తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఎదుట నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్
జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 24 గంటలు పూర్తయ్యింది. అయినా సరే తమకేమీ ఇవి వర్తించవన్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ అంతర్గత సమావేశాలు.. సీఎం, మంత్రుల ఫొటోలున్న సైకిళ్లను విద్యార్థులకు ఇవ్వడం.. టీటీడీలో సిఫార్సు లేఖలకు ఇంకా దర్శనాలు కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సోమ వారం పలు ప్రాంతాల్లో యథేచ్ఛగా కోడ్‌ను ఉల్లంఘించారు.
చిత్తూరు అర్బన్: ఎన్నికల నియమావళి ఉల్లంఘనలో ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే చర్యలు తీసుకునే బాధ్యత రిటర్నింగ్ అధికారుల (ఆర్‌ఓ)పైనే ఉంది. ప్రభుత్వ శాఖల్లో జరిగే ఉల్లంఘనపై ఆయా శాఖాధిపతికి షోకాజ్ నోటీసు జారీచేసి సంజాయిషీ కోరుతారు. ఇచ్చే సంజాయిషీ సంతృప్తికరంగా లేకపోయినా.. ఉద్యోగుల పాత్ర ఉందని తేలినా వారిని సస్పెండ్ చేస్తారు. ఇక రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల విషయంలో ఉల్లంఘనులపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆర్‌ఓనే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తారు.
ఇలా ఉల్లంఘన..
♦ తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారపార్టీ నా యకుల సిఫార్సు లేఖలకు యంత్రాంగం దర్శనాలుకల్పిస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నా వినేవారులేరు. రాష్ట్ర పార్టీలో నామినేటెడ్ పదవుల్లో ఉన్న వ్యక్తుల నుంచి జిల్లా పార్టీ నాయకుల వరకు ఇస్తున్న సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకుంటూ కొందరు అధికారులు స్వామిభక్తి చాటుకుంటున్నారు.
♦ చిత్తూరు నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గ చైర్మన్ బాలాజీ డైరెక్టర్లతో అంతర్గత సమావేశం నిర్వహించారు. వైస్ చైర్‌పర్సన్‌ను మార్పుచేయాలంటూ చర్చలు జరిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ కార్యాక్రమాలు నిర్వహించకూడదనే నిబంధనలున్నా పట్టించుకునే పరిస్థితిలేదు.
♦ శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఇది కోడ్ ఉల్లంఘన పరిధిలోకి రాకపోయినప్పటికీ సైకిళ్లపై సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావు ఫొటోలతో స్టిక్కర్లు ఉండటం వివాస్పదమయ్యింది. స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా నేతల ఫొటోలతో ఎంఈవో సైకిళ్లను పంపిణీ చేశారు.
♦ తిరుపతిలోని ఆర్టీసీ బస్సులపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రచారాలకు సంబంధించిన చిత్రాలు తొలగించలేదు. బస్సులపై ఉన్న స్టిక్కర్లను చూసి సొంతశాఖలోని సిబ్బందే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
♦ మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఉన్న ఫ్లెక్సీలను అధికారులు తొలగించలేదు. అలాగే ఎన్టీఆర్ సుజల స్రవంతి కేంద్రాల వద్ద కూడా సీఎం చిత్రాలు దర్శనమిచ్చాయి. ఇక ఫైబర్‌నెట్ కేంద్రాల వద్ద ముఖ్యమంత్రి చిత్ర పటాలతో ఉన్న బ్యానర్లు, ఫ్లెక్సీలు ఇంకా తీయలేదు.
♦ తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఎదురుగా అన్న క్యాంటీన్ నిర్మాణానికి గతంలో టీడీపీ నాయకులు యత్నించారు. అయితే క్యాంటీన్ నిర్మాణానికి అనుమతులు రాకపోవడంతో వాటిని అలాగే వదిలేశారు. ఇంతలోపు ఎన్నికల కోడ్ నగరా మోగింది. అయినప్పటికి టీడీపీ నాయకులు ఎంత మాత్రం తగ్గలేదు. క్యాంటీన్ నిర్మాణానికి పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లభించకపోయినా, సాక్షాత్తు కార్యాలయానికి ఎదురుగా పనులను సోమవారం ప్రారంభించారు.
♦ పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో దారి పొడవునా అధికార పార్టీకి చెందిన బ్యానర్లు ఉన్నాయి. దీనిపై అధికారులను సం ప్రదిస్తే ఎన్నికల సంఘం నుంచి తమకు ఎటువంటి ఆదేశాలూ రాలేదని సమాధామనమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment