
టీడీపీ నాయకుడు జేవీసీ ప్రసాద్ అరెస్ట్
► మున్సిపల్ ఉద్యోగి ఆత్మహత్య కేసులో నిందితుడు
► రిమాండ్‌కు తరలించిన పోలీసులు
నంద్యాల: మున్సిపల్ కాంట్రాక్ట్ వాల్వ్ ఆపరేటర్ ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ నాయకుడు జేవీసీ ప్రసాద్‌ను పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. అతన్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా.. రిమాండ్‌కు ఆదేశించారు. నూనెపల్లె ట్యాంక్ వద్ద వాల్వ్ ఆపరేటర్‌గా హుసేన్‌బాషా పని చేస్తున్నారు. ఇటీవల పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రమైన విషయం తెలిసిందే. దీంతో ప్రజా ప్రతినిధులు, ప్రజలు సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. నూనెపల్లె ట్యాంక్ వద్ద ఉన్న హుసేన్‌బాషాను ..టీడీపీ కౌన్సిలర్ జేవీసీ హారిక భర్త ప్రసాద్ నీటి సరఫరా విషయంలో దూషించారు. అసభ్యంగా తిట్టడంతో అవమానం తట్టుకోలేక హుసేన్‌బాషా గత నెల 24న ట్యాంక్ వద్ద దోమల నివారణకై వినియోగించే రసాయనాలను తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అతనికి చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. కాని ఆయన చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందారు. ఈ మేరకు జేవీసీ ప్రసాద్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మున్సిపల్ ఆఫీసు ఎదుట మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు, ఆవాజ్ కమిటీ నాయకులు రాస్తారోకో చేశారు. అయితే పోలీసులు హుసేన్‌బాషా భార్య షహనాభాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
విచారణలో జేవీసీ ప్రసాద్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ... సెక్షన్ 306కింద కేసు నమోదు చేశారు. ఆయనను రాత్రి అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా, రిమాండ్‌కు ఆదేశించారు. అయితే హుసేన్ ఆత్మహత్యకు తాను కారకుడు కాదని, తనపై కుట్రపన్ని ఇరికించారని ప్రసాద్ తెలిపారు.