రామచంద్రపురం :నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇళ్లపై దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల కాలంలో రామచంద్రపురం పట్టణంలో రెండు చోట్ల జరిగిన ఇటువంటి ఘటనలు సంచలనం సృష్టించాయి. పట్టణానికి చెందిన టీడీపీ కౌన్సిలర్‌తో సహా మరికొంత మంది నేతలు ఒక ఇంటిపై దాడిచేసి ధ్వసం చేయటమే కాకుండా విలువైన సామాన్లు తీసుకువెళ్లటంతో ఒక మహిళ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన దారుణం పట్టణంలో గురువారం జరిగింది. భాదితురాలి కథనం ప్రకారం.. పట్టణంలోని మధ్యకొంపల ప్రాంతానికి చెందిన వాడపల్లి జానకి అనే మహిళ తేతలి సూరారెడ్డి అనే వ్యక్తి వద్ద గతంలో కొంత అప్పు తీసుకున్నారు.
అప్పు నిమిత్తం ఇంటి దస్తావేజులను తాకట్టుపెట్టారు. ఆ అప్పును చెల్లించాలని గత డిసెంబర్ నుంచి సూరారెడ్డి పట్టణంలోని టీడీపీ నాయకుడు మున్సిపల్ కౌన్సిలర్ మాడా ఎల్లయ్యశంకర్ నాయకులు మల్లవరపు ప్రకాశరావు, కుక్కల చిన్న మరికొంత మందితో కలిసి వేధింపులకు దిగారు. గతంలో ఓసారి ఇంటిపై దాడి చేసి ప్రహరీ, టాయిలెట్లను కూడా గునపాలతో బద్దలుకొట్టి దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీనిపై గతంలో జానకి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇదిలా ఉండగా ఈనెల 3న జానకి ఇంటిపై ఎల్లయ్య శంకర్, టీడీపీ నాయకుడు మల్లవరపు ప్రకాశరావు, సూరారెడ్డి, కుక్కల చిన్న కలిసి రాత్రి ఏడు గ ంటల సమయంలో దాడి చేసి ఇంటిని బద్దలు కొట్టి ఇంటిలోని విలువైన సామాన్లు, డాక్యుమెంట్లు తీసుకుపోయారు.
దీంతో జానకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సామాన్లు ఇప్పించాలని వేడుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు నిందితులను ఇంతవరకు అరెస్టు చేయలేదు. దీంతో మనస్థాపానికి గురైన జానకి గురువారం మధ్యాహ్నం మత్తు మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు, విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జానకి ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఇదిలా ఉండగా గతంలో కమ్మవారి సావరంలో కొక్కిరపట్ల భారతి అనే మహిళ ఇంటిపై కూడా అర్ధరాత్రి సమయంలో దాడిచేసి భీభత్సం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినాతనకు న్యాయం జరగలేద ంటూ భారతి కోర్టులో అర్జీని అందించగా.. స్పందించిన న్యాయమూర్తి డిఎస్పీని విచారణ చేయాలని ఆదేశించారు.
బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ బోస్
అత్మహత్యాయత్నానికి పాల్పడిన వాడపల్లి జానకిని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ గురువారం ఏరియా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. జరిగిన విషయాన్ని ఆమెను అడిగితెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల పట్టణంలో ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయన్నారు. పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని ఆవేదన చెందారు. ఇంటిపై దాడిచేయటం అమానుషమన్నారు. పోలీసులు దీనిని తీవ్రంగా పరిగణించి వెంటనే కేసు నమోదు చేసి బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
కేసు నమోదు
ఈ ఘటనపై ఎస్సై ఎల్.శ్రీనును వివరణ కోరగా కేసు నమోదు చేశామని, ఇంటి నుంచి తీసుకువెళ్లిన సామాన్లను కొంత వరకు రికవరీ చేసినట్లు వివరించారు.
మహిళ ఇంటిపై టీడీపీ నేతల దాడి
Published Fri, May 8 2015 2:10 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement