసర్‌ ఎ.కృష్ణమోహన్‌ను స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌గా, సివిల్‌ ప్రొఫెసర్‌ ఏసురత్నంను ఐఎస్‌టీ డైరెక్టర్‌గా, జి.అబ్బయ్యను లైబ్రరీ సైన్స్‌ డైరెక్టర్‌గా, ఈసీఈ ప్రొఫెసర్‌ ఎన్‌.బాలాజీను అడ్మిషన్స్‌ డైరెక్టర్‌గా, మేథమెటిక్స్‌ ప్రొఫెసర్‌ జీవీఎస్‌ఆర్‌ దీక్షితులను ఆర్‌అండ్‌డీ డైరెక్టర్‌గా, విజయనగరం కళాశాల ఈసీఈ ప్రొఫెసర్‌ కె.చంద్రభూషణంను నరసారావుపేట కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌గా, మాజీ రెక్టార్‌ పూర్ణానందంను ఎస్సీఎస్టీ సెల్‌ లైజాన్‌ ఆఫీసర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

జేసీకి రిజిస్ట్రార్‌ వివరణ?
జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్‌ సుబ్బారావుకు కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ రావడంతో శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌ బంగ్లాకు వెళ్లారు. అక్కడ కలెక్టర్‌ను కలువగా వెంటనే వెళ్లి జేసీ–2 సత్తిబాబుతో మాట్లాడమని చెప్పడంతో కలెక్టరేట్‌లో ఉన్న జేసీ–2 ను కలిసి దాదాపు రెండు గంటలపాటు చర్చించారు. బయటకు వచ్చిన రిజిస్ట్రార్‌ సుబ్బారావును వివరణ కోరగా ఏమీ లేదంటూ మాట్లాడకుండా వెళ్లిపోయారు. జేసీ–2 సత్తిబాబును వివరణ కోరగా కౌంటింగ్‌ కేంద్రాలకు అదనపు గదుల సమాచారం కోసం మాట్లాడడానికి పిలిచామంటూ సమాధానమిచ్చారు. డైరెక్టర్ల హోదాల విషయంపై ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో దీనిపై రిజిస్ట్రార్‌ను వివరణ కోరడానికే కలెక్టరేట్‌కు పిలిపించారని విశ్వసనీయంగా తెలిసింది.  

ఎన్నికల కోడ్‌తో సంబంధం లేదు
వర్సిటీలో పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన డైరెక్టరేట్లకు సంబంధించి ప్రొఫెసర్లకు అదనపు బాధ్యతలు అప్పగించాం తప్ప వీటికి ఎన్నికల కోడ్‌తో సంబంధం లేదు. ఎన్నికలు కూడా ముగిశాయి కాబట్టి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఉన్నత విద్యాశాఖ సలహాతోపాటు, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ నిర్ణయంతో ఉత్తర్వులు జారీచేశాను.
– వీవీ సుబ్బారావు, జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement