‘ఆ విధంగా ముందుకు’ వెళ్తున్న అవినీతి చంద్రిక
కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి రంగం సిద్ధం
వారి నుంచి దండుకోవడానికి ప్రణాళిక
దొడ్డిదారిన జీవో నం 22ను జారీ చేసిన ప్రభుత్వం
గతంలో గవర్నర్ పక్కనబెట్టిన జీవో అది
దీంతో ఖజానాపై అదనపు భారం రూ.20 వేల కోట్లు
22 శాతం అధికానికి పట్టిసీమ కాంట్రాక్టు
కాసుల కోసం కక్కుర్తితోనే ‘పట్టిసీమ’పై పట్టు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతిలో కొత్త పుంతలు తొక్కుతోంది. బాబు సర్కారు బరితెగించి మరీ అడ్డగోలు దోపిడీకి కొత్త దారులు వేస్తోంది. రాష్ట్ర విభజనతో అనాథలమయ్యామంటూ ఒకవైపు బీద అరుపులు అరుస్తూనే.. మరోవైపు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా ‘అయినవారి’ చేతుల్లో పోస్తోంది. రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ దందాను చేపట్టి రైతులను రోడ్డుపాలు చేస్తుంది సరిపోక.. తాజాగా దొడ్డిదారి నిర్ణయాలతో ఖజానాను ఖాళీ చేసి కావాల్సిన వారి కడుపు నింపేం దుకు రంగం సిద్ధం చేస్తోంది. అవినీతి దారుల్లో ఏపీ సర్కారు ‘ఆ విధంగా ముందుకుపోతోంది’.
జీవో 22.. ఉద్దేశం 420
నీటిపారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల నుంచి అడ్డగోలుగా దోచుకోవడానికి అవకాశం కల్పించే జీవో నంబర్ 22ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జారీ చేసింది. ఈ జీవో వెనుక ఒక నేపథ్యం ఉంది. ఇలాంటి ఉత్తర్వునే(జీవో నంబర్ 13) గతంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జారీ చేశారు. దాన్ని ఆయన మంత్రివర్గ సహచరులే తీవ్రంగా వ్యతిరేకించారు. కాంట్రాక్టర్ల నుంచి భారీ ఎత్తున ముడుపులు దోచుకోవడానికే ఆ జీవో అంటూ విమర్శలు రావడంతో.. ఆ జీవో అమలును గవర్నర్ తాత్కాలికంగా పక్కనబెట్టారు (అబెయన్స్‌లో పెట్టారు).
ఇప్పుడు ఆ జీవోను మళ్లీ పునరుద్ధరిస్తే ఇబ్బందులు వస్తాయేమోనన్న ఆలోచనతో.. ప్రభుత్వం దొడ్డిదారిన అలాంటి జీవోను మళ్లీ జీవోనెంబర్ 22గా జారీ చేసింది. గవర్నర్ నిర్ణయంతో తెరవెనక్కు వెళ్లిన ఆ జీవోను ఇలా మళ్లీ తెరపైకి తేవడంలో అక్రమ సంపాదనే అసలు ఉద్దేశమని అధికారులే చెబుతున్నారు. ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) విధానం స్ఫూర్తికి విరుద్ధంగా.. కార్మికుల వ్యయాన్ని(లేబర్ కాంపోనెంట్) కూడా కాలానుగుణంగా పెంచడానికి వీలు కల్పించి, ఆమేరకు ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకోవడానికి ఈ జీవో ద్వారా అవకాశం కల్పించారు. మిషనరీ, మెటీరియల్‌కు అయ్యే ఖర్చును కూడా ఎప్పటికప్పుడు పెంచుకోవడానికి ఈ జీవో వల్ల కాంట్రాక్టర్‌కు అవకాశం లభించింది. అది కూడా 2013 ఏప్రిల్ 1 నుంచి ఈ జీవో అమలయ్యే విధంగా ఇచ్చారు. ఫలితంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు దాదాపు రెట్టింపవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
అదనపు భారం 20 వేల కోట్లు
కేబినెట్ నోట్ ప్రకారమే.. జీవో-22 వల్ల కాంట్రాక్టర్లకు అదనంగా దాదాపు రూ. 7 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన పనుల ఒప్పందాలు ఉన్నాయి. అవన్నీ 2006-07 నుంచి 2009-10 ఆర్థిక సంవత్సరాల వరకు జరిగిన ఒప్పందాలు. అప్పటి నుంచి ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెరిగినప్పుడు.. ఆమేరకు ఒప్పందం విలువా పెరుగుతుంది. అంచనా వ్యయం పెరిగిన మేరకు చూస్తే.. ప్రస్తుతం దాదాపు రూ. 20 వేల కోట్ల మేర ఒప్పందాలున్నాయి. లేబర్, మిషనరీ, మెటీరియల్, కంట్రోల్ బ్లాస్టింగ్, డీవాటరింగ్.. పలు కాంపొనెంట్స్‌కు కూడా పెరిగిన ధరల మేరకు చెల్లించాలని జీవో- 22 చెబుతోంది.
ఫలితంగా ఒప్పందాల విలువ రెట్టింపవుతుందని అంచనా. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఖజానా మీద అదనంగా రూ. 20 వేల కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ ఎత్తున ముడుపులు చేతులు మారిన నేపథ్యంలోనే కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చే ఈ జీవో జారీ అయ్యిందని, ఈ జీవోతో ప్రత్యక్ష ప్రయోజనం కాంట్రాక్టర్లకయితే.. పరోక్ష ప్రయోజనం ప్రభుత్వంలోని పెద్దలకే అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
22 శాతం అధికానికి పట్టిసీమ కాంట్రాక్టు మంజూరు
పట్టిసీమపై ప్రభుత్వం పట్టు విడవక పోవడానికి కూడా ముఖ్య కారణం కాసుల కక్కుర్తేనని వస్తున్న విమర్శలకు బలం చేకూర్చేలా.. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టును 22% అధికానికి ఒక కంపెనీకి ప్రభుత్వం కట్టబెట్టింది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై దృష్టి పెట్టకుండా, పట్టిసీమను ప్రధానంగా పట్టించుకోవడంపై అన్ని వర్గాల్లోనూ అభ్యంతరాలు వ్యక్తమైనా..అవినీతే ప్రధాన కారణమని ఆరోపణలు వెల్లువెత్తినా.. దున్నపోతు మీద వాన’ సామెతను గుర్తు చేస్తూ.. రూ. 1300 కోట్ల పట్టిసీమ ఎత్తిపోతల పథకం కాంట్రాక్టును 22 శాతం అధికానికి మెగా కంపెనీకి కట్టబెట్టింది.
ఈ ‘22 శాతం అధికం’ విలువ రూ. 286 కోట్లు. 22 శాతం అధికానికి టెండర్ వేసి ఎల్-1గా నిలిచినా తప్పకుండా కాంట్రాక్టు మంజూరు చేయాలనే నిబంధనేం లేదు. టెండర్లు రద్దు చేసి మరిన్ని సంస్థలకు టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించవచ్చు. కానీ ప్రభుత్వం అలా చేయకుండా, తమకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు పని కట్టబెట్టి కాసులు దండుకోవడానికే మొగ్గుచూపింది. నిధల్లేవంటూ బీద అరుపులు అరిచే చంద్రబాబు.. 22 శాతం అధికానికి మారు మాట్లాడకుండా కాంట్రాక్టు మంజూరు చేయడం అంటే.. కోట్లాది రూపాయలు చేతులు మారాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా రూ. 200 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్
అధికారం చేపట్టిన వెంటనే.. నిబంధనలకు విరుద్ధంగా పోలవరం కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ. 200 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్‌ను చంద్రబాబు చెల్లించారు. కాంట్రాక్టు ఒప్పందానికి విరుద్ధంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ అడుగుతున్నారని, కాంట్రాక్టర్ విజ్ఞప్తికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టంగా ఫైల్ మీద రాసినా.. రూ. 200 కోట్లు చెల్లించే దిశగానే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిన మేరకు.. మిషనరీని ప్రభుత్వం తాకట్టు పెట్టుకోవాలని సీఎం సూచించారు.
బ్యాంకుల్లో తీసుకున్న రుణాలతో కొన్న మిషనరీని ఆయా బ్యాంకుల తనఖాలో ఉన్నాయని, వాటిని మళ్లీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టడం కుదరదని.. ఆ తర్వాత అధికారులు తేల్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సు తీసుకున్న తర్వాత.. ఒక్క అడుగు పని కూడా కాంట్రాక్టర్ చేయకపోయినా, ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వ్యవహరించడం వెనక భారీగా ముడుపులు చేతులు మారాయన్న విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.