కలహాల కాపురం
►టీడీపీలో ముదురుతున్న అంతర్గత కుమ్ములాటలు
► జిల్లా అధ్యక్షుని ఎంపికపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
► ఏడాదవుతున్నా నియోజకవర్గ ఇన్‌ఛార్జిల నియామకంలో జాప్యం
► నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
► హాజరు కానున్న ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు
► సమావేశం సజావుగా సాగేనా?
సాక్షి, కడప : తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా....దేశం శ్రేణుల్లో ఉత్సాహం లేదు...పైగా నిస్తేజం అలుముకుంది. అధికార పార్టీలో ఉన్నా పనులు జరగక పోవడం..పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు క్యాడర్‌ను కుంగదీస్తున్నాయి. రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కడపలో మాత్రం ప్రతిపక్షంగానే చెప్పుకోవచ్చు. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిందిటిని కైవసం చేసుకోగా, టీడీపీ కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
జిల్లా తెలుగుదేశంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య అసమ్మతి సెగలు కమ్ముకుని.. ఎవరికి వారు పార్టీలో వర్గాలను పెంచి పోస్తున్నారు. గతంలో కడపలో జరిగిన సమావేశంలో కడప ఇన్‌ఛార్జి విషయమై గొడవ జరగగా...జిల్లా అధ్యక్షుడు కార్యకర్తపై చేయి చేసుకునే స్థాయికి వెళ్లింది. దీంతో సమావేశం రచ్చరచ్చగా మారి సవాళ్లు, ప్రతిసవాళ్లతో అట్టుడికింది.
రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్యనే ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి నేటి వరకు ఏడాది పూర్తవుతున్నా ఇంతవరకు ఇన్‌ఛార్జిల నియామకం జరగకపోవడానికి కూడా వర్గాల మధ్య పోరే కారణమన్నది బహిరంగ సత్యం. బద్వేలులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయజ్యోతి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పులివెందులలోనూ ముక్కోణపు పోరు నడుస్తోంది.
ఒకవైపు డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, మరోవైపు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి, ఇంకోవైపు నియోజకవర్గ టీడీపీ నాయకుడు రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) వర్గాలుఎవరికి వారు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాజంపేటలో కూడా బ్రహ్మయ్య, మేడా మల్లికార్జునరెడ్డిల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు తనయుడు సుగవాసి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నడుచుకుంటున్నారు. ప్రొద్దుటూరులో కూడా లింగారెడ్డి, వరదరాజులురెడ్డిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కడప నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ కూడా మూడు, నాలుగు వర్గాలు ఉన్నాయి. ప్రొద్దుటూరు, బద్వేలు, పులివెందుల, రాయచోటి, కడప, రాజంపేటలలో నేతల మధ్య వర్గపోరుతో ఇన్‌ఛార్జి నియామకాలు ఇంతవరకు చేపట్టలేదు.
అధ్యక్షుని ఎంపికపై ప్రతిష్టంభన
వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం లింగారెడ్డి కొనసాగుతున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఇప్పటికే చంద్రబాబు సర్వే ద్వారా వివరాలు సేకరించినా ఇంతవరకు అధ్యక్షుని పేరు ప్రకటించలేదు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, పార్లమెంటు ఇన్‌ఛార్జి శ్రీనివాసులురెడ్డి (వాసు), ప్రస్తుత అధ్యక్షుడు లింగారెడ్డిలు పోటీ పడుతున్నారు. అధ్యక్షుడి పేరు ప్రకటించకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
టీడీపీ సమావేశానికి ‘గంటా’
కడపలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ సాయి శ్రీనివాస కల్యాణ మండపంలో టీడీపీ జిల్లా విసృ్తత స్థాయి సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరు కానున్నారు. ఇప్పటికే జిల్లా టీడీపీలో విభేదాలు ముదరడం....నేతల మధ్య సయోధ్య లేకపోవడం....పార్టీలో నిస్తేజం నెలకొన్న నేపథ్యంలో మంత్రి సమక్షంలో జరగనున్న సమావేశం వాడి వేడిగా జరిగే అవకాశముందని కార్యకర్తలు భావిస్తున్నారు.