ఇచ్ఛాపురంలో అంతమంది ఒంటరి మహిళలా... ఎక్కడా లేని విధంగా ఒక్క నియోజకవర్గంలోనే 3681 ఒంటరి మహిళ పింఛన్లా? అంతమంది భర్తలు భార్యలను విడిచి పెట్టేశారా? జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేనిది ఇక్కడే ఎందుకీ పరిస్థితి? అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడేదో జరిగిందని మల్లగుల్లాలు పడుతున్నారు. వాటి సంగతేంటో చూడాలని... విచారణ జరిపి వాస్తవాలేంటో తెలుసుకోవాలని... అక్కడ జరిగిన అక్రమాల నిగ్గు తేల్చాలని నిఘా పెట్టారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వృద్ధాప్య పింఛన్‌కు ఎంపిక కాలేదా? వితంతు పింఛను వర్తించదా? వికలాంగ పింఛన్‌కు అర్హత పొందలేదా? అయితే ఒంటరి మహిళ పింఛను కింద తోసేయండి. మేము చూసుకుంటాం... తహసీల్దార్ ద్వారా ధ్రువీకరణ పత్రం ఇప్పిస్తాం అని చెప్పి గత ప్రభుత్వంలో అధికారుల చేత తప్పులు చేయించేశారు. భర్త ఉన్నప్పటికీ ఒంటరి మహిళ కింద పింఛన్లు మంజూరుచేసేశారు. టీడీపీ హయాంలో అర్హతల కన్న సిఫార్సులే కొలమానంగా పింఛన్లు మంజూరు చేయడంతో అనర్హులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింది. ముఖ్యంగా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అత్యధికంగా ఒంటరి మహిళ పింఛన్ల కింద అక్రమాలు జరిగాయి. దీనివెనక అక్కడి ప్రజాప్రతినిధి కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులపై ఒత్తిడి చేసి అనర్హులకు సైతం ఒంటరి మహిళలు పింఛన్లు మంజూరు చేయించినట్టుగా ఆరోపణలున్నాయి.
జిల్లావ్యాప్తంగా 3 వేలకు పైగా అనర్హులు ఒంటరి మహిళ పింఛన్లు పొందుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారి సామాజిక పింఛన్ల ఎంపికలో సిఫార్సులే ప్రామాణికమయ్యాయి. 2004కు ముందు.. ఉన్న పింఛనుదారులు చనిపోతేనే కొత్తగా పింఛన్ మంజూరు చేసేశారు. దీంతో కొత్తగా పింఛన్ పొందే వారి సంఖ్య సింగిల్ డిజిట్‌లోనే ఉండేది. ఇక 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చాక అర్హతలు పక్కన పెట్టి జన్మభూమి కమిటీ సిఫార్సులున్నవారికే పింఛన్లు ఇచ్చేవారు. వయస్సు మార్పులతోనూ, వికలాంగ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతోనూ, భర్తలున్న వారికి సైతం వితంతు పింఛన్లు, చివరికి భర్తలు విడిచిపెట్టారని చెప్పి ఒంటరి మహిళ పింఛన్లను మంజూరు చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కింది. ఈ విధంగా చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి అర్హులకు చుక్కలు చూపించిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ నేతల సిఫార్సులే అర్హతగా తీసుకున్నారే తప్ప వాస్తవ పరిస్థితులను పరిశీలనలోకి తీసుకోలేదు. వాస్తవంగా భర్తలు విడిచి పెట్టిన మహిళలకు పింఛన్లు మంజూరు కాలేదు గాని భర్తలున్న వారికి మాత్రం ఒంటరి మహిళ కింద పింఛన్లు మంజూరు చేసిన దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఒంటరి మహిళ కింద అడ్డగోలుగా పింఛన్లు మంజూరు చేసేశారు.
దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ వెయ్యికిలోపే ఒంటరి మహిళ పింఛన్లు ఉన్నాయి. టెక్కలిలో 1099 పింఛన్లు ఉన్నాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గం విషయానికొస్తే ఏకంగా 3681 పింఛన్లు ఒంటరి మహిళ కేటగిరీలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 10,724 ఒంటరి మహిళ పింఛన్లు ఉంటే ఒక్క ఇచ్ఛాపురంలోనే 3681 పింఛన్లు ఉండటమేంటని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ ఒక్క నియోజకవర్గం నుంచి వెయ్యి మందికి పైగా అర్హత లేనివారికి ఒంటరి మహిళ పింఛన్లు ఇచ్చేశారని ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఇదే విషయమై జిల్లా అధికారులు అక్కడి అధికారులను వివరణ కోరేసరికి ఏం చేస్తాం... ఒత్తిడి అలాంటిదని చెప్పుకొచ్చినట్టు సమాచారం. భర్తతో వచ్చి ఒంటరి మహిళ కింద ధ్రువీకరణ పత్రాలు పొందినట్టుగా తెలుస్తోంది. అలాగే మిగతా నియోజకవర్గాల నుంచి ఒంటరి మహిళ పింఛన్లపై ఫిర్యాదులొస్తున్నాయి. కళ్ల ముందు భర్తలు కనబడుతున్నా... వారికెలా ఒంటరి మహిళ కింద పింఛన్లు ఇచ్చారని గ్రామాల నుంచి ఫిర్యాదులు చేస్తున్నారు.
ఒంటరి మహిళ పింఛన్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు
జిల్లాలో ఒంటరి మహిళ పింఛన్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. విచారణ జరుపుతున్నాం. ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఫిర్యాదులు ఆధారంగా అర్హులా.. అనర్హులా? అన్న దానిపై విచారణ జరుపుతున్నాం. అక్రమాలు జరిగినట్టు తేలితే రద్దు చేస్తాం.
– కళ్యాణ చక్రవర్తి, డీఆర్‌డీఎ ప్రాజెక్టు డైరెక్టర్, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment