ఇంటి దోపిడీ రూ.4,930.15 కోట్లు! | TDP Govt Robbery In the name of building houses for the urban poor | Sakshi
Sakshi News home page

ఇంటి దోపిడీ రూ.4,930.15 కోట్లు!

Published Tue, Jul 23 2019 3:38 AM | Last Updated on Tue, Jul 23 2019 3:38 AM

TDP Govt Robbery In the name of building houses for the urban poor - Sakshi

సాక్షి, అమరావతి: పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో టీడీపీ సర్కార్‌ రూ.4,930.15 కోట్ల దోపిడీకి పాల్పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. తొమ్మిది కాంట్రాక్టు సంస్థలతో కలసి టీడీపీ పెద్దలు పేదల పొట్ట కొట్టినట్లు స్పష్టం చేసింది. సాంప్రదాయ పద్ధతుల్లో ఇళ్ల నిర్మాణానికి రూపొందించిన అంచనాలతోనే గత ప్రభుత్వం షేర్‌ వాల్‌ టెక్నాలజీకి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంచనా వ్యయాన్ని చదరపు అడుగుకు రూ.800 చొప్పున పెంచేసింది. పోటీ లేకుండా చేసి తొమ్మిది సంస్థలకు అధిక ధరలతో పనులను అప్పగించారని నిపుణుల కమిటీ తప్పుబట్టింది. వీఎన్‌సీ–ఎస్వీసీ(జేవీ), వీఎన్‌సీ, కేఎంవీ, షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సీసీ, కేపీసీ, టాటా, ఎల్‌ అండ్‌ టీ, సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాత్రమే పాల్గొనేలా నిబంధనలు రూపొందించారని పేర్కొంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక, భూసేకరణ లేకుండానే టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంతో ధరల సర్దుబాటు కింద అధిక మొత్తం పరిహారం చెల్లించాల్సిన దుస్థితి దాపురించిందని పేర్కొంది. పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై జరిమానా విధించకపోవడాన్ని తప్పుబట్టింది. అడగడుగునా నిబంధనల ఉల్లంఘనపై ఏపీ టిడ్కో అధికారులను ప్రశ్నిస్తే ‘ఉన్నత స్థాయి ఒత్తిళ్ల మేరకు పెద్దలు ఎలా చెబితే అలా చేశాం..’ అని సమాధానం ఇచ్చారని పేర్కొంది. 

కఠిన చర్యలకు కమిటీ సిఫారసు..
పేదలకు ఉచితంగా ఇళ్లను నిర్మించి ఇవ్వాల్సి ఉండగా వారిపై అప్పుల భారం మోపి మరీ నిధులను కాజేసిన వైనంపై విధానపరమైన నిర్ణయం తీసుకుని అక్రమాలకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ నిపుణుల కమిటీ ఈనెల 17వతేదీన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఏపీ టిడ్కో (ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఆధ్వర్యంలో చేపట్టిన పట్టణ పేదల ఇళ్ల నిర్మాణంపై కమిటీ విచారణ జరిపి రికార్డులు తనిఖీ చేసింది. క్షేత్రస్థాయిలో విచారించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

పేదలకు సొంతింటి పేరుతో దోపిడీ..
రాష్ట్రంలో పట్టణ ప్రాంత పేదలకు 225 చోట్ల 4,54,909 గృహాలను నిర్మించే పనులను 34 ప్యాకేజీలుగా విభజించి 2017 ఏప్రిల్‌లో ఈపీసీ (ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో టెండర్లు పిలిచారు. ఇళ్లను మూడు రకాలుగా 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని నిర్ణయించారు. ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1.5 లక్షల చొప్పున మొత్తం రూ.3 లక్షలు చెల్లిస్తాయి. ఈ నిధులతో సాంప్రదాయ పద్ధతుల్లో ఇళ్లను నిర్మించే అవకాశం ఉన్నా టీడీపీ సర్కారు పేదలపై పెనుభారం మోపింది. గత సర్కార్‌ వ్యవహరించిన విధానాల వల్ల 300 చదరపు అడుగుల ఇంటి నిర్మాణ వ్యయం రూ.5.72 లక్షలకు(లబ్ధిదారుడిపై భారం రూ.2.72 లక్షలు), 365 చదరపు అడుగులకు రూ.6.74 లక్షలకు (లబ్ధిదారుడిపై భారం రూ.3.74 లక్షలు), 430 చదరపు అడుగుల ఇంటి నిర్మాణ వ్యయం రూ.7.71 లక్షలకు (లబ్ధిదారుడిపై భారం రూ.4.71 లక్షలు) పెరిగిందని కమిటీ తేల్చింది. ఫలితంగా ఇళ్ల నిర్మాణ వ్యయం రూ.25,170.99 కోట్లకు చేరుకుందని నిపుణుల కమిటీ పేర్కొంది. లబ్ధిదారుడి వాటా రూపంలో బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి మరీ ఈ డబ్బులను టీడీపీ సర్కార్‌ దోచేసింది. 

చ.అడుగుకు రూ.800 పెంపు
సాంప్రదాయ పద్ధతుల్లో ఇళ్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1100కి మించదని అయితే షీర్‌ వాల్‌ టెక్నాలజీ పేరుతో చదరపు అడుగుకు రూ.1900కు పెంచేశారని పేర్కొంది. ఒప్పందం ప్రకారం 15 నెలల్లోగా ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా రెండేళ్లు గడిచినా అసంపూర్తిగానే ఉన్నాయని కమిటీ తెలిపింది. 100 మిమీల మందం కలిగిన గోడలతో నిర్మిస్తున్న ఇళ్లు చలి, ఎండలను ఆపలేవని అభిప్రాయపడింది. 

గ్రావెల్‌లో గోల్‌మాల్‌ రూ.60 లక్షలు!
కృష్ణా జిల్లా జక్కంపూడి వద్ద జీ+3 విధానంలో 10,624 ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతాన్ని నిపుణుల కమిటీ ఈనెల 12న తనిఖీ చేసింది. ఈ పనులను 4.53 శాతం అధిక ధరలకు అంటే రూ.649.44 కోట్లకు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది మే 27 నాటికే పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇంతవరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఇక్కడ నిర్మిస్తున్న ఇళ్లకు గ్రావెల్‌ను 16 కి.మీ.ల నుంచి తరలిస్తున్నట్లు బిల్లులు చెల్లించారు. నిజానికి ఇళ్లు నిర్మిస్తున్న ప్రదేశం నుంచే గ్రావెల్‌ను తవ్వి సేకరించారు. ఇందులో కాంట్రాక్టర్‌కు రూ.60 లక్షలు దోచిపెట్టారు. రూ.649.44 కోట్లతో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను ఒకే డీఈఈ, రెండు జిల్లాల్లో విస్తరించిన రూ.మూడు వేల కోట్ల విలువైన పనులను ఒక ఎస్‌ఈ, ఒక ఈఈ, 12 మంది డీఈలు పర్యవేక్షిస్తున్నారని.. దీనివల్ల పనుల నాణ్యత లోపించిందని నిపుణుల కమిటీ తేల్చింది. 

తనిఖీలు తుంగలోకి.. 
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ వర్క్స్‌ అకౌంట్‌ కోడ్‌ (పేరా 294 నుంచి 297) ప్రకారం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పనులను తనిఖీ చేసి రికార్డు చేసేవరకు బిల్లులు చెల్లించకూడదు. రూ.5 లక్షల కంటే ఎక్కువ అంచనా వ్యయం ఉన్న వాటిల్లో ఈఈ స్థాయి అధికారి కనీసం 30 శాతం పనులను తనిఖీ చేయాలి. రూ.50 లక్షలకు మించితే మూడింట ఒక వంతు లేదా మూడింట రెండొంతుల పనిని ఎస్‌ఈ స్థాయి అధికారి తనిఖీ చేశాకే బిల్లులు చెల్లించాలి. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘించి తనిఖీలు లేకుండా, చెక్‌ మెజర్‌మెంట్‌ చేయకుండానే బిల్లులు చెల్లించారని నిపుణుల కమిటీ తేల్చింది.

కాంట్రాక్టర్లకు లబ్ధి ఇలా...
- ఇళ్ల నిర్మాణ ప్రాంతంలో రూ.7 లక్షలతో మోడల్‌ హౌస్‌ నిర్మించాల్సి ఉండగా రాష్ట్రవ్యాప్తంగా 225 ప్రాంతాల్లో ఏ ఒక్క చోట కూడా కాంట్రాక్టర్లు వీటిని కట్టలేదు. దీనివల్ల కాంట్రాక్టర్లకు రూ.15.75 కోట్ల మేర లబ్ధి చేకూరింది.
రూ.9.50 లక్షలతో 500 చదరపు అడుగుల్లో ఏపీ టిడ్కోకు సైట్‌ ఆఫీస్‌ నిర్మించి ఇవ్వాలి. కానీ ఒక్కచోట కూడా కాంట్రాక్టర్లు దీన్ని పాటించకపోవడంతో వారికి రూ.21.38 కోట్ల మేరకు ప్రయోజనం కలిగింది. 
ఒక్కో స్టీల్‌ ఫ్రేమ్, షట్టర్స్‌(యూనిట్‌)ను రూ.6 వేల చొప్పున అధిక ధరకు కొనుగోలు చేసి కాంట్రాక్టర్లకు రూ.272.95 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు. కిటీకిలను కూడా ఒక్కో యూనిట్‌ రూ.6 వేల చొప్పున అధిక ధరకు కొనడంతో కాంట్రాక్టర్లకు రూ.272.95 కోట్ల మేర లబ్ధి కలిగింది. 
ఇళ్లలో అంతర్గత విద్యుదీకరణ, నీటి సరాఫరా, పారిశుద్ధ్యం పనులకు చదరపు అడుగుకు రూ.175 చొప్పున చెల్లిస్తామని ఎస్టిమేట్లలో పేర్కొన్న ఏపీ టిడ్కో చదరపు అడుగుకు రూ.50 చొప్పున అధికంగా చెల్లించింది. ఇందులో కాంట్రాక్టర్లకు రూ.578.80 కోట్లను దోచిపెట్టారు.
విట్రిఫైడ్‌ టైల్స్‌ ఫ్లోరింగ్‌ పనుల్లోనూ కాంట్రాక్టర్లకు చదరపు అడుగుకు రూ.20 చొప్పున అధికంగా చెల్లించారు. పెయింటింగ్‌లో చదరపు అడుగుకు రూ.30 చొప్పున అధికంగా ఇచ్చారు. దీనివల్ల కాంట్రాక్టర్లకు రూ.578.80 కోట్ల మేర లబ్ధి చేకూరింది.
అల్యుమినియం షట్టరింగ్‌ వల్ల చదరపు అడుగుకు నిర్మాణ వ్యయం రూ.200 చొప్పున పెరిగి పేదలపై రూ.3186.92 కోట్ల భారం పడిందని నిపుణుల కమిటీ నిర్ధారించింది. 
కనీసం రిజిస్టర్లూ లేవు...
డిజైన్‌ 1893–2016 ప్రకారం రిజిడ్‌ మోనోలిథిక్‌ కన్‌స్టక్షన్‌ విధానంలో వంద మీమీల గోడ నిర్మించాల్సి ఉండగా ఒకే లేయర్‌  రీయిన్‌పోర్స్‌మెంట్‌  వినియోగిస్తుండటాన్ని కమిటీ తప్పుబట్టింది.
ఐబీఎం ప్రమాణాల ప్రకారం విస్కస్‌ మాడిఫైడ్‌ ఏజెంట్‌ క్యూబిక్‌ మీటర్‌కు 0.4 కేజీని వినియోగించాలి. సిమెంటు, నీటి నిష్పత్తి 0.43 శాతం ఉండాలి. క్షేత్ర స్థాయి పరీక్షలు, కోర్‌ డెస్ట్‌ల్లో వాటి పరిమాణాలు చాలా తక్కువగా ఉండటంతో పనులు నాసిరకంగా ఉన్నాయి.
ఒప్పందం ప్రకారం విద్యుత్‌ ఉపకరణాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనుల్లో ఉపయోగించే ఉపకరణాలు, డోర్స్, ప్లోరింగ్, టైల్స్‌ సరఫరా చేయడం లేదు. చౌకగా దొరికే నాసిరకమైన ఉపకరణాలను వినియోగిస్తున్నారు.
సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ప్రమాణాల మేరకు ఏపీ టిడ్కో అధికారులు రిజిస్టర్లు నిర్వహించడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement