పల్లె కట్టుకోమన్నారు! | TDP Leader Illegal Construction In Anantapur | Sakshi
Sakshi News home page

పల్లె కట్టుకోమన్నారు!

Published Fri, Jun 1 2018 7:10 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

TDP Leader Illegal Construction In Anantapur - Sakshi

టీడీపీ నాయకుడి ఇంటికి ఆనుకొని వంకలో నిర్మిస్తున్న రక్షణ గోడ

నల్లమాడ: మండల కేంద్రమైన నల్లమాడలో ఓ టీడీపీ నాయకుడి ఇంటికి రక్షణగా రూ.6.70 లక్షల ప్రభుత్వ నిధులతో సేఫ్టీవాల్‌ (రక్షణ గోడ) నిర్మించడం చర్చనీయాంశమైంది. పైగా వంకను ఆక్రమించి ఈ రక్షణ గోడ నిర్మిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంతజరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోగా చిన్ననీటి పారుదల శాఖ ఏఈఈ అనీల దగ్గరుండి పనులను చేయిస్తుండటం విశేషం. వివరాల్లోకెళితే... నల్లమాడ బస్టాండ్‌ కూడలి దిగువన ఉన్న వంకకు ఆనుకొని చిల్లగోర్లపల్లికి వెళ్లే రహదారి పక్కన టీడీపీ బీసీ సెల్‌ నాయకుడు రాజేంద్ర నివాస గృహం ఉంది. ప్రస్తుతం ఆయన ఇంటికి రక్షణగా వంకలో సేఫ్టీవాల్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రూ.6.70 లక్షల ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో 33 మీటర్లు పొడవునా రక్షణ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

వంకను ఆనుకొనే టీడీపీ నాయకుడి ఇల్లు ఉండటతో వర్షపు నీటికి ఇల్లు కోతకు గురికాకుండా ఉండేందుకు సేఫ్టీవాల్‌ నిర్మిస్తున్నారని, ఈ రక్షణ గోడ వల్ల ఆయనకు తప్ప మరెవరికీ ఉపయోగం లేదని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వంక పొడవునా రక్షణ గోడ నిర్మించాల్సి పోయి టీడీపీ నాయకుడి ఇంటి వద్దే నిర్మించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఐదారు అడుగులు వంకను కబ్జాచేసి రక్షణ గోడ నిర్మిస్తున్నారని, దీంతో వంక కుంచించుకుపోయి భారీ వర్షాలు వస్తే నీరు ముందుకు వెళ్లకపోగా ఇబ్బందులు తప్పేలా లేవని ఇరుగుపొరుగు వారు ఆందోళన చెందున్నారు. దీనిపై సదు టీడీపీ నాయకుడిని ప్రశ్నిస్తే సేఫ్టీవాల్‌ నిర్మించుకోమని తనకు ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి చెప్పారంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నట్లు వారు వాపోయారు. సంబంధిత ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి వంక ఆక్రమణకు గురికాకుండా కొలతలు వేయించాలని, అంతవరకు రక్షణ గోడ నిర్మాణ పనులు ఆపాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై మైనర్‌ ఇరిగేషన్‌ ఏఈఈ అనీలను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను పనులు చేయిస్తున్నానని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement