రాయదుర్గం అర్బన్: తెలుగుదేశం పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం రాయదుర్గంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డితో కలిసి కాపు రామచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు అవినీతిపై దృష్టి సారించి, ప్రభుత్వంపై వ్యతిరేకత రాగానే హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీకి గుణపాఠం చెప్పేరోజులు దగ్గర పడ్డాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
రాప్తాడు నియోజకవర్గంలోని కందుకూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త శివారెడ్డి హత్యను ఖండిస్తున్నామన్నారు. గతంలో టీడీపీ పాలనలో 600 హత్యలు జరిగాయని, నేడు ముఖ్యమంత్రే స్వయంగా ప్రతిపక్షం లేకుండా చేస్తామంటున్నారని, అంటే ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను చంపేస్తారా అని ప్రశ్నించారు. అధికారులు అధికార పార్టీ సేవకులుగా కాకుండా ప్రజాసేవకులుగా ఉండాలని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి ఎన్‌టీ సిద్దప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, పట్టణ కన్వీనర్ నబీష్, కౌన్సిలర్ గోనబావి సర్మస్, గుమ్మఘట్ట కన్వీనర్ కాంతారెడ్డి, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి హనుమంతు, రామన్న, బేలోడు రామాంజనేయులు, ఇస్మాయిల్, శ్రీనివాసులు, వార్డు కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment