సాక్షి, శ్రీకాకుళం : గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న ఈ ఘోరం చూస్తే టీడీపీ నేతలు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. అధికారులు డమ్మీలైపోయారు. నేతలే లబ్ధిదారుల ఎంపిక చేసేశారు. ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే బెందాళం అశోక్ పాత్ర గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క ఇచ్ఛాపురం మండలంలోనే 1490 ఒంటరి మహిళ పింఛన్లు అనర్హమైనవని తేలాయంటే ఇక ఆ నియోజకవర్గంలోని ఇచ్ఛాపురం అర్బన్, కవిటి, కంచిలి, సోంపేటలో ఎంత మేర అక్రమాలు జరిగాయో పరిశీలించాలి. ఇంకా దారుణమేంటంటే వితంతువులు కానప్పటికీ వితంతు పింఛన్లు పొందుతున్న వారు 232మంది ఉన్నారు. మత్స్యకార సామాజిక వర్గం కానప్పటికీ మత్స్యకార పింఛన్లు ఇద్దరు పొందారు. వృద్ధాప్యంలో లేకపోయినప్పటికీ ఒకరు వృద్ధాప్య పింఛను పొందుతున్నారు. దీన్నిబట్టి ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అక్రమాల దందా ఏ స్థాయిలో జరిగిందో స్పష్టమవుతుంది.
ముందే చెప్పిన సాక్షి
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అనేక రకాలుగా అవినీతి జరిగింది. భూములను ఆక్రమించారు. ఇసుక దోపిడీకి పాల్పడ్డా రు. ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేశారు. ఔట్ సోర్సింగ్, పౌష్టికాహారం పోస్టులను అమ్ముకున్నారు. గత ఐదేళ్లుగా ఇలా అనేక రకాలుగా అవినీతికి పాల్పడ్డారు. ఇందులో ఎవరి హస్తమేంటో నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే. అన్నింటికన్నా భర్తలు ఉన్నప్పటికీ ఒంటరి మహిళ కోటాలో పింఛన్లు మంజూరు చేసిన ఘనత ఇక్కడి టీడీపీ నేతలకు దక్కింది. వితంతువులు కాకపోయినప్పటికీ వితంతు పింఛ న్లు మంజూరు చేయించిన ఘనాపాటీలు ఇక్కడున్నారు. ఇదే విషయంపై గతనెల 20వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘అమ్మో ఇచ్ఛాపురం’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. నియోజకవర్గంలో జరిగిన ఒంట రి మహిళ పింఛన్ల బాగోతాన్ని ఈ కథనం బట్టబయలు చేసింది. అధికారుల విచారణలో కూడా అక్రమాలు వెలుగు చూశాయి.
ఎవరా ఘనుడు?
భర్తలున్న వారికి ఒంటరి మహిళ పింఛన్లు, వితంతువులు కాని వారికి వితంతు పింఛన్లు మంజూరు చేయించిన ఘనుడు ఎవరో అక్కడి టీడీపీ నేతలే చెప్పాలి. నియోజకవర్గంలో రింగ్ మాస్టర్‌గా పేరొందిన కీలక ప్రజాప్రతినిధి ఇందులో ప్రధాన భూమిక వహించారు. ఎంత దారుణమంటే భర్తలను తహసీల్దార్ కార్యాలయాలకు తీసుకొచ్చి ఒంటరి మహిళ ధ్రువీకరణ పత్రాలు ఇప్పించిన ఘనత అక్కడి టీడీపీ నేతలకు దక్కింది. చెప్పాలంటే అధికారుల చేత గత ప్రభుత్వంలో తప్పలు చేయించారు. దీనిబట్టి టీడీపీ హయాంలో అర్హతల కన్న సిఫార్సులే కొలమానంగా పింఛన్లు ఎంపిక చేశారన్నది స్పష్టమైంది.
జిల్లావ్యాప్తంగా పరిస్థితేంటి?
ఒక్క ఇచ్ఛాపురం మండలంలోనే 1490 ఒంటరి మహిళ పింఛన్లు, 232 వితంతు పింఛన్లు అక్రమమని తేలాయంటే నియోజకవర్గంలోని మిగతా మండలాలు, జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఇంకెన్ని ఉంటాయో చూడాల్సిన అవసరముంది. ఇచ్ఛాపురం మండలాన్ని శాంపిల్‌గా తీసుకుంటే జిల్లావ్యాప్తంగా ఇంకెన్ని ఘోరాలు జరిగాయో అర్థం చేసుకోవల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయన్నదానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవాలి.
చేసింది తప్పు... ఆపై అధికారులపై ధ్వజం
ఇచ్ఛాపురం మండలంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి అక్కడి టీడీపీ నేతలు అధికారులను టార్గెట్ చేస్తున్నారు. ఒకటి రెండు పింఛన్లకు సంబంధించి తేడాలొస్తే వాటిని సాకుగా చూపించి అధికారులను బెదిరిస్తున్న పరిస్థితి నెలకొంది. చేసింది తప్పు ఆపై ఎదురుదాడి చేస్తున్నారు. గత ఐదేళ్లు చేసిన ఘన కార్యాలు బయటపడుతుంటే తట్టుకోలేక అక్కసుతో అధికారులను లక్ష్యంగా చేసుకుని తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment