నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు | tdp illegal activities in ongole district of mlc elections | Sakshi
Sakshi News home page

నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు

Published Thu, Jun 18 2015 6:45 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు - Sakshi

నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు

మెజారిటీ లేకపోయినా ఎమ్మెల్సీకి పోటీ
తలకాయలు తమ తమ
జేబుల లోపల దాచుకొనుచు
పోలింగ్‌కు పోవల్సిన రోజులొస్తే
సెలవిక డెమోక్రసీకి సిరిసిరిమువ్వా
.. అని ఆరు దశాబ్దాల కిందటే ఆవేదన వ్యక్తం చేశారు శ్రీశ్రీ.  ప్రజాస్వామ్య విలువలకు వలువలు వలిచేస్తూ తలకాయలు ఎగరేస్తున్న నేటి టీడీపీ నేతలను చూస్తే ఇంకెంత పరుషంగా తన పదాలకు పదును పెట్టేవారో ఆ మహాకవి. ఓటుకు నోటంటూ అడ్డంగా దొరికిపోయినా మరింత అడ్డదిడ్డంగా వాగ్వాదాలకు దిగుతూ  నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గంటూ  జిల్లాలో రాయ‘బేరా’లకు దిగుతున్నారు ‘పచ్చ’దొరలు. మెజార్టీ లేకపోయినా కోట్ల రూపాయలు కుమ్మరించి ఎమ్మెల్సీ సీటు దక్కించుకోడానికి ప్రయత్నిస్తున్న తీరును చూసి జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారు. తాజాగా  ఎమ్మెల్సీ ఎన్నికను  ఆ...విధంగా ముందుకు తీసుకువెళ్తాన్నారు మన నారా బాసు.  
 
ఒంగోలు: ఒకపక్క తమ పార్టీ అధినేత ఓటుకు నోటు కేసులో పీకల్లోతులో కూరుకుపోయినా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గంటూ తాజాగా జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సి ఎన్నికల్లో ఓటుకు నోటు పద్ధతినే అవలంబిస్తున్నారు ఇక్కడి టీడీపీ నేతలు.   మెజారిటీ లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగిన తెలుగుదేశం నాయకులు విపక్షాల సభ్యులకు ప్రలోభాల వల వేస్తున్నారు. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలలో వైఎస్సార్ సీపీకి మెజారిటీ స్థానాలు దక్కాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి 992 ఓట్లుండగా, కో-ఆప్షన్ సభ్యులను కలుపుకుని వైఎస్సార్ కాంగ్రెస్ తరపున గెలిచిన వారి సంఖ్య 496 వరకూ ఉండగా, తెలుగుదేశం పార్టీకి 457 ఓట్లున్నాయి.

ఆమంచి కృష్ణమోహన్ వర్గంతో కలుపుకుని, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి 38 సీట్లు వరకూ ఉన్నాయి. జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక సమయంలో తెలుగుదేశం పార్టీకి 25 ఓట్లు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 31 ఓట్లున్నా ఓటర్లను ప్రలోభ పెట్టి ముగ్గురిని తమ వైపు తిప్పుకున్నారు. ఒకరిని పాత కేసు బయటకు తీసి ఎన్నికకు కొద్ది గంటల ముందు అరెస్టు చేశారు. అయినా సొంతపార్టీలో తిరుగుబాటు అభ్యర్థిగా ఈదర హరిబాబు నిలబడటం, వ్యూహాత్మకంగా వైఎస్సార్ సీపీ అతనికి మద్దతు పలకడంతో తెలుగుదేశం పార్టీకి భంగబాటు తప్పలేదు. ఈదర హరిబాబుపై అనర్హత వేటు పడగా, ఇన్‌ఛార్జి ఛైర్మన్ నూకసాని బాలాజీకి పదవుల ఎర చూపి పార్టీలోకి చేర్చుకున్నారు. ఎంపీపీల ఎన్నికల సమయంలో కూడా ఇదే ప్రలోభాలకు గురిచేసి, కొంతమందిని భయపెట్టి, మరికొంతమందిని ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకున్నారు.

కనిగిరిలో ఎంపీపీ అభ్యర్థిని ఏకంగా కిడ్నాప్ చేసి భయపెట్టి ప్రలోభాలకు పాల్పడ్డారు. ఇప్పుడు తాజాగా మెజారిటీ లేకపోయినా టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపారు. ఆర్థికంగా బలవంతుడైన మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి బొట్టు పెట్టారు. గతంలో పార్టీలోకి వస్తానంటే వద్దని చెప్పిన చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించారు. ఏకంగా చినబాబు లోకేష్ రంగంలోకి దిగి కృష్ణమోహన్‌ను ఆహ్వానించారు. అయితే స్థానిక నాయకత్వం పూర్తిగా వ్యతిరేకించినా ససేమిరా అన్నారు. ఇటీవల కనిగిరి పర్యటనకు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి పార్టీ నాయకులకు గీతోపదేశం చేశారు. ఎంత ఖర్చయినా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆదేశించారు.

సొంత పార్టీ వారికి ఎంతివ్వాలి, విపక్షాల నుంచి వచ్చే వారికి ఎంత ఇవ్వాలన్నది కూడా అదే సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఓటుకు నోటు వివాదంలో ముఖ్యమంత్రే స్వయంగా కూరుకుపోవడంతో తెలుగుదేశం నేతలు కొంత వెనకడుగువేశారు. పార్టీలోకి రావాలన్న విషయాన్ని ఫోన్లలో మాట్లాడటం లేదు. రహస్య ప్రాంతాలకు పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారు. ఇటీవల దర్శిలో ఒక ఎంపీటీసీ పార్టీలో చేరితే అతనికి ఒంగోలు తీసుకు వచ్చి ఒక్కో ఏటీఎం నుంచి, ఒక్కో అకౌంట్ ద్వారా కొంత మొత్తం డ్రా చేసి అందజేశారు. ఒకే ఖాతా నుంచి ఎక్కువ మొత్తం డ్రా చేయకుండా జాగ్రత్త పడ్డారు.

అదే సమయంలో పార్టీలోకి వస్తారనుకున్న వారిని కూడా పూర్తిగా నమ్మడం లేదు. దీంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ తన అభ్యర్థిని నిలబెట్టదంటూ ఒక దశలో ప్రచారం చేశారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించడంతో పోటీ ఉత్కంఠగా మారింది. ఎవరు గెలిచినా అతితక్కువ ఓట్లతోనే  గెలిచే అవకాశం ఉండటంతో ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement