ఇంకా కొలిక్కి రాని బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎన్నికలు
కనీసం 50 శాతమైనా జిల్లా అధ్యక్షుల ఎన్నిక పూర్తయితేనే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రూట్ క్లియర్
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎన్నికలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వాస్తవానికి పదిరోజుల క్రితమై ఈ ఎన్నికలు పూర్తికావాల్సి ఉన్నా.. వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో జిల్లా అధ్యక్షుల ఎన్నిక ఇప్పట్లో జరిగేనా అన్న చర్చ కేడర్‌లో జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం వరకూ బీజేపీ జిల్లా అధ్యక్షులను ఎన్నుకుంటూనే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమమవుతుంది. ఈ నెల 16, 17 తేదీల్లోగానే ఆయా జిల్లా అధ్యక్షుల ఎన్నికలు జరగాల్సి ఉండగా, అవి ఆగిపోయాయి.
దీంతో ఈ నెల 26 తర్వాత ఒకటి, రెండురోజుల్లో పూర్తిచేయాల్సిన రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కూడా వాయిదా పడుతుందా అన్న అనుమానం నెలకొంది. ఒకవేళ 50 శాతం జిల్లా అధ్యక్షుల ఎన్నికలు పూర్తికాక, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగకపోతే...జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యాకే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు.
జిల్లా అధ్యక్షుల ఎన్నికలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పింపంచడంతోపాటు సామాజికవర్గాల వారీగా కూడా సమతూకం పాటించాల్సి ఉంది.ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో దీనికి సంబంధించి కొందరి పేర్లపై ఏకాభిప్రాయం కుదర లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు.
కొన్ని జిల్లాల్లో అధ్యక్ష పదవులకు ప్రతిపాదనలు పంపిన ముగ్గురేసి అభ్యర్థుల పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియ నిలిచినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ ఇదే విధంగా జిల్లా అధ్యక్షులను నియమించడంపై బహిరంగంగానే కేడర్ కొట్లాడుకోవడం, విమర్శలు ఎదురైన విషయాన్ని కూడా ఇప్పుడు గుర్తుచేసుకోవడం గమనార్హం.
మూడేసి పేర్ల జాబితాపై స్పష్టతేదీ ?
ఒక్కో జిల్లాకు ముగ్గురేసి నాయకులతో ఆశావహుల జాబితాను సిద్ధం చేసి జాతీయ నాయకత్వానికి పంపినా, వీటి నియామకంపై ఇంకా స్పష్టత రాలేదు. కొందరు రాష్ట్ర, జిల్లా నాయకులు ఢిల్లీ వెళ్లి ఆయా జిల్లాల జాబితాలపై ఫిర్యాదులు, ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మరింతగా ముదిరిందని చెబుతున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నగరానికి వచ్చాక జిల్లా అధ్యక్షుల ఎన్నికపై ఓ స్పష్టత వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదిలాఉంటే జిల్లా అధ్యక్షుల ఎన్నిక పూర్తయ్యాకే... రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై అభిప్రాయసేకరణ జరుపుతారు.
రాష్ట్ర పార్టీ అధ్యక్ష, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎన్నికల అధికారి అయిన కేంద్ర మంత్రి శోభా కరాంద్లజే ఇక్కడకు రావాల్సి ఉంది. ఈ అభిప్రాయ సేకరణ సందర్భంగా ఒక పేరుపై ఏకాభిప్రాయానికి వస్తే జాతీయ నాయకత్వం అనుమతి తీసుకొని ఆమె ఇక్కడే పార్టీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని రాష్ట్ర ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment