మాచర్ల: స్థానిక పురపాలక సంఘం చైర్ పర్సన్‌గా 27వ వార్డుకు చెందిన షేక్ షాకీరూన్ ఎంపికయ్యారు. గత రెండు నెలల కిందట అప్పటి పురపాలక సంఘ చైర్‌పర్సన్‌గా నెల్లూరు మంగమ్మ ఒప్పందం ప్రకారం తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తాత్కాలిక చైర్ పర్సన్‌గా షాకీరూన్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించారు.
ఎన్నికల అధికారి గురజాల ఆర్డీఓ పురపాలక సంఘ కార్యాలయంలోని మీటింగ్ హాలులో ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీకి చెందిన 13 మంది, ప్రతిపక్షానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు హాజరై కోరమయ్యే విధంగా చూశారు. ఎన్నికల అధికారి పుల్లయ్య చైర్‌పర్సన్ ఎంపికకు సంబంధించి ప్రకటన విడుదల చేయగానే 10వ వార్డుకు చెందిన అధికార పార్టీ కౌన్సిలర్ వేముల వెంకట కల్యాణి, 27వ వార్డుకు చెందిన షేక్ షాకీరూన్ పేరును ప్రతిపాదించారు. 18వ వార్డుకు చెందిన మాచర్ల రాజ్యలక్ష్మి, 6వ వార్డుకు చెందిన కొమ్ము సంతోష్‌కుమార్‌లు బలపరిచారు.
రెండు వర్గాలుగా చీలిక
మొత్తం 29 మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా 15 మంది హాజరై షాకీరూన్‌ను ఎంపిక చేసుకున్నట్లు ధ్రువీకరిస్తూ ఎన్నికల అధికారి ఆర్డీఓ పుల్లయ్య చైర్‌పర్సన్‌కు పత్రాలను అందజేశారు. నూతనంగా ఎంపికైన చైర్‌పర్సన్ షేక్ షాకీరూన్ మాట్లాడుతూ తన ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీకి 20 మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా, వారి మద్దతుతో ఒక సీపీఐ కౌన్సిలర్ గెలవగా మొత్తం 21 మంది బలం ఉంది. అయితే కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. గత నాలుగు రోజులుగా రెండు వర్గాలు పోటా పోటీగా మంతనాలు జరిపాయి. కౌన్సిలర్లను ఆకట్టుకోగా దాదాపుగా చైర్‌పర్సన్ ఎంపికకు కోరం ఉండదని ప్రచారం జరిగింది.
అయినా ఏడుగురు టీడీపీ కౌన్సిలర్లు ఎంపికకు దూరంగా ఉన్నారు. అధికార పార్టీకి సంబంధించి 13 మంది కౌన్సిలర్లు మాత్రమే మద్దతు పలుకుతుండటంతో 4, 13వ వార్డుకు చెందిన ప్రతి పక్ష కౌన్సిలర్ల మద్దతుతో గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచే పురపాలక సంఘ కార్యాలయాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో రెండు రోజులుగా అధికార పార్టీకి చెందిన నాయకులు అందుబాటులో ఉన్న నాయకులను సాగర్‌కు తరలించి క్యాంపు నిర్వహించారు. బుధవారం ఉదయం భారీ బందోబస్తు మధ్య కౌన్సిలర్లను ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి ఎన్నికలు జరిగే వరకు పర్యవేక్షిస్తారని టెన్షన్ పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment