
గాయాలపాలైన యాగర్లపల్లి యువకులు
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం అర్బన్ : ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటేశారనే నెపంతో ముగ్గురు యువకులపై దాడి చేసిన సంఘటన శుక్రవారం పట్టణలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక యాగర్లపల్లి ప్రాంతానికి చెందిన పెదపూడి శేఖర్, పెనుమాక రమేష్, యజ్జల ప్రమోద్‌లు శుక్రవారం మధ్యాహ్నం కడకట్ల ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణం వద్దకు వెళ్లారు. అదే ప్రాంతానికి చెందిన యువకులు తాడికొండ శ్రీను, తాడికొండ కుమార్, తాడికొండ నాని, సోమేశుల సోమేష్‌లు అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నారు. అక్కడికి చేరుకున్న ముగ్గురిని ఓట్లు ఏ పార్టీకి వేశారని ప్రశ్నించారు. ఫ్యాను గుర్తుకు ఓట్లు వేశామని చెప్పడంతో ఒక్కసారిగా వారిపై బీరు సీసాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను పగలగొట్టారు. దీంతో శేఖర్, రమేష్, ప్రమోద్‌లు స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీలపై దాడులు చేయడం పరిపాటిగా మారింది. ఎన్నికలైన అనంతరం కూడా వైఎస్సార్ సీపీ ఓటర్లపై దాడులు చేయడం పట్ల పట్టణంలోని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆయా పార్టీల నాయకులే సూచనలు చేస్తున్నారా? లేక అధినాయకులపై అభిమానమో అర్థంకాని పరిస్థితుల్లో ప్రజలు అయోమయస్థితిలో ఉన్నారు. ఇటీవల కాలంలో వీకర్స్‌కాలనీలోను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేసి గాయపర్చడం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment