తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మూడు జిల్లాల అధ్యక్షుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరట్లేదు.
జిల్లా అధ్యక్షుల ఎన్నికల రగడ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మూడు జిల్లాల అధ్యక్షుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరట్లేదు. సోమవారం హైదరాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉన్నా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ బాధ్యతను పార్టీ అధినేత చంద్రబాబుకే అప్పగిం చారు. ఆదివారం జరగాల్సిన నల్లగొండ అధ్యక్షుని ఎంపిక కూడా ఏకాభిప్రాయం లేక వాయిదా పడింది. హైదరాబాద్ లో ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్‌తోపాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పోటీ పడుతుండగా మెజారిటీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, సీనియర్లు గోపీనాథ్‌నే నియమించాలని అభిప్రాయపడ్డారు.
కానీ పార్టీ అధిష్టానం కృష్ణయాదవ్‌ను మార్చే విషయంలో సందిగ్ధంగా ఉంది. టీఆర్‌ఎస్‌లో చేరిన తలసానికి పోటీగా కృష్ణయాదవ్‌ను నియమించి 4 నెలలు కూడా కాలేదని, అప్పుడే మారిస్తే తప్పుడు సంకేతం పోతుందని భావిస్తోంది. మెదక్‌లో అధ్యక్షురాలు శశికళ యాదవరెడ్డితోపాటు బట్టి జగపతి, పట్నం మాణిక్యం, నరోత్తం పోటీ నెలకొంది. వరంగల్‌లో పార్టీ అధ్యక్ష బాధ్యతలను సీనియర్ నేతలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్కలలో ఒకరికి అప్పగించాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రయత్నిస్తుండగా వారు అందుకు ఒప్పుకోవట్లేదు. భూపాలపల్లి నేత గండ్ర సత్యనారాయణరావు ఆసక్తి చూపుతున్నా ఎర్రబెల్లికి ఇష్టం లేదని సమాచారం.