టీడీపీ నేతల టీటీ‘ఢీ’! | Ttdp competition in ttd board member race | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల టీటీ‘ఢీ’!

Published Sun, Apr 15 2018 1:15 AM | Last Updated on Sat, Aug 11 2018 4:44 PM

Ttdp competition in ttd board member race  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  తెలంగాణ తెలుగుదేశం పార్టీలో టీటీడీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) సభ్యుని హోదా కోసం ఆ పార్టీ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇటీవల టీటీడీ బోర్డు చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన విషయం తెలిసిందే.

మరో వారం, పది రోజుల్లో పూర్తిస్థాయి బోర్డును ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టీటీడీపీ నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరోవైపు టీటీడీ సభ్యునిగా పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి పేరు దాదాపుగా ఖరారైందని, అయితే చివరి క్షణంలో కొందరు అడ్డుపడ్డారన్న చర్చ ఇప్పుడు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

నర్సారెడ్డి జంప్‌ కావడంతో..
తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటు చేసిన టీటీడీ పాలకమండలిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలకు బోర్డు సభ్యులుగా అవకాశం దక్కింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతోపాటు నిజామాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డిని టీటీడీ సభ్యులుగా అప్పట్లో నియమించారు. దీంతో టీటీడీ బోర్డులో తెలంగాణ ప్రాతినిధ్యం రెండుగా ఖరారైంది. తాజాగా టీటీడీ పాలకమండలి పదవీ కాలం ముగిసింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి సండ్ర వెంకటవీరయ్యకు మళ్లీ బెర్తు ఖరారనే చర్చ పార్టీలో జరుగుతోంది. వివాదాస్పదుడు కాకపోవడం, పార్టీ పక్షాన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆయనకు మరో అవకాశం వస్తుందని అంటున్నారు. మరో సభ్యుడు నర్సారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ఆయన స్థానంలో టీటీడీ ప్రాతినిధ్యం కోసం తెలంగాణ టీడీపీ నేతలు తీవ్రప ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధినేత ప్రసన్నం కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేసుకుంటున్నారు.


పెద్దిరెడ్డి, నర్సిరెడ్డి తీవ్ర యత్నాలు
అరికెల నర్సారెడ్డి స్థానంలో తమకు అవకాశం కల్పించాలని రాష్ట్ర నేతలు పోటీ పడుతున్నారు. అందులో కరీంనగర్‌ జిల్లా నాయకుడు పెద్దిరెడ్డి, నల్లగొండ నేత నన్నూరి నర్సిరెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఇప్పటికే చంద్రబాబును కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేసినట్టు సమాచారం.

ముందుగా నర్సిరెడ్డి వెళ్లి చంద్రబాబును కలిసి మాట్లాడి ఓకే చెప్పించుకున్నారని, ఆ తర్వాత పెద్దిరెడ్డి వెళ్లి తనకు కావాల్సిందేనని పట్టుబట్టారనే చర్చ ట్రస్ట్‌ భవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెద్దిరెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ మద్దతు ఉందని తెలుస్తోంది. పార్టీలో సీనియర్‌ నేతగా, మాజీ మంత్రిగా తనకు టీటీడీ ప్రాతినిధ్యం ఇవ్వాలని పెద్దిరెడ్డి అడుగుతున్నారు. ఇక నర్సిరెడ్డికి అవకాశం ఇవ్వాల్సిందేనని ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు కోరుతున్నారు.

అరవింద్‌తోపాటు మరొకరు కూడా..
మరో సీనియర్‌ నేత అరవింద్‌కుమార్‌ గౌడ్‌ పేరు కూడా టీటీడీ సభ్యుని కోసం ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించిన అరవింద్‌కు ఇంతవరకు ఎక్కడా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అరవింద్‌కు బీసీ కోటాలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వాలని కొందరు పట్టుపడుతున్నట్టు సమాచారం. అయితే ఈ ముగ్గురిలో ఓ నేతకు క్రైస్తవ మిషనరీలతో సంబంధాలున్నాయని, ఆయనకెలా సభ్యత్వం ఇస్తారని కొందరు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అయితే చైర్మన్‌గా నియమించిన వ్యక్తి విషయంలోనే ఇలాంటి ఆరోపణలున్నాయని, తనకు ఆ నిబంధన ఎందుకు అడ్డంకిగా మారుతుందని ఆ నేత తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు సమాచారం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు కొత్తకోట దయాకర్‌రెడ్డి పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చింది.

ఆయన పార్టీ మారతారనే సంకేతాల నేపథ్యంలో టీటీడీ సభ్యత్వం ఇవ్వడం ద్వారా ఆయనతోపాటు ఆయన సతీమణిని, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రెండు, మూడు నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌ను కాపాడుకోవచ్చని చంద్రబాబు ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏం చేస్తారో.. ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాల్సిందే! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement