సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: వంశధార స్టేజ్–2 ఫేజ్–2 ప్రాజెక్టు పనులు భామిని మండలంలో 87 ప్యాకేజీ, కొత్తూరు మండలంలో 88వ ప్యాకేజీ పనులతో పాటు హిరమండలం జలాశయం పనులు జరుగుతున్నాయి. కానీ తొలుత 87, 88వ ప్యాకేజీ పనులను శ్రీనివాస కంపెనీ చేపట్టింది. వాస్తవానికి ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో ఎక్కడా నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ కోసం క్వారీలు, ఇసుక రీచ్‌లు కేటాయించాలన్న షరతులేవీ లేవు. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస కంపెనీ పనులు మందగమనంతో చేస్తున్న కారణంగా ఒప్పందం రద్దు చేసింది. 87 ప్యాకేజీ పనులను టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థకు, 88వ ప్యాకేజీ పనులను శ్రీసాయిలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించింది. అయితే వంశధారతో ముడిపడిన జిల్లా ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడానికి క్వారీ, ఇసుక రీచ్‌లు కేటాయించాలని నిర్ణయించారు.
అధికారుల కళ్లుగప్పి...
భామిని మండలం చిన్నదిమిలి పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 284లో దాదాపు 43.65 ఎకరాల విస్తీర్ణంలో కొండ ఉంది. దీనిలో 7.41 ఎకరాలు (3 హెక్టార్లు) క్వారీయింగ్ కోసం అధికారులు అప్పగించారు. అయితే ఇది నిర్ణీత ప్రక్రియ ప్రకారం జరగలేదు. ప్రాజెక్టు పనులు సత్వరమే పూర్తి చేయాలనే కారణంతో వంశధార ఎస్‌ఈ పేరుతో అనుమతులు ఇచ్చారు.
వాస్తవానికి కాంట్రాక్టరు సంస్థదీ ప్రైవేట్ వ్యాపార కార్యకలాపం కిందకే వస్తుంది కాబట్టి సుమారు పది వరకూ ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతి (నో అబ్జెక్షన్ సరిఫికెట్లు) తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు క్వారీయింగ్ కోసం కేటాయించిన కొండ ఇంకా కొండలాగే ఉంది. ఆ పక్కన గతంలో చదును చేసిన భూమిలోనే క్వారీయింగ్ కార్యకలాపాలను కాంట్రాక్టు సంస్థ మొదలెట్టేసింది. అనుమతి ఒకచోట తీసుకొని, మరొక చోట క్వారీయింగ్ చేస్తున్నా అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం.
పేలుళ్లతో పరిసరాల్లో హడల్...
గనుల్లో రాయి పేలుళ్ల కోసం పలు విభాగాల నుంచి అనుమతి తీసుకోవాలి. ముఖ్యంగా పోలీసు శాఖ నుంచి అనుమతి ప్రధానంగా ఉండాలి. అంతకుమించి అక్కడ మైనింగ్ కార్యకలాపాల కోసం స్థానిక పంచాయతీ తీర్మానం కూడా అవసరం. కానీ ఇప్పటివరకూ చినదిమిలి పంచాయతీ తీర్మానం చేయలేదని విశ్వసనీయ సమాచారం. కానీ క్వారీలో పేలుళ్లకు మాత్రం కాంట్రాక్టు సంస్థ తెగబడింది. ఈ పేలుళ్లతో వచ్చిపడుతున్న రాళ్ల వల్ల తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని, ప్రాణాపాయం పొంచి ఉందని పెద్ద దిమిలి, చిన్నదిమిలి ప్రజలు ఇటీవల ఆందోళన చేసినా అరణ్యరోదనే అయ్యింది.
కాంట్రాక్టు సంస్థ కేవలం వరద కాలువ నిర్మాణం కోసం తవ్వకాల్లో అడ్డంగా తగిలే రా>ళ్లను తొలగించడానికి మాత్రమే బ్లాస్టింగ్స్‌కు అనుమతి తీసుకుంది. దీన్ని కారణంగా చూపించి తీసుకొస్తున్న పేలుడు పదార్థాలను క్వారీలో రాళ్ల తవ్వకాల కోసం వినియోగించడం చట్టవిరుద్ధం. దీనికి పోలీసుశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉన్నా అవేవీ ఇక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు.
అవసరానికి మించి తవ్వకాలు....
అనుమతి ప్రాంతంలో క్వారీయింగ్ అయినా సరే అవసరానికి మించి తవ్వకాలు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి 88వ ప్యాకేజీ కాంక్రీట్ పనులకు 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల పిక్కరాయి అవసరం ఉంటుంది. 40 ఎంఎం, 20 ఎంఎం, 10 ఎంఎం సైజ్ రాయిపిక్కను వరద కాలువ లైనింగ్, వంతెనల నిర్మాణంలో వినియోగిచాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ సుమారు 12 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని క్వారీ నుంచి అక్రమంగా తవ్వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టు సంస్థ ఆ కొండ పక్కనే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమి లీజుకు తీసుకొని, అక్కడ భారీ క్రషర్‌ను ఏర్పాటు చేసింది.
దీనికి గంటకు 250 టన్నుల రాయిని క్రషింగ్ చేయగల సామర్థ్యం (250 టీపీహెచ్) ఉంది. ఈ క్రషర్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతి మాత్రమే ఉంది. మిగతా ప్రభుత్వ విభాగాల నుంచి ఇంకా ఎన్‌వోసీలు లభించలేదని తెలిసింది. కనీసం ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ వద్ద కూడా నమోదు చేయించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతి లేనిచోట క్వారీయింగ్ చేస్తూ పెద్ద ఎత్తున క్రషింగ్ చేస్తున్న రాయిపిక్కలు (మెటీరియల్) పక్కదారి పడుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment