మహిళలపై ఆగని ‘తమ్ముళ్ల’ దౌర్జన్యకాండ
అనంతలో మహిళపై టీడీపీ నాయకుల దాడి
రాయదుర్గం : ‘అనంత’లో మహిళలపై టీడీపీ నేతల దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా సోమవారం రాత్రి గుమ్మఘట్ట మండలం పూలకుంటలో దాసంపల్లి లక్ష్మి అనే మహిళపై దాడి చేశారు.
బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. పూలకుంటలో ఆంజనేయస్వామి ఆలయంలోని సప్లయర్ సామగ్రి(షామియానా, వంటపాత్రలు)కు సంబంధించిన లావాదేవీల బాధ్యతలను లక్ష్మి భర్త హనుమంతరెడ్డికి గ్రామపెద్దలు అప్పగించారు. వచ్చే ఆదాయాన్ని గ్రామంలో వేలం పాట ద్వారా టీడీపీ నాయకుడైన డీలర్ బోయ చెన్నప్ప రూ.10వేలు వడ్డీకి తీసుకున్నాడు. గత వినాయక చవితినాడు ఆ డబ్బుకట్టాలని అడగడంతో ఆ రోజే హనుమంతరెడ్డిని చెన్నప్ప కొట్టాడు. అప్పట్లో గ్రామపెద్దలు రాజీచేశారు.
ప్రస్తుతం హనుమంతరెడ్డి కూలీ పనుల కోసం బెంగళూరుకు వలస వెళ్లగా ఇంట్లో భార్య లక్ష్మి, తల్లి అనంతమ్మ ఉంటున్నారు. సోమవారం చెన్నప్ప సోదరుడు తప్పతాగి వచ్చి ‘అధికారం మాది.. మాకెవ్వరూ ఎదురు మాట్లాడకూడదు’ అంటూ గొడవచేశాడు. పక్కకు వెళ్లాలంటూ చెప్పిన లక్ష్మి, ఆమె అత్తపై టీడీపీ నాయకులు బోయ చెన్నప్ప, తమ్ముడు వెంకటేశులు, అతడి భార్య మూకుమ్మడిగా దాడిచేశారు. ప్రస్తుతం లక్ష్మి రాయదుర్గం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా లక్ష్మినే తమపై దాడిచేసిందంటూ నిందితులు కూడా ఆస్పత్రిలో చేరడం గమనార్హం.