‘అనంత’ అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి పనిచేస్తారు. కానీ చాలా మందికి సెంటు భూమి కూడా లేదు. అందుకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భూపంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టి రైతు బాంధవుడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. అయితే టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. నాలుగున్నరేళ్లలో కనీసం సెంటు భూమి కూడా పంపిణీ చేయకుండా వేధిస్తోంది. దీంతో అర్హులైన నిరుపేదలు ఇప్పటికీ అర్జీలు చేతబట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ఈ చిత్రంలోని దంపతులు వన్నూర్‌వలి, వహిదాబేగం. వీరిది బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామం. వీరికి గోవిందపల్లి పంచాయతీలోని రేగడి కొత్తూరు గ్రామం రోడ్డు సమీపాన సర్వేనంబర్ 14–1 లో 4.61 ఎకరాల భూమి ఉంది. ఇందులో వరి, పత్తి పంటలను వేస్తూ 40 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నా.. అధికారులు పట్టా ఇవ్వలేదని వాపోయారు. తహశీల్దార్ కార్యాలయంలో ఆరు సార్లు, ‘మీ కోసం’లో కలెక్టర్‌కు రెండు సార్లు, ఆర్డీఓకు రెండు సార్లు అర్జీ ఇచ్చినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం అర్బన్ : కొన్ని పథకాలు నిరుపేదల జీవితాలనే మార్చేస్తాయి. వారి బతుకులకు భరోసానిస్తాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన భూపంపిణీ పథకం అలాంటిదే. ఈ పథకం వల్లే ఎందరో నిరుపేదలు భూములు పొంది పంటలు సాగుచేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. కానీ నిరుపేదల పాలిట వరంగా మారిన భూపంపిణీ పథకానికి టీడీపీ ప్రభుత్వం పాతర వేసింది. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అవుతున్నా... పేదలకు ఎకరా భూమి కూడా పంపిణీ చేయకుండా మోసం చేసింది. తమది పేదల ప్రభుత్వమని చెబుతూనే వారి ఆశలపై నీళ్లు పోసింది.
ఏడు విడతల భూ పంపిణీ
వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పేదలకు భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2005లో ప్రారంభమైన ఈ యజ్ఞం 2013 వరకు కొనసాగింది. అప్పటికి ఏడు విడతల్లో 34,750 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీల్లోని పేదలకు 79,027.17 ఎకరాలను పంపిణీ చేశారు. 2004లో ఆయన అధికారం చేపట్టి, ఏడాది వ్యవధిలో రెండు విడతలుగా 6,646 మంది పేదలకు 15,727.51 ఎకరాలను పంపిణీ చేయడం గమనార్హం. కానీ టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి నేటి వరకూ ఎకరా భూమిని కూడా పేదలకు పంపిణీ చేయలేదు.
అక్రమాలకు తెరతీశారు
టీడీపీ నేతలు..తమది పేదల ప్రభుత్వమంటూ గొప్పలు చెబుతారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర ఏళ్లలో భూపంపిణీ చేపట్టి పేదలను ఆదుకున్నది లేదు. అయితే అధికారులు, అధికారపార్టీ నాయకులు కుమ్మకై అక్రమాలకు తెరతీశారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు సిఫారసు చేసిన వారికి అధికారులు పెద్ద ఎత్తున్న ప్రభుత్వ భూములను కట్టబెట్టారు. శింగనమల, కూడేరు మండలాల్లో ప్రభుత్వ భూములకు దొంగ లెటర్లు సృష్టించి దాదాపు 3 వేల ఎకరాలను దిగమింగారు. ఈ అక్రమాలపై విపక్ష పార్టీలన్నీ రోడ్డెక్కి పోరాడటం...పత్రికలు పతాకశీర్షికల్లో ప్రచురించడంతో జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అక్రమాలు నిజమని తేలడంతో కూడేరు తహసీల్దారు, ఆరుగురు సిబ్బందిపై ఇటీవలే సస్పెన్షన్ వేటు వేశారు.
అసైన్‌మెంట్ కమిటీకి పంపకుండానే...
సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ భూమిని ఏళ్లగా సాగు చేసుకుంటుంటే ఆ వివరాలను అసెన్‌మెంట్ కమిటీకి పంపిస్తారు. కమిటీ ఆమోదం తీసుకున్న తర్వాత సాగుదారులకు పట్టాలు పంపిణీ చేస్తారు. అయితే శింగనమల, కూడేరు మండలాల పరిధిలో మాత్రం అసైన్‌మెంట్ కమిటీతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా పట్టాలు ఇచ్చారు. రాళ్ల గుట్టలు, వంకలు, ఖాళీ స్థలాల సర్వే నంబర్లకు లెటర్లు çసృష్టించారు. ఆ నంబర్ల ప్రకారం డబ్బులు ఇచ్చిన వారికి, అధికారపార్టీ నాయకులు సిఫారసు చేసిన వారికి... ఖాతా నంబరు తయారు చేసి 1–బీ, అండగల్‌లో పేర్లు ఎక్కించడంతో పాటు పాసుపుస్తకం ఇచ్చారు. 1–బీ, అడంగల్‌లో భూమి పట్టాదారునికి ఏ విధంగా సక్రమించింది...? లేదా సాగు చేశారా...? అనే కాలమ్‌లో... కొన్నింటికి డీ.పట్టా, కొన్నింటికి అనువంశికం, మరికొన్నింటికి పిత్రార్జితం అంటూ నమోదు చేశారు.
భూ పంపిణీపై నిర్లక్ష్యం
భూమిలేని నిరుపేద రైతులకు భూ పంపిణీ చేయాలని పోరాటాలు చేస్తూనే ఉన్నాం. పేదలను ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. అందుకే ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తోంది. నాలుగున్నరేళ్లలో నిరుపేదకు భూమిని పంపిణీ చేసిన దాఖలాలు లేవు. పేదలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదనే విషయం స్పష్టమవుతోంది. – డి.జగదీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment