District president Election
-
అధ్యక్షా...ఆగాల్సిందేనా !
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎన్నికలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వాస్తవానికి పదిరోజుల క్రితమై ఈ ఎన్నికలు పూర్తికావాల్సి ఉన్నా.. వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో జిల్లా అధ్యక్షుల ఎన్నిక ఇప్పట్లో జరిగేనా అన్న చర్చ కేడర్‌లో జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం వరకూ బీజేపీ జిల్లా అధ్యక్షులను ఎన్నుకుంటూనే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమమవుతుంది. ఈ నెల 16, 17 తేదీల్లోగానే ఆయా జిల్లా అధ్యక్షుల ఎన్నికలు జరగాల్సి ఉండగా, అవి ఆగిపోయాయి. దీంతో ఈ నెల 26 తర్వాత ఒకటి, రెండురోజుల్లో పూర్తిచేయాల్సిన రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కూడా వాయిదా పడుతుందా అన్న అనుమానం నెలకొంది. ఒకవేళ 50 శాతం జిల్లా అధ్యక్షుల ఎన్నికలు పూర్తికాక, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగకపోతే...జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యాకే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. జిల్లా అధ్యక్షుల ఎన్నికలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పింపంచడంతోపాటు సామాజికవర్గాల వారీగా కూడా సమతూకం పాటించాల్సి ఉంది.ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో దీనికి సంబంధించి కొందరి పేర్లపై ఏకాభిప్రాయం కుదర లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో అధ్యక్ష పదవులకు ప్రతిపాదనలు పంపిన ముగ్గురేసి అభ్యర్థుల పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియ నిలిచినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ ఇదే విధంగా జిల్లా అధ్యక్షులను నియమించడంపై బహిరంగంగానే కేడర్ కొట్లాడుకోవడం, విమర్శలు ఎదురైన విషయాన్ని కూడా ఇప్పుడు గుర్తుచేసుకోవడం గమనార్హం. మూడేసి పేర్ల జాబితాపై స్పష్టతేదీ ? ఒక్కో జిల్లాకు ముగ్గురేసి నాయకులతో ఆశావహుల జాబితాను సిద్ధం చేసి జాతీయ నాయకత్వానికి పంపినా, వీటి నియామకంపై ఇంకా స్పష్టత రాలేదు. కొందరు రాష్ట్ర, జిల్లా నాయకులు ఢిల్లీ వెళ్లి ఆయా జిల్లాల జాబితాలపై ఫిర్యాదులు, ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మరింతగా ముదిరిందని చెబుతున్నారు.ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నగరానికి వచ్చాక జిల్లా అధ్యక్షుల ఎన్నికపై ఓ స్పష్టత వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదిలాఉంటే జిల్లా అధ్యక్షుల ఎన్నిక పూర్తయ్యాకే... రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై అభిప్రాయసేకరణ జరుపుతారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎన్నికల అధికారి అయిన కేంద్ర మంత్రి శోభా కరాంద్లజే ఇక్కడకు రావాల్సి ఉంది. ఈ అభిప్రాయ సేకరణ సందర్భంగా ఒక పేరుపై ఏకాభిప్రాయానికి వస్తే జాతీయ నాయకత్వం అనుమతి తీసుకొని ఆమె ఇక్కడే పార్టీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని రాష్ట్ర ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. -
చంద్రబాబు వద్దకు
జిల్లా అధ్యక్షుల ఎన్నికల రగడ హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మూడు జిల్లాల అధ్యక్షుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరట్లేదు. సోమవారం హైదరాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉన్నా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ బాధ్యతను పార్టీ అధినేత చంద్రబాబుకే అప్పగిం చారు. ఆదివారం జరగాల్సిన నల్లగొండ అధ్యక్షుని ఎంపిక కూడా ఏకాభిప్రాయం లేక వాయిదా పడింది. హైదరాబాద్ లో ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్‌తోపాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పోటీ పడుతుండగా మెజారిటీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, సీనియర్లు గోపీనాథ్‌నే నియమించాలని అభిప్రాయపడ్డారు. కానీ పార్టీ అధిష్టానం కృష్ణయాదవ్‌ను మార్చే విషయంలో సందిగ్ధంగా ఉంది. టీఆర్ఎస్లో చేరిన తలసానికి పోటీగా కృష్ణయాదవ్‌ను నియమించి 4 నెలలు కూడా కాలేదని, అప్పుడే మారిస్తే తప్పుడు సంకేతం పోతుందని భావిస్తోంది. మెదక్‌లో అధ్యక్షురాలు శశికళ యాదవరెడ్డితోపాటు బట్టి జగపతి, పట్నం మాణిక్యం, నరోత్తం పోటీ నెలకొంది. వరంగల్‌లో పార్టీ అధ్యక్ష బాధ్యతలను సీనియర్ నేతలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్కలలో ఒకరికి అప్పగించాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రయత్నిస్తుండగా వారు అందుకు ఒప్పుకోవట్లేదు. భూపాలపల్లి నేత గండ్ర సత్యనారాయణరావు ఆసక్తి చూపుతున్నా ఎర్రబెల్లికి ఇష్టం లేదని సమాచారం. -
కలహాల కాపురం
►టీడీపీలో ముదురుతున్న అంతర్గత కుమ్ములాటలు ► జిల్లా అధ్యక్షుని ఎంపికపై కొనసాగుతున్న ప్రతిష్టంభన ► ఏడాదవుతున్నా నియోజకవర్గ ఇన్‌ఛార్జిల నియామకంలో జాప్యం ► నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ► హాజరు కానున్న ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ► సమావేశం సజావుగా సాగేనా? సాక్షి, కడప : తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా....దేశం శ్రేణుల్లో ఉత్సాహం లేదు...పైగా నిస్తేజం అలుముకుంది. అధికార పార్టీలో ఉన్నా పనులు జరగక పోవడం..పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు క్యాడర్‌ను కుంగదీస్తున్నాయి. రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కడపలో మాత్రం ప్రతిపక్షంగానే చెప్పుకోవచ్చు. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిందిటిని కైవసం చేసుకోగా, టీడీపీ కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జిల్లా తెలుగుదేశంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య అసమ్మతి సెగలు కమ్ముకుని.. ఎవరికి వారు పార్టీలో వర్గాలను పెంచి పోస్తున్నారు. గతంలో కడపలో జరిగిన సమావేశంలో కడప ఇన్‌ఛార్జి విషయమై గొడవ జరగగా...జిల్లా అధ్యక్షుడు కార్యకర్తపై చేయి చేసుకునే స్థాయికి వెళ్లింది. దీంతో సమావేశం రచ్చరచ్చగా మారి సవాళ్లు, ప్రతిసవాళ్లతో అట్టుడికింది. రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్యనే ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి నేటి వరకు ఏడాది పూర్తవుతున్నా ఇంతవరకు ఇన్‌ఛార్జిల నియామకం జరగకపోవడానికి కూడా వర్గాల మధ్య పోరే కారణమన్నది బహిరంగ సత్యం. బద్వేలులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయజ్యోతి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పులివెందులలోనూ ముక్కోణపు పోరు నడుస్తోంది. ఒకవైపు డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, మరోవైపు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి, ఇంకోవైపు నియోజకవర్గ టీడీపీ నాయకుడు రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) వర్గాలుఎవరికి వారు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాజంపేటలో కూడా బ్రహ్మయ్య, మేడా మల్లికార్జునరెడ్డిల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు తనయుడు సుగవాసి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నడుచుకుంటున్నారు. ప్రొద్దుటూరులో కూడా లింగారెడ్డి, వరదరాజులురెడ్డిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కడప నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ కూడా మూడు, నాలుగు వర్గాలు ఉన్నాయి. ప్రొద్దుటూరు, బద్వేలు, పులివెందుల, రాయచోటి, కడప, రాజంపేటలలో నేతల మధ్య వర్గపోరుతో ఇన్‌ఛార్జి నియామకాలు ఇంతవరకు చేపట్టలేదు. అధ్యక్షుని ఎంపికపై ప్రతిష్టంభన వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం లింగారెడ్డి కొనసాగుతున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఇప్పటికే చంద్రబాబు సర్వే ద్వారా వివరాలు సేకరించినా ఇంతవరకు అధ్యక్షుని పేరు ప్రకటించలేదు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, పార్లమెంటు ఇన్‌ఛార్జి శ్రీనివాసులురెడ్డి (వాసు), ప్రస్తుత అధ్యక్షుడు లింగారెడ్డిలు పోటీ పడుతున్నారు. అధ్యక్షుడి పేరు ప్రకటించకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. టీడీపీ సమావేశానికి ‘గంటా’ కడపలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ సాయి శ్రీనివాస కల్యాణ మండపంలో టీడీపీ జిల్లా విసృ్తత స్థాయి సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరు కానున్నారు. ఇప్పటికే జిల్లా టీడీపీలో విభేదాలు ముదరడం....నేతల మధ్య సయోధ్య లేకపోవడం....పార్టీలో నిస్తేజం నెలకొన్న నేపథ్యంలో మంత్రి సమక్షంలో జరగనున్న సమావేశం వాడి వేడిగా జరిగే అవకాశముందని కార్యకర్తలు భావిస్తున్నారు. -
దేశంలో సమన్వయలోపం
నేడే జిల్లా అధ్యక్షుని ఎన్నిక సమన్వయ కమిటీ సమావేశం లేకుండానే ఎన్నిక ఎవరికి వారుగా ప్రయత్నాలు శివాజీ కుటుంబానికే అవకాశమంటూ ప్రచారం శ్రీకాకుళం: జిల్లా తెలుగుదేశం పార్టీలో సమన్వయం కొరవడింది. సాధారణంగా జిల్లా అధ్యక్ష ఎన్నిక సమయంలో సమన్వయ కమిటీ సమావేశమై ఓ నిర్ణయానికొచ్చేది. ఈ దఫా అటువంటి సమావేశం ఏదీ లేకుండా నేరుగా ఎన్నికల సమావేశానికి వెళ్తున్నారు. అధ్యక్ష పదవి కోసం ఎవరూ రాజీ పడకుండా ఎవరికి వారుగా ప్రయత్నాలు సాగిస్తుండడమే దీనికి కారణమని తెలుగుదేశం వర్గాలే చర్చించుకుంటున్నాయి. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న పలాస శాసనసభ్యుడు గౌతు శ్యామసుందర శివాజీకి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వవచ్చునని కేడర్‌లో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. అయితే శివాజీ మాత్రం అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా ఫర్వాలేదని పాత అధ్యక్షుడిని మార్చాలని పట్టుబడుతున్నట్టు వినికిడి. కేబినెట్లోగానీ, టీటీడీ పాలకమండలిలోగానీ అవకాశం ఇవ్వలేదు గాబట్టి జిల్లా అధ్యక్ష పదవి కచ్చితంగా ఆయనకే ఇస్తుందని, కనీసం ఆయనకు కాకున్నా ఆయన తనయ శిరీషకైనా అప్పగిస్తారని తెలుగుదేశంలోని అధిక శాతం మంది భావిస్తున్నారు. శిరీష భర్తకు అధిష్టానం వద్ద పలుకుబడి ఉందని దీనిని ఉపయోగించే ఎన్నికల సమయంలో చివరి క్షణం వరకు శివాజీ పేరు ఖరారు కాకుండా చేశారని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కాపు సామాజిక వర్గానికి జిల్లాలో అన్యాయం జరిగిందని దానిని పూడ్చాలంటే తనకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని పంచాయతీరాజ్ చాంబర్ ప్రధాన కార్యదర్శి కలిశెట్టి అప్పలనాయుడు కోరుతున్నారు. ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చిన లోకేష్‌ను కలసి పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని తెలుపుతూ తనకు ఓ అవకాశం ఇవ్వాలని కోరినట్టు భోగట్టా. తన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నాయకుల ద్వారా, జిల్లాలోని ప్రముఖ నేతల ద్వారా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు చౌదరి బాబ్జి తనకు మరో అవకాశాన్ని ఇవ్వాలని నేరుగా అధినాయకుడినే కోరినట్టు తెలియవచ్చింది. కష్టకాలంలో తాను సమర్థంగా పనిచేసి పార్టీని విజయపథంలో నడిపించానని మరోసారి అవకాశం ఇస్తే పార్టీని మరింత బలోపేతం చేస్తానని ఆయన చెబుతూ మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధిష్టానం మాత్రం ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ఇప్పటికే సీనియర్ నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలని ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చి జిల్లా ఇన్చార్జి మంత్రి, పార్టీ పరిశీలకుల ద్వారా ఆ పేరును ప్రకటింప జేసేందుకు నిర్ణయించింది. ఆదివారం జరిగే అధ్యక్ష ఎన్నికకు జిల్లా ఇన్చార్జి మంత్రి పరిటాల సునీతతో పాటు జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ పరిశీలకులుగా బొండా ఉమామహేశ్వరరావు, తోట నర్శింహం, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌తో పాటు జిల్లా శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు పాల్గొననున్నారు. ఈ సమావేశం వాడీవేడీగా జరిగే అవకాశాలు ఉన్నాయి.