టెండర్ల కోసం తమ్ముళ్ల పోటాపోటీ
జేసీ, ఉన్నం
అనుచరులకు
దక్కని టెండర్లు
కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇసుక రీచ్ టెండర్ల వ్యవహారం టీడీపీలో కలకలాన్ని రేపింది. అజ్జయదొడ్డి ఇసుక రీచ్ దక్కించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ అనుచరున్ని ఎంపీ జేసీ వర్గీయులు కిడ్నాప్ చేశారని దుమారం చెలరేగింది. అజ్జయదొడ్డి ఇసుక రీచ్‌కు జేసీ అనుచరుడు తక్కువ ధరకు టెండర్ వేసి భంగపడడంతో కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఎలాగైనా సరే ఇసుక రీచ్ టెండర్లను దక్కించుకోవాలని భావించిన ఎమ్మెల్యే ఉన్నం అనుచరుల వ్యూహం కూడా ఫలించలేదు. వివరాల్లోకెళితే... నియోజకవర్గంలో ఉన్న అజ్జయదొడ్డి, కన్నేపల్లి, చెన్నంపల్లి ఇసుక రీచుల కోసం ప్రభుత్వం టెండర్‌కు పిలిచింది. ఎమ్మెల్సీ కేశవ్ అనుచరులు కన్నేపల్లి ఇసుక రీచ్‌ను క్యూబిక్ మీటర్ రూ.110 కే టెండర్ దక్కించుకున్నారు.
అజ్జయదొడ్డి ఇసుక రీచ్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు అనుచరుడు దక్కించుకున్నాడు. ఈ రీచ్‌కు జేసీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి క్యూబిక్ మీటర్ కు రూ.110 టెండర్ దాఖలు చేశాడు. కాలవ అనుచరుడు రూ.315 ప్ర కారం వేసి దక్కించుకున్నాడు. చెన్నం పల్లి ఇసుక రీచ్ టెండర్ దాఖలు చేసిన ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులకు మొండిచేయి దక్కింది. రీచ్‌కు ఐదుగురు టెండర్లు దాఖలు చేయాల్సిన నిబంధనతో ఎమ్మెల్యే వర్గీయుల ఆశలు ఆవిరయ్యాయి. ఇదిలా ఉంటే కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇసుక రీచ్ టెండర్లలో ఎంపీ జేసీ, ఎమ్మెల్సీ కేశవ్ అనుచరులు తలదూర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంపీ వర్గీయులు అదే పార్టీకి చెందిన చీఫ్‌విప్ అనుచరుడి కిడ్నాప్ చేశారన్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఏదిఏమైనా అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, అక్రమాలు ఇసుక టెండర్ల ద్వారా మరోసారి బయటపడ్డాయనే చెప్పవచ్చు.