పుష్కర కాలం క్రితం మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో మహిళలు | TDP Govt Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

పుష్కర కాలం క్రితం మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో మహిళలు

Published Fri, Dec 18 2015 1:07 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

పుష్కర కాలం క్రితం మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో మహిళలు - Sakshi

పుష్కర కాలం క్రితం మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో మహిళలు

 తాజాగా కోరలు చాచిన కాల్‌మనీ
 రుణమాఫీ చేయకపోవడం.. రుణాలు ఇవ్వకపోవడమే కారణం
 వడ్డీ వ్యాపారులను ఆశ్రయించింది రైతులు, డ్వాక్రా మహిళలే
 జిల్లాలో 14 వేల డ్వాక్రా గ్రూపుల్ని డిఫాల్టర్లుగా మార్చిన సర్కారు

 
 ‘రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తా. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా అండగా నిలబడతా. డ్వాక్రా మహిళలూ.. మీరు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కట్టకండి. అధికారంలోకి రాగానే మొత్తం రుణాలు మాఫీ చేస్తా’ ఎన్నికల ముందు జిల్లాలో పర్యటించిన చంద్రబాబునాయుడు రైతులకు, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలివి. 1995-2004 సంవత్సరాల మధ్య ఇదే చంద్రబాబు అధికారంలో ఉండగా, మైక్రోఫైనాన్స్ సంస్థల ఉచ్చులోపడి డ్వాక్రా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అవమానాల పాలయ్యారు. కొందరైతే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అప్పటి దారుణాలను మరువని డ్వాక్రా మహిళలు 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలను తొలుత నమ్మలేదు. అయితే.. ‘నేను గతం నాటి చంద్రబాబును కాను. పూర్తిగా మారాను. నన్ను నమ్మండి. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ప్రతి హామీ నెరవేరుస్తా’నని నమ్మబలికారు. నిజమనుకున్న ప్రజలు ఆయనను నమ్మి ఓటేశారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టుకొచ్చిన కాల్‌మనీ, సెక్స్ రాకెట్, నకిలీ మద్యం వంటి ముఠాలు పడగ విప్పాయి. జనాన్ని కాటేస్తున్నాయి.
 
 ఏలూరు (మెట్రో) :
 ప్రైవేటు అప్పులు చేసి వడ్డీలు కట్టినా బ్యాంకుల్లో తీసుకున్న అసలు అప్పు తీరక జిల్లాలోని డ్వాక్రా మహిళలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలివ్వలేదు. దీంతో అన్నదాతలు బంగారు నగలు కుదువబెట్టి పంట కోసం అప్పులు తీసుకున్నారు. పెట్టుబడులకు ఆ సొమ్ములు సరిపోలేదు. దిక్కులేని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించారు. వడ్డీలు కడుతున్నా అసలు తీరడం లేదు. ఏంచేయాలో తెలీని స్థితిలో కొందరు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా 62 వేల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. వీటిలో 58 వేల గ్రూపులకు గత ప్రభుత్వ హయాంలో రూ.1,100 కోట్లను వివిధ బ్యాం కులు రుణాలుగా ఇచ్చాయి.
 
  ఈ రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించడంతో డ్వాక్రా మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. పాలనాపగ్గాలు చేపట్టిన తరువాత చంద్రబాబు మాట మార్చారు. డ్వాక్రా మహిళలను ఏమార్చి రుణాలు మాఫీ చేయడం లేదంటూ ప్రకటించి షాక్ ఇచ్చారు. మూలనిధిగా గ్రూపునకు రూ.లక్ష చొప్పున రుణం ఇస్తానని ప్రకటించారు. ఆ విధంగా చూసినా రూ.580 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని ఆశించినప్పటికీ, ఒక్కొక్క సభ్యురాలికి రూ.3వేల చొప్పు న కేవలం రూ.155 కోట్లను మాఫీ చేస్తున్నట్టు ప్రకటిం చారు. ఆ సొమ్ము కూడా పాత బకాయిలకు జమ చేయకుండా, కేవలం మూలనిధిగా ఉంటుందని ప్రకటించారు. దీంతో డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. కొత్త రుణాల మాట దేవుడెరుగు.. పాత రుణాలను తక్షణమే చెల్లించాలంటూ బ్యాంకులు తాఖీదులు జారీ చేశాయి. ఫలితంగా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బుసలుకొట్టిన మైక్రోఫైనాన్స్ సంస్థల కంటే దారుణంగా కాల్‌మనీ, సెక్స్ రాకెట్ ముఠాలు పడగ విప్పాయి. ప్రజలను కాటేస్తున్నాయి.
 
 డిఫాల్టర్లుగా 14 వేల గ్రూపులు
 బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వకుండా.. పాత బకాయిలను తక్షణమే చెల్లించాలని ఒత్తిడి చేయడంతో డ్వాక్రా మహిళలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రుణమాఫీ హామీపై ఆశ పెట్టుకున్న మహిళలు ఏడాదిపాటు బ్యాంకులకు వాయిదాలు చెల్లించలేదు. దీంతో ఆ రుణాలపై వడ్డీలు పెరిగిపోయాయి. బ్యాంకుల నుంచి తాఖీ దులు రావడంతో జిల్లాలో 44వేల గ్రూపులకు చెందిన మహిళలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. అందిన కాడికి అప్పులు తెచ్చి బ్యాంకు బకాయిలు చెల్లించి ఉపశమనం పొందినా.. ప్రస్తుతం వడ్డీ వ్యాపారులకు సొమ్ము చెల్లించలేక సతమతం అవుతున్నారు. బయటినుంచి అప్పులు తెచ్చి బకాయిలు కట్టలేని 14 వేల గ్రూపులను డిఫాల్టర్లుగా బ్యాంకులు గుర్తించాయి. వీరికి భవిష్యత్‌లోనూ రుణాలు ఇచ్చేది లేదని ఆయా గ్రూపులకు బ్యాంకుల అధికారులు నోటీసులు జారీచేశారు.
 
 రైతన్నలదీ అదే పరిస్థితి
 జిల్లాలో 8.50 లక్షల రైతులు వివిధ బ్యాంకుల నుంచి రూ.7,245 కోట్లను పంట రుణాలుగా తీసుకున్నారు. వాటిని మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించడంతో వారంతా బ్యాంకులకు బకాయిలు చెల్లించలేదు. రుణమాఫీ ప్రకటన పుణ్యమా అని చెల్లింపులు జాప్యం కావ డంతో వడ్డీలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. మొదటి విడతగా రూ.369 కోట్లు, రెండో విడతగా రూ.119 కోట్లు, మూడో విడతగా రూ.123 కోట్ల రుణాలను మాఫీ చేసినట్టు చంద్రబాబు ప్రకటించారు. వాస్తవానికి చంద్రబాబు విధించిన అన్ని నిబంధనలు దాటుకుని వెళ్లిన రైతులకు రూ.1,100 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. కేవలం ఇప్పటివరకూ రూ.611 కోట్లను మాత్రమే నిధులు విడుదల చేసిన ప్రభుత్వం చేతులు దులుపుకుంది.
 
 వడ్డీలు పెరిగిపోయి..
 రుణమాఫీ కోసం రైతులంతా ఎదురు చూడటంతో బ్యాం కుల్లో బకాయిలు గడువు మీరాయి. గతంలో రూ.లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు ఆ మొత్తాన్ని ఏడాదిలోపు తిరిగి చెల్లిస్తే వడ్డీ ఉండేది కాదు. రుణమాఫీ ప్రకటన వల్ల బకాయిలు చెల్లించలేకపోవడంతో వడ్డీలపై వడ్డీలు పడి రైతులపై మోయలేని భారమయ్యాయి. బ్యాంకులకు వడ్డీ చెల్లించేందుకు రైతులు సైతం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అందిన కాడికి, తోచిన వడ్డీలకు అప్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం అటు బ్యాంకు రుణాలు తీరక, వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకున్న అప్పులు తీర్చలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా చంద్రబాబు దయవల్లే తాము అటు బ్యాంకుకు, ఇటు వడ్డీ వ్యాపారులకు బకాయిలు పడ్డామని రైతులు, డ్వాక్రా మహిళలు వాపోతున్నారు.
 
 మాఫీ చేస్తారని బ్యాంకు బాకీ కట్టలేదు
 చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పడంతో బ్యాంకుకు బాకీ కట్టలేదు. దీంతో వడ్డీ భారీగా పెరిగింది. ఆ తరువాత సంఘానికి రూ.10 వేలు ఇస్తామన్నారు. తొలి విడతగా వేసిన రూ.3 వేలు బాకీలోకి కాకుండా మూలధనంలో వేశారు. దీనివల్ల మేం అప్పుల పాలయ్యాం.
 - కె.ధనలక్ష్మి, డ్వాక్రా మహిళ, ధర్మాజీగూడెం
 
 రుణమాఫీ హామీతో నిండా మునిగాం

 రుణమాఫీ హామీ వల్ల నిండా మునిగిపోయాం. చంద్రబాబునాయుడు చెప్పిన ప్రకారం రుణమాఫీ చేయకపోవటంతో బ్యాంక్‌లో వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయాయి. వీటిని కట్టకపోవటంతో బ్యాంక్ వారు తిరిగి రుణాలు ఇవ్వ డం లేదు. ప్రైవేటు వ్యాపారస్తుల నుంచి అప్పు లు తెచ్చి పంటలకు పెట్టుబడులు పెట్టాం. అటు బ్యాంకు అప్పు, ఇటు ప్రైవేటు అప్పు తీర్చలేని దుస్థితి ఏర్పడింది.
 - బి.సుధాకర్, రైతు, కలరాయనగూడెం
 
 విజయవాడ కేసును వదిలేసి..
 సామాన్యులకు ఇబ్బందులు వచ్చినప్పుడు న్యాయమైన వడ్డీకి అప్పు ఇచ్చేవారు ఎక్కడ.. కాల్‌మనీ కేసు ఎక్కడ.. అసలు నిందితులను అరెస్ట్ చేయకుండా చిన్నపాటి వడ్డీ వ్యాపారులపై దాడులు సరికాదు. విజయవాడ కాల్‌మనీ కేసులో నిందితుల్ని శిక్షించి.. తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష తప్పదనేలా ప్రభుత్వ విధానం ఉండాలి. సామాన్యుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు.
 - వర్రే పైడియ్య, రైతు, పాములపర్రు
 
 తిమింగలాల్ని వదిలేసి..
 విజయవాడ కాల్‌మనీ, సెక్స్ రాకెట్ ఆగడాలను అరికట్టాలి. అంతేకానీ మాలాంటి వారికి అప్పులు ఇచ్చే చిన్నాచితకా వడ్డీ వ్యాపారులను వేధించడం తగదు. ప్రభుత్వ తీరువల్ల అప్పులిచ్చే వారు భయపడుతున్నారు. మాకు బ్యాంకులు అప్పులు ఇవ్వవు. చిన్నపాటి వడ్డీ వ్యాపారులే మాకు దిక్కు.
 - చినిమిల్లి వెంకటేశ్వరరావు, కూల్ డ్రింక్ షాపు, నరసాపురం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement