సీటు.. భలే స్వీటు!  | TDP Leaders Fight For Nominated Posts | Sakshi
Sakshi News home page

సీటు.. భలే స్వీటు! 

Published Sun, Jun 2 2019 9:42 AM | Last Updated on Sun, Jun 2 2019 9:42 AM

TDP Leaders Fight For Nominated Posts - Sakshi

నామినేటెడ్‌ పోస్టులు... టీడీపీలో బాగా పనిచేసినవారికి, పెద్ద నాయకుల మనసు దోచుకున్నవారికి లేదంటే రానున్న ఎన్నికలలో వారి వల్ల నాలుగు ఓట్లు పడతాయనుకున్నవారికీ చంద్రబాబు ప్రభుత్వం కట్టబెడుతూ వచ్చింది. అదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లపాటు నాన్చీ... ఊరించీ సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు నుంచీ అదీ దఫదఫాలుగా భర్తీ చేస్తూ వచ్చింది! కొంతమందికి ఎన్నికల నోటిఫికేషన్‌కు మూడు నెలల ముందు కూడా పదవిలోకి వచ్చినవారూ ఉన్నారు! ఇటువంటి వారంతా ఇప్పుడు ప్రభుత్వం మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు దక్కక దక్కిన పదవిని వదులుకోలేక పట్టుకు వేలాడుతున్నారు. ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో పొందిన నామినేటెడ్‌ పోస్టులకు గౌరవంగా రాజీనామా చేయడమనేదీ సంప్రదాయంగా వస్తోంది! మరి దీన్ని ఎంతమంది పాటిస్తారోచూడాలి మరి!

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గత 2014 ఎన్ని కల ప్రచారం సమయంలోనే గాకుండా తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు కూడా తమ్ముళ్లకు నామినేటెడ్‌ పోస్టులతో గౌర వం ఇస్తానని హామీ ఇస్తూ వచ్చారు. కానీ తొలి నాలుగేళ్లూ జిల్లాలో ఏ ఒక్కరికీ నామినేటెడ్‌ పోస్టు కూడా దక్కలేదు. చివరి  ఏడాదిలో మాత్రం ఆశావహుల్లో నిరాశా నిస్పృహలు చోటుచేసుకో వడం, వారి నుంచి నిరసనలు కూడా వ్యక్తమవుతుండటంతో భర్తీ తప్పనిసరి అయింది. తొలి నుంచి టీడీపీ కంచుకోటగా జి ల్లా నిలిచినప్పటికీ నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో సిక్కోలు తమ్ముళ్లకు ప్రాధాన్యం ఉన్న పోస్టులేవీ దక్కలేదు. రాకరాక వచ్చిన పోస్టులను తమ్ముళ్లు ఇప్పుడు వదులుకోలేకపోతున్నారు.

ఇప్పటికి ఇద్దరే రాజీనామా
ఈ ఎన్నికలలో టీడీపీ చావుదెబ్బ తిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఇద్దరు నాయకులు మాత్రమే తమ నామినేటెడ్‌ పోస్టులకు రాజీనామా చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఇప్పిలి తిరుమలరావు గత ఏడాది రాష్ట్ర హస్తకళల అభివృద్ధి మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. రెండు రోజుల క్రితం తన పదవికే గాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేశారు. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలం మండలానికి చెందిన నడికుదిటి ఈశ్వరరావును టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు డైరెక్టర్‌గా నియమించింది. శనివారం ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు. ఇంకా జిల్లాలో చిన్నా చితకా నామినేటెడ్‌ పోస్టులకు రాజీనామా చేయాల్సినవారు దాదాపు యాభై మంది వరకూ ఉన్నారు.

నరసన్నపేట నియోజకవర్గం
నరసన్నపేటకు చెందిన బలగ నాగేశ్వరరావు పౌర సరఫరాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. శ్రీశయన కార్పొరేషన్‌ కమిటీ సభ్యుడు పూతి రమణ ఇంకా ఆ పదవిలోనే ఉన్నారు. నరసన్నపేట, జలుమూరు మా ర్కెట్‌ కమిటీల అధ్యక్షులు భైరి భాస్కరరావు, వెలమల చంద్రభూషణరావులకు పదవీ వ్యామోహం తీరలేదు.

శ్రీకాకుళం నియోజకవర్గం
శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన గుమ్మా నాగరాజు బ్రాహ్మణ కార్పొరేషన్‌ సభ్యుడిగా టీడీపీ సర్కారు హయాంలో నియమితులయ్యారు. ఇంకా రాజీనామా చేయలేదు.

ఎచ్చెర్ల నియోజకవర్గం
రణస్థలం మండలం కొండములగాం సామాజిక ఆసుపత్రి చైర్మన్‌గా సురేష్‌కుమార్‌ నియమితులయ్యారు. ఇంకా రాజీనామా చేయలేదు. ఎచ్చెర్ల నియోజకవర్గ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా తోటయ్యదొర కూడా అదే ధోరణితో ఉన్నారు.

టెక్కలి నియోజకవర్గం
రాష్ట్ర అటవీశాఖ రాష్ట్ర డైరక్టర్‌గా ఎల్‌.ఎల్‌.నాయుడు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల పాలకమండలి సభ్యుడు చాపర గణపతి, కోటబొమ్మాళి ఏఎంసీ చైర్మన్‌ వెలమల విజయలక్ష్మి, వంశధార ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ మళ్ల బాలకృష్ణ, రాష్ట్ర జలవనరుల శాఖ డైరక్టర్‌ కర్రి అప్పారా వు, కోటబొమ్మాళి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరక్టర్‌ గున్న మన్మథరావు, కోటబొమ్మాళి వ్యవసాయ మార్కె ట్‌ కమిటీ డైరక్టర్లుగా వనగల సన్యాసి, ప్రదీప్‌కుమార్‌ పాణిగ్రహి, తంగుడుకృష్ణారావు తదితరులు టీడీపీ నా యకులు ప్రభుత్వం మారినా ఇంకాకుర్చీని వదలట్లేదు.

రాజాం నియోజకవర్గం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు తనకు ఇవ్వలేదని అలిగి న సంతకవిటి మండలం మామిడిపల్లి గ్రామానికి చెంది న కొల్ల అప్పలనాయుడును బుజ్జగించేందుకు టీడీపీ నాయకులు నామినేటెడ్‌ పోస్టు ఆశ చూపించారు. తీరా ఎన్నికలకు ముందు ఆయనను తూర్పు కాపు, గాజులకాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా టీడీపీ సర్కారు నియమించింది. రాజాం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పదవిలో ప్రతిభాభారతి కుమార్తె కావలి గ్రీష్మాప్రసాద్‌ను కూర్చోబెట్టింది. వారిద్దరూ ఇంతవరకూ రాజీనామా ఆలోచన చేయలేదు.
 
పాతపట్నం నియోజకవర్గం
ఎల్‌ఎన్‌పేట మండలానికి చెందిన కాగాన మన్మథరావు హిరమండలం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా, లక్ష్మీనర్సుపేట ఆసుపత్రి కమిటీ చైర్మన్‌ లావేటి మల్లేశ్వరరావు, హిరమండలం ఆసుపత్రి  కమిటీ చైర్మన్‌గా గండివలస ప్రశాంత్, పాతపట్నం సామాజిక ఆసుపత్రి కమిటీ చైర్మన్‌గా నల్లి సుజాత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నియమితులయ్యారు. అలాగే హిరమండలం మండలం చొర్లంగి ఆసుపత్రి కమిటీ చైర్మన్‌గా ధర్మాన నారాయణరావు, కొత్తూరు మండలం సామాజిక ఆసుపత్రి కమిటీ చైర్మన్‌గా పి.మోహనరావు, కొత్తూరు మండలం కురిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమిటీ చైర్మన్‌గా వి.ధర్మారావు నియమితులయ్యారు. పాతపట్నం మండలం నీలమణిదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్‌గా ఎ.సన్యాసిరావు కూడా టీడీపీ సర్కారు హయాంలోనే నియమితులయ్యారు. వారంతా ఇంకా ఆ పదవుల్లోనే కొనసాగుతున్నారు.

పాలకొండ నియోజకవర్గం
పాలకొండ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కర్నేన అప్పలనాయుడు,  పాలకొండ ఏరియా ఆసుపత్రి అభివద్ధి కమిటీ చైర్మన్‌గా వెన్నపు శ్రీనివాసరావు టీడీపీ హయాంలోనే నియమితులయ్యారు. ఇటీవలే  పాలకొండకు చెందిన బగాది సుశీల రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ ఉత్తరాంధ్రా కన్వీనర్‌గా నియమితులయ్యారు. సీతంపేట చెందిన బిడ్డిక దమయంతినాయుడు రా్రçష్ట కనీసవేతన సలహా మండలి డైరెక్టర్, సీతంపేట సీహెచ్‌సీ అభివృద్ధి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. గిరిజన సలహామండలి సభ్యులుగా వీరఘట్టం మండలం ఎం.రాజపురం గ్రామానికి చెందిన నిమ్మక జయకృష్ణ కొనసాగుతున్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. టీడీపీ చెందిన వీరఘట్టం నాయకుడు పొదిలాపు క్రిష్ణమూర్తి నాయుడు తూర్పుకాపు కార్పొరేషన్‌ సభ్యులుగా కొనసాగుతున్నారు.

పలాస నియోజకవర్గం
తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా గౌతు శ్యామసుందర శివాజీని టీడీపీ ప్రభుత్వం గత ఏడాదే నియమించింది. సీనియర్‌ నాయకుడిగా ఉన్నా మంత్రి పదవి పొందలేకపోయిన శివాజీ టీడీపీ పెద్దలతో పోరాడితే సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఈ పదవి దక్కింది. అలాగే రాష్ట్ర కాళింగ కార్పొరేషన్‌ అధ్యక్షుడిగా నాలుగు నెలల క్రితమే  దువ్వాడ కృష్ణమూర్తినాయుడిని టీడీపీ ప్రభుత్వం నియమించింది. జిల్లా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా పీరుకట్ల విఠల్,  పలాస ఏఎంసీ చైర్మన్‌గా మళ్ల శ్రీనివాసరావు, పలాస పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా గాలి కృష్ణారావు ఇంకా ఆ పదవుల్లోనే కొనసాగుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement