జిల్లా తెలుగుదేశం పార్టీలో సమన్వయం కొరవడింది. సాధారణంగా జిల్లా అధ్యక్ష ఎన్నిక సమయంలో సమన్వయ
నేడే జిల్లా అధ్యక్షుని ఎన్నిక
సమన్వయ కమిటీ
సమావేశం లేకుండానే ఎన్నిక
ఎవరికి వారుగా ప్రయత్నాలు
శివాజీ కుటుంబానికే
అవకాశమంటూ ప్రచారం
శ్రీకాకుళం:
జిల్లా తెలుగుదేశం పార్టీలో సమన్వయం కొరవడింది. సాధారణంగా జిల్లా అధ్యక్ష ఎన్నిక సమయంలో సమన్వయ కమిటీ సమావేశమై ఓ నిర్ణయానికొచ్చేది. ఈ దఫా అటువంటి సమావేశం ఏదీ లేకుండా నేరుగా ఎన్నికల సమావేశానికి వెళ్తున్నారు. అధ్యక్ష పదవి కోసం ఎవరూ రాజీ పడకుండా ఎవరికి వారుగా ప్రయత్నాలు సాగిస్తుండడమే దీనికి కారణమని తెలుగుదేశం వర్గాలే చర్చించుకుంటున్నాయి. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న పలాస శాసనసభ్యుడు గౌతు శ్యామసుందర శివాజీకి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వవచ్చునని కేడర్‌లో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. అయితే శివాజీ మాత్రం అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా ఫర్వాలేదని పాత అధ్యక్షుడిని మార్చాలని పట్టుబడుతున్నట్టు వినికిడి. కేబినెట్‌లోగానీ, టీటీడీ పాలకమండలిలోగానీ అవకాశం ఇవ్వలేదు గాబట్టి జిల్లా అధ్యక్ష పదవి కచ్చితంగా ఆయనకే ఇస్తుందని, కనీసం ఆయనకు కాకున్నా ఆయన తనయ శిరీషకైనా అప్పగిస్తారని తెలుగుదేశంలోని అధిక శాతం మంది భావిస్తున్నారు.
శిరీష భర్తకు అధిష్టానం వద్ద పలుకుబడి ఉందని దీనిని ఉపయోగించే ఎన్నికల సమయంలో చివరి క్షణం వరకు శివాజీ పేరు ఖరారు కాకుండా చేశారని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కాపు సామాజిక వర్గానికి జిల్లాలో అన్యాయం జరిగిందని దానిని పూడ్చాలంటే తనకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని పంచాయతీరాజ్ చాంబర్ ప్రధాన కార్యదర్శి కలిశెట్టి అప్పలనాయుడు కోరుతున్నారు. ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చిన లోకేష్‌ను కలసి పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని తెలుపుతూ తనకు ఓ అవకాశం ఇవ్వాలని కోరినట్టు భోగట్టా. తన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నాయకుల ద్వారా, జిల్లాలోని ప్రముఖ నేతల ద్వారా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ప్రస్తుత అధ్యక్షుడు చౌదరి బాబ్జి తనకు మరో అవకాశాన్ని ఇవ్వాలని నేరుగా అధినాయకుడినే కోరినట్టు తెలియవచ్చింది. కష్టకాలంలో తాను సమర్థంగా పనిచేసి పార్టీని విజయపథంలో నడిపించానని మరోసారి అవకాశం ఇస్తే పార్టీని మరింత బలోపేతం చేస్తానని ఆయన చెబుతూ మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధిష్టానం మాత్రం ఐవీఆర్‌ఎస్ విధానం ద్వారా ఇప్పటికే సీనియర్ నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలని ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పార్టీ పరిశీలకుల ద్వారా ఆ పేరును ప్రకటింప జేసేందుకు నిర్ణయించింది. ఆదివారం జరిగే అధ్యక్ష ఎన్నికకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పరిటాల సునీతతో పాటు జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ పరిశీలకులుగా బొండా ఉమామహేశ్వరరావు, తోట నర్శింహం, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌తో పాటు జిల్లా శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు పాల్గొననున్నారు. ఈ సమావేశం వాడీవేడీగా జరిగే అవకాశాలు ఉన్నాయి.