ఉలికిపాటు ఎందుకో... | TDP Leaders Fear on YS Jagan Meet KTR | Sakshi
Sakshi News home page

ఉలికిపాటు ఎందుకో...

Published Fri, Jan 18 2019 8:19 AM | Last Updated on Fri, Jan 18 2019 8:19 AM

TDP Leaders Fear on YS Jagan Meet KTR - Sakshi

విజయనగరం: ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్‌ సీపీ ముందుకు సాగుతోంది. ప్రజావ్యతిరేక విధానాలపై నాలుగున్నరేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తోంది. ఆంధ్రాకు ప్రత్యేక హోదాకోసం పోరు సాగిస్తోంది. ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, యువతతో ముఖాముఖి, బంద్‌లు నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి పెంచింది. అందులో భాగంగానే రాజకీయంగా హోదాపై పోరు సాగించేందుకు మద్దతుకూడగడుతోంది. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి సీఎం చంద్రబాబు ప్రత్యే కహోదా వద్దు.. ప్యాకేజీయే ముద్దని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేశారు. మోదీతో విడిపోయాక హోదాకోసం అంటూ కాంగ్రెస్‌తో జతకట్టారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు తెలంగాణా నాయకులు జగన్‌ను కలిస్తే టీడీపీ నాయకుల్లో వణుకుపుడుతోంది. ఉలిక్కిపడుతున్నారు. ఓడిపోతామన్న సంకేతాలు వెలువడడంతో తప్పుడు ప్రచారం మొదలెట్టారంటూ పలువురు పేర్కొన్నారు. ప్రత్యేకహోదా కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్‌ కోసం ముందునుంచి పోరా టం చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలు సంటూ అభిప్రాయాలు వ్యక్తంచేశారు.  

మంచికోసమే మంతనాలు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనకు వైఎఎస్సార్‌ సీపీ అలుపె రుగని పోరాటం చేస్తోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో టీఆర్‌ఎస్‌ నాయకులు జగన్‌మోహన్‌రెడ్డితో చర్చలు జరిపితే సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు ఉలిక్కిపడుతున్నారు. 40 ఏళ్ల సీనియర్‌నంటూ చెప్పుకునే చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాటు ఐదు కోట్ల మంది ఆంధ్రులను  మోసగించి ఇప్పుడు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించి లబ్ధిపొం దాలని టీడీపీ నాయకులు చేస్తున్న యత్నాలు ఫలించవు. టీడీపీ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగింది. ప్రతీచిన్న విషయంలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటాన్ని, ప్రయత్నాలను ఎదుర్కొలేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 42 మంది ఎంపీలు కలిసి  ఒత్తిడి తీసుకువస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా దిగి వస్తోంది. టీఆర్‌ఎస్‌ నేతలు ఫెడరల్‌ ఫ్రంట్‌ఏర్పాటుపై చర్చించేందుకు వచ్చారన్న విషయాన్ని టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గ్రహించారు.- మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త

హోదా సాధనే అంతిమ లక్ష్యం
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ ఒక్క పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కేవలం ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటారు.ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం ఎవరితోనైనా కలసి పనిచేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి గతంలోనే చెప్పారు. వ్యవస్థలను కాపాడుకునేందుకు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు కలసి వచ్చే ఏ పార్టీతోనైనా కలసి పనిచేయడం తప్పులేదు. పార్లెమెంట్‌లో మన ఎంపీల సంఖ్యను పెంచుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలం టే ఏ ఒక్క పార్టీతోనో సాధ్యం కాదు కాబట్టి కలసివచ్చే పార్టీలన్నింటితో కలసి పనిచేస్తారు. ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవల్సిన అవసరం జగన్‌మోహన్‌రెడ్డికి లేదు. జగన్‌ ప్రజలకోసం బతుకుతున్న ఒక శక్తి ,ఆ ప్రజల ఆధరాభిమానాలు రేపు జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపిస్తాయి.   – అలజంగి జోగారావు, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త,పార్వతీపురం నియోజకవర్గం

జగన్‌కు భయపడే దుష్ప్రచారం
టీఆర్‌ఎస్‌ నాయకులు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకోసం ప్రాంతీయ పార్టీల నాయకులందరినీ కలుస్తున్నారు. అందులో భాగంగానే పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో వైఎస్సార్‌ సీపీ నేతను కలిశారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు వైఎస్సార్‌సీపీకి వస్తాయని నమ్మి జగన్‌తో భేటీ అయ్యారు. దీనిపై చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేయడం తగదు. జగన్‌మోహన్‌ రెడ్డికి భయపడే ఇలాంటి దుష్ప్రచారాలకు టీడీపీ నాయకులు పాల్పడుతున్నారు.    – శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు  

విమర్శలు తగవు..
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ నాయకులు వచ్చి వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చిస్తే టీడీపీ నాయకులకు ఉలికిపాటు ఎందుకో అర్థం కావడం లేదు. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పేరు చెబితేనే టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించేందుకు చేస్తున్న కుట్ర రాజకీయాలు ఎన్నాళ్లూ సాగవు. టీడీపీ నీచ రాజకీయాలతో పాటు నాలుగున్నరేళ్ల పాటు చేసిన మోసాలు త్వరలోనే బట్టబయలవుతాయి. రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే  ప్రత్యేక హోదా సాధించుకుని అభివృద్ధి పథంలో పయనించగలమని ప్రజలు సైతం భావిస్తున్నారు.  – ముద్దాడ మధు, వైఎస్సార్‌సీపీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి, విజయనగరం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement