
పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపీని చూపిస్తున్న మేరీ
వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ వెంకట్రావు భార్య మేరీ
నా భర్తని టీడీపీ ఎంఎల్‌సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డితోపాటు ఇతర నేతలు ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశారు. నా భర్తను ఏమి చేస్తారోనని భయం వేస్తోంది.
-ఇనమనమెళ్ళూరు ఎంపీటీసీ యాదాల వెంకట్రావు భార్య మేరీ
ఒంగోలు అర్బన్: తన భర్తని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డితోపాటు ఇతర నేతలు ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశారని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనమనమెళ్ళూరు ఎంపీటీసీ సభ్యుడు యాదాల వెంకట్రావు భార్య మేరీ ఆరోపించారు. ఒంగోలులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... దివంగత నేత వైఎస్ పుణ్యంతో తమ బిడ్డ ప్రాణాలు నిలబడ్డాయని, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీకి కట్టుబడి ఉండాలని తన భర్త ఎప్పుడూ చెబుతుండేవారని తెలిపారు.
అనారోగ్యంతో ఉన్న తమ కుమార్తెను తీసుకుని శుక్రవారం హైదరాబాద్ ఆసుపత్రికి బయలుదేరాడని, అప్పటినుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని చెప్పారు. వారెక్కడున్నారో తెలియక ఆందోళన చెందుతున్న తాను... వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను టీడీపీ నేతలు నెల్లూరులో దాచి ఉంచారన్న వార్తలు టీవీల్లో చూసి పార్టీ నేతలను కలవడానికి ఇక్కడకు వచ్చానని తెలిపారు. తన కుమార్తె ఆరోగ్యం బాగాలేదని, తన భర్తను ఏమి చేస్తారోనని భయం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.