తిరుపతి తమ్ముళ్ల బాహాబాహీ
♦ మహానాడు ఏర్పాట్లలో బయటపడ్డ విభేదాలు
♦ కట్టెలు, ఇనుప రాడ్లతో పరస్పరం దాడులు
♦ ఒకరిద్దరు నేతలు, అనుచరులకు స్వల్ప గాయాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగర తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ బాధ్యతల్లో కీలకంగా మెలిగే తెలుగు తమ్ముళ్లు గురువారం చొక్కాలు పట్టుకుని దూషించుకున్నారు. సరివి కట్టెలు, ఇనుప రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇరుపక్షాలకు చెందిన ఒకరిద్దరు నేతలకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ నెల 27 నుంచి తిరుపతిలో మహానాడు నిర్వహించే నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈ సంఘటన జరిగింది.
తిరుపతిలో బుధవారం జరిగిన టీడీపీ నగర కమిటీ సమావేశంలో నాయకులు, పార్టీ శ్రేణులు పెద్దగా పాల్గొనలేదు. ఖాళీ కుర్చీలున్న ఫోటోలను అలీఖాన్ అనే నేత వాట్సప్‌లో పార్టీ పెద్దలకు పంపాడు. దీన్ని గురువారం టీడీపీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్‌యాదవ్ అలీఖాన్, తెలుగు యువత నాయకుడు మధులను ప్రశ్నించారు. ఇది ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని నెట్టుకున్నారు. అనంతరం మరికొందరు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.