అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. అధికారం అడ్డం పెట్టుకుని విపక్ష నేతలే లక్ష్యంగా దారుణాలకు ఒడిగడుతున్నారు. రామగిరి మండలం పేరూరులో సుబ్బుకృష్ణ దంపతులపై దాడి ఘటన మరిచిపోక ముందే ఆదివారం ఇటు రాప్తాడులో , అటు తాడిపత్రిలో రెచ్చిపోయారు. ఓ మహిళ ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడులోనే ఆమె అనుచరులు భూ సమస్య నేపథ్యంలో ఇద్దరు మహిళలపై విచక్షణాæ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళల పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్చారు. ఇక తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు మండలం అప్పేచెర్లలో అధికార పార్టీ నేతల ఆగడాలు పెచ్చుమీరాయి. క్రిష్టిపాడు సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిని మట్టుబెట్టిన టీడీపీ నేతలు... ఈకేసులో రాజీకి రావాలని బాధితులపై ఒత్తిడి తెస్తున్నారు. జేసీ సోదరుల అండతో సమయం దొరికినప్పుడల్లా వైఎస్సార్ సీపీ నేతలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం అప్పేచర్ల గ్రామంలోని వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లను కూల్చేసి తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించారు.
రాప్తాడు: సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాక మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలోనే మహిళలపై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. బాధితుల సమాచారం మేరకు.. రాప్తాడు మండలం గొందిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త గిడ్డ మల్లయ్య తనకున్న తొమ్మిది ఎకరాల పొలం పక్కనే మరో 70 సెంట్ల ప్రభుత్వ భూమిని కూడా చదును చేసుకుని 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఈ భూమికి పక్కనే అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత మిడతల శీనయ్య పొలం ఉంది. ఆ భూమిని తన భూమిలో కలుపుకునేందుకు శీనయ్య కుమారుడు శీనయ్య రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తీసుకెళ్లాడు. దీంతో మల్లయ్యతో రెవెన్యూ అధికారులు చర్చించారు. భూమిపై సాగు హక్కు తనకే చెల్లుతుందని మల్లయ్య వివరించాడు. గ్రామ పెద్దలు కూడా మల్లయ్యకే ఆ భూమిపై సాగు హక్కు ఉందని తేల్చి చెప్పారు.
పోలీసుల జోక్యంతో..
మూడు నెలల క్రితం ఈ భూమి విషయంపై గ్రామ సర్పంచ్ లక్ష్మమ్మ కుమారుడు పసుపుల బాబయ్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి పోలీసులు చర్చించారు. మల్లయ్యతో మాట్లాడి ఆ భూమిపై హక్కులు వదులుకునేలా చేయాలని బాబయ్యకు సూచించారు. ఇందుకు నిరాకరించి స్టేషన్ బయటకు వస్తున్న బాబయ్యను పోలీసులు అడ్డుకుని తమదైన శైలీలో కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పట్లో ఈ ఘటన సంచనలమైంది.
కోర్టును ఆశ్రయించి..
వరుస ఘటనలతో విసుగెత్తిన మల్లయ్య ఆ భూమికి సంబంధించి కోర్టును ఆశ్రయించి, ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ శీనయ్య ఆయన కుమారులు ముగ్గురు, మరొక వ్యక్తి గోపాల్ శనివారం మల్లయ్య సాగు చేసుకుంటున్న 70 సెంట్ల ప్రభుత్వ భూమిని ట్రాక్టర్‌తో పాపించారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకునేందుకు బాధితులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఆదివారం ఉదయాన కర్రలు, ఇనుప రాడ్లతో మల్లయ్య ఇంటి వద్దకు చేరుకున్నారు. స్థానికులు వెంటనే మల్లయ్యను ఇంటిలోకి నెట్టి తలుపులు వేశారు. ఆ సమయంలో మల్లయ్య ముగ్గురు కుమారులు ఇంటి దగ్గర లేరు. ఇంటి బయట పనులు చేసుకుంటున్న మల్లయ్య భార్య రామక్క, రెండో కోడలు రాధమ్మపై వారు విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన చుట్టుపక్కల వారిని కూడా చితకబాదారు.
బాధితుల పరిస్థితి విషమం
దాడిలో గాయపడిన వన్నక్క, రాధమ్మను సర్వజనాస్పత్రికి స్థానికులు తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న వన్నక్కను మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, దాడి చేసిన మిడతల శీనయ్య, ఆయన ముగ్గురు కుమారులపై రౌడీ షీట్ ఉన్నట్లు పలువురు ఈ సందర్భంగా ఆరోపించారు.
మూడు నెలలుగా వాదించుకుంటున్నారు
ఈ విషయంపై ఎస్‌ఐ ధరణిబాబు వివరణ ఇస్తూ.. మల్లయ్య సాగు చేసుకుంటున్న భూమికి సంబంధించి ఇద్దరి మధ్య మూడు నెలలుగా ఘర్షణలు ఉన్నాయన్నారు. ఇరువర్గాలను స్టేషన్‌కు పిలిపించి రెవెన్యూ అధికారుల సమక్షంలో సమస్య పరిష్కరించుకోవాలని ఆదేశించినట్లు గుర్తు చేశారు. అయినా వారు వినకుండా ఘర్షణ పడుతూ వచ్చారు. ఆదివారం ఉదయం కూడా ఇరువర్గాల మహిళలు కొట్టుకున్నట్లు, ఒక వర్గం వారికి గాయాలైనట్లు సమాచారం అందిందని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment