లేని వారికి బొట్టు పెట్టి.. | TDP Leaders Corruption In Pasupu Kumkuma Scheme | Sakshi
Sakshi News home page

లేని వారికి బొట్టు పెట్టి..

Published Mon, Jul 22 2019 8:40 AM | Last Updated on Mon, Jul 22 2019 8:40 AM

TDP Leaders Corruption In Pasupu Kumkuma Scheme - Sakshi

సాక్షి, అమరావతి : పసుపు–కుంకుమ పథకం పేరుతో గత ప్రభుత్వ పెద్దలు రూ.476 కోట్లను పక్కదారి పట్టించారు. ఎన్నికల సమయంలో పొదుపు సంఘాల మహిళల ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా ఈ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. పొదుపు సంఘాల్లో వాస్తవంగా ఉన్న మహిళల సంఖ్య కన్నా అత్యధికంగా మహిళలు సంఘాల్లో సభ్యులుగా ఉన్నట్టు గణాంకాల్లో చూపి.. అలా ఎక్కువగా చూపిన ఒక్కొక్క మహిళ పేరుతో రూ.10 వేల చొప్పున అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జిలు మింగేశారు. ఇందులో అప్పటి ప్రభుత్వాధినేతలకు కొంత వాటా వెళ్లిందని సమాచారం.  వాస్తవంగా ఈ పథకం అమలుకు నిధులు లేకపోయినా నాటి ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల నిధులను సైతం మళ్లించి ఆ డబ్బులను మహిళలకు పంపిణీ చేసింది. అయితే ఇలా పంపిణీ చేసిన డబ్బు నకిలీ సంఘాల పేరుతో పార్టీ పెద్దల జేబుల్లోకి వెళ్లినట్లు తాజాగా తేలడం కలకలం రేపుతోంది.
 
లేని వారు ఉన్నట్లు చూపి..
పొదుపు సంఘాల్లో 2019 జనవరి 18 నాటికి సభ్యులుగా ఉండే మహిళలు పసుపు–కుంకుమ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అర్హులుగా అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ సమయానికి రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 93.18 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండేవారు. గ్రామీణ ప్రాంతాల్లో 73,36,437 మంది మహిళలు 7,28,498 పొదుపు సంఘాల్లో.. పట్టణ ప్రాంతాల్లో 20,37,923 మంది మహిళలు 1,99,185 పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండేవారు. మొత్తం 93,74,360 మంది పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండగా, అందులో ఒకే మహిళ రెండు సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారిని ఒక్కరిగా పరిగణనలోకి తీసుకుంటే, 93.18 లక్షల మంది మహిళలను లబ్ధిదారులుగా లెక్క తేల్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2, 3 తేదీల్లో పసుపు– కుంకుమ పథకం చెక్కుల పంపిణీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో 93.18 లక్షల మంది మహిళలు లబ్ధిదారులుగా పేర్కొంది. అయితే 97,94,202 మందికి డబ్బులు చెల్లించినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అంటే 4.76 లక్షల మంది మహిళలు సంఘాల్లో సభ్యులుగా లేకపోయినా ఉన్నట్టు చూపి, వారి పేరిట రూ. 476 కోట్లను టీడీపీ నేతలు జేబుల్లో వేసుకున్నారనేది స్పష్టమవుతోంది. 

రెండో విడత చెక్కుల పంపిణీ నాటికి పెరిగిన సంఖ్య
ఎన్నికల సమయంలో పసుపు– కుంకుమ పథకం డబ్బులను మూడు విడతల్లో చెల్లించారు. ఫిబ్రవరి 5వ తేదీన చెల్లుబాటు అయ్యేలా 93.18 లక్షల మందికి చెక్కులు పంపిణీ చేశారు. మార్చి 8వ తేదీన జరిగిన రెండో విడత చెక్కుల పంపిణీ నాటికి లబ్ధిదారుల సంఖ్య అమాంతం 97.94 లక్షల మందికి పెరిగిపోయింది. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు కొత్తగా కొన్ని సంఘాల పేరుతో, అప్పటికే ఉన్న సంఘాల్లో అదనపు సభ్యులుగా చేరినట్టు జిల్లా డీఆర్‌డీఏ పీడీల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి వారందరికీ డబ్బుమంజూరు చేయించారు. పెరిగిన సభ్యులకు రెండో విడత సమయంలోనే మొదటి విడత డబ్బులు కూడా పంపిణీ చేశారు. రెండో విడత పంపిణీకి, మూడో విడత పంపిణీకి మధ్య మరో రెండున్నర లక్షల మంది పేరిట మరో రూ.250 కోట్లు టీడీపీ నేతలు తమ జేబుల్లో వేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఎన్నికల కోడ్‌ కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తే ఆ రూ.250 కోట్ల మేర కాజేయాలని రికార్డులు సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమితో వారు అనుకున్నది జరగలేదు. సంఘాల్లో లేని వారు ఉన్నట్లు చూపి ఒక్క గుంటూరు జిల్లాలోనే రూ.15 కోట్లు కాజేశారని విజిలెన్స్‌ విభాగం నిగ్గు తేల్చినట్టు సమాచారం. 

రూ.401 కోట్లివ్వాలని ఇప్పుడు కోరడంతో..
నిధులు లేకపోయినా ఏపీ డ్రింకింగ్‌ వాటర్‌ కార్పొరేషన్‌ మంచి నీటి పథకాల కోసం అంటూ బ్యాంకుల నుంచి అప్పు తెచ్చిన రూ.928 కోట్లు, రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ నిధులు రూ.180 కోట్లతో పాటు జిల్లా, మండల పరిషత్, గ్రామీణాభివృద్ధి నిధులు వందల కోట్ల రూపాయల మేర అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారికంగా పసుపు– కుంకుమ పథకానికి మళ్లించిన విషయం తెలిసిందే. రెండో విడత సమయానికి సభ్యుల సంఖ్య పెరిగినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అప్పటి ప్రభుత్వ పెద్దల నోటి మాట అనుమతితోనే డబ్బులిచ్చేయడం గమనార్హం. అప్పట్లో ఉన్న సెర్ప్‌ సీఈవోతో పాటు కొందరు సిబ్బంది తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూలంగా సహకరించి, ఆ నిధులను ఖర్చు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. అప్పట్లో పసుపు– కుంకుమ పథకానికి అదనంగా నిధులు చెల్లించామంటూ రూ.401 కోట్ల మేర విడుదల చేయాలంటూ అధికారులు ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో ఈ గూడుపుఠాని బయట పడినట్లు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement