హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్నాయి. శనివారం గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా మండలి(బీఏసీ) సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరపాలని నిర్ణయించారు.బడ్జెట్ సమావేశాలను మరి కొన్ని రోజులు పెంచాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించలేదు. అవసరమైన సందర్భాల్లో సాయంత్రం పూట సమావేశాలు నిర్వహిస్తామని చెప్పింది. ఈ బీఏసీ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ, బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. శాసనసభ ఈ నెల 8, 14, 15, 21, 22 తేదీల్లో(శని, ఆదివారాలు) సమావేశం కాదు.
సభను ఎక్కువ రోజులు జరపండి
శాసనసభను మరికొన్ని రోజులు జరపాల్సిందిగా బీఏసీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత సంప్రదాయాల మేరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలను పూర్తి స్థాయిలో 40 రోజులు జరపాలని కోరింది. ప్రభుత్వం మాత్రం పొడగించలేమని తెలిపింది. ఈ నెల 28న శ్రీరామనవమి సెలవని, ఆ తర్వాత శని, ఆదివారాలు కావడంతో సోమవారం ఒక్క రోజుకు సభను పొడిగిస్తే సభ్యులు తిరిగి రావడం కష్టమని తెలిపింది. అవసరమైతే సాయంత్రం పూట సమావే శాలను నిర్వహిస్తామని తెలిపింది. దీనిపై వైఎస్సార్ సీపీ నిరసన వ్యక్తం చేసింది.
ప్రతిపక్షానికి సమయమివ్వడం లేదు
అసెంబ్లీలో బడ్జెట్, గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా విపక్షానికి ఎక్కువ సమయం కేటాయించాలని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం అంగీకరించలేదు. బడ్జెట్, గవర్నర్ ప్రసంగాలపై చర్చ సందర్భంగా పార్టీ సభ్యులు మాట్లాడే సమయం నుంచి తాను మాట్లాడే సమయాన్ని మినహాయించి ప్రత్యేకంగా తనకు సమయం కేటాయించాలన్న జగన్ విజ్ఞప్తిని కూడా అధికార పక్షం అంగీకరించలేదు. సీఎం, మంత్రులు సభ్యులు లేవనెత్తే ప్రశ్నలు, సందేహాలకు ఇచ్చే సమాధానాలను అధికార పక్షానికి కేటాయించే సమయంలో కలపలేమని స్పీకర్ కోడెల స్పష్టం చేశారు. ఇలాంటి సంప్రదాయం లేదన్నారు. జగన్ జోక్యం చేసుకుని తగినంత సమయం కేటాయించాలని పట్టుబట్టారు. ప్రతిపక్ష నేతకు సమయం కావాలంటే గతంలో 9 ఏళ్లు సీఎంగా పనిచేసిన తానే పోరాటం చేయాల్సి వచ్చిందని, తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీ సభ్యులు పది నుంచి 20 నిమిషాలు ఆందోళన చేస్తే మైక్ వచ్చేదని, ప్రస్తుత సభలో అలాంటి పరిస్థితి లేదని చంద్రబాబు అన్నట్లు సమాచారం. స్పీకర్ మాట్లాడుతూ.. తాను ప్రతిపక్ష నేతకు తగినంత సమయం కేటాయిస్తానని, అవకాశం ఇవ్వమని కోరిన వెంటనే మైక్ ఇస్తానని అన్నట్లు తెలిసింది. జగన్ స్పందిస్తూ సభాపతి అందరినీ సమదృష్టితో చూడాలని విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్ సమావేశాల్లో తనకు మాట్లాడే అవకాశం రాక విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించాల్సి వచ్చిందని జగన్ గుర్తుచేశారు.
ఏ రోజు ఏమిటి?
- 9వ తారీకున - గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
- 10వ తారీకున - గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగింపు
- 11వ తారీకున - గవర్నర్ ప్రసంగంపై చర్చకు సీఎం చంద్రబాబు సమాధానం
- 12వ తారీకున - 2015-16 సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న మంత్రి యనమల
- 13వ తారీకున - 2015-16 సంవత్సర వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న మంత్రి ప్రత్తిపాటి
- 16 నుంచి 18వ తారీకు వరకు - బడ్జెట్‌పై సాధారణ చర్చ
- 19వ తారీకున- బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం
- 20 నుంచి 26 వరకు - బడ్జెట్ పద్దులపై చర్చ
- 27వ తారీకున - ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదం పొందడం
వైఎస్సార్ సీపీ చర్చకు పట్టుబట్టిన అంశాలు
బడ్జెట్ సమావేశాల్లో 22 అంశాలపై చర్చ కోరుతూ ప్రధాన విపక్షం వైఎస్సార్ సీపీ సంబంధిత అంశాల జాబితాను బీఏసీ లో ప్రతిపాదించింది విభజన చట్టం, విభజన హామీలు, సమస్యలు రైతు ఆత్మహత్యలు, కరువు ప్రాంతాల్లో సహాయ చర్యలు, త్రాగునీటి సమస్య పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ రైతు, మహిళ, చేనేత రుణ మాఫీ పట్టిసీమ ఎత్తిపోతల పథకం
- పోలవరం ఇసుక అమ్మకాలు
- ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సీఆర్‌డీఏ భూముల అంశం రాజధాని నగర నిర్మాణం బీసీలకు ప్రత్యేక బడ్జెట్
- సాగునీటి ప్రాజెక్టులు, నిర్మాణం ప్రభుత్వ వైఖరి విద్యుత్ చార్జీల పెంపు, గృహ నిర్మాణం ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి
- ఇంటికొక ఉద్యోగం, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు జీవో నంబర్ 22పై వస్తున్న ఆరోపణలు క్లస్టర్ స్కూళ్ల విధానం టీడీపీ ఇచ్చిన వాగ్దానాలు
అధికార టీడీపీ చర్చకు కోరిన అంశాలు
- 12 అంశాలను చర్చించాలని టీడీపీ శాసనసభా పక్షం బీఏసీకి ప్రతిపాదించింది.
- ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లు, కేంద్ర హామీలు
- గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం
- ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తి
- కరువు, తాగునీరు, పశుగ్రాసం తదితరాలు
- అర్హులైన వారికి రేషన్ కార్డుల జారీ
- రాజధాని నిర్మాణం
- నీరు, చెట్టు, ఎర్రచందనం అంశాలు
- బెరైటీస్, స్మార్ట్ గ్రామం, స్మార్ట్ నగరం
- ఎన్‌టీఆర్ విద్యాసేవ
- పెట్టుబడులు, ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, విద్యార్థుల సమస్యలు