తొలగనున్న ‘భూ’చోళ్ల ముసుగు | TDP Leaders Land Scam In Vizag | Sakshi
Sakshi News home page

తొలగనున్న ‘భూ’చోళ్ల ముసుగు

Published Thu, Sep 12 2019 10:59 AM | Last Updated on Sat, Oct 5 2019 10:50 AM

TDP Leaders Land Scam In Vizag - Sakshi

విశాఖ నగరంలో, జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో టీడీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణాలను వెలికితీయాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పుడు చోటుచేసుకున్న  భూ అక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నగరవాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రెండేళ్ల కిందట నాటి తెలుగుదేశం సర్కారు సిట్‌ వేసినా అది కంటి తుడుపు చర్యగానే మిగిలిపోయింది. అసలు ఆ నివేదికే వెలుగుచూడలేదు. అప్పటి ప్రభుత్వం మీద.. ఆ దర్యాప్తు మీద నమ్మకం లేని  చాలామంది బాధితులు భూదందాలను వెలుగులోకి తీసుకురాలేదు.  ప్రయోజనం ఉండదని భావించి సిట్‌ దృష్టికి తీసుకువెళ్లలేదు.   వారు ఊహించినట్టుగానే ఫిర్యాదు చేసిన బాధితుల్లో ఒక్కరికీ న్యాయం జరగలేదు. బడాబాబులెవరిపైనా కేసులు పెట్టలేదు.  విశాఖ భూస్కాంపై పునర్విచారణ చేపట్టాలని, సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మరిన్ని భూదందాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

సాక్షి, విశాఖపట్నం:  ఐదేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి నిర్మాణం పేరిట విజయవాడ, గుంటూరు జిల్లాల్లో  వేలాది ఎకరాల పంట భూములను అడ్డగోలుగా.. అన్యాయంగా దోచేసిన పాలకులు ఆ తర్వాత  విశాఖ నగరం మీద వాలిపోయారు. సుందరమైన సముద్రతీరంతో నవ్యాంధ్రలో ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖలో  రూ.లక్షల కోట్ల విలువైన భూములను చెరబట్టారు. హుద్‌హుద్‌ను కూడా తట్టుకున్న విశాఖపట్నం... భూ బకాసురులుగా మారిన తెలుగుదేశం పాలకులు సృష్టించిన భూదందాల విలయంతో మాత్రం చిగురుటాకులా వణికిపోయింది. ఆర్థిక రాజధానిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళతామని చెప్పిన పాలకులే భూ మాఫియాకు ద్వారాలు తెరిచి పాతాళానికి నెట్టేశారు. డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు.. ఇలా దేన్నీ వదల్లేదు. అధికారం అండతో ఖాళీగా కనిపిం చిన భూమినల్లా కబ్జా చేసేశారు.  వీరితో కొందరు అధికారులు కూడా కుమ్మక్కుకాగా..  మరి కొందరి మెడపై అధికారమనే కత్తి పెట్టి పనులు చేయించుకున్నారు. ఇక రికార్డులు తారుమారు చేయడమనే సరికొత్త భూ దందా బహుశా దేశంలోనే మొదటిసారి ఇక్కడే బీజం పడిందన్నది జగమెరిగిన సత్యం.

ఆక్రమణలో ఉన్న ఇనాం భూములు
రికార్డులు గల్లంతుతో భూ కుంభకోణం బట్టబయలు
2017 మేలో భూ రికార్డుల మాయం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొన్ని వేల భూ రికార్డులు కనిపించడం లేదని స్వయంగా అప్పటి కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. విశాఖలో 2,45,896 ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్స్‌ (ఎఫ్‌ఎంబీ)లు ఉండగా ఇందులో 16,735 ఎఫ్‌ఎంబీలు కనిపించకుండా పోయాయి. 3022 ఆర్‌ఎస్‌ఆర్‌లు ఉండగా అందులో 379 అదృశ్యమయ్యాయి. 3022 గ్రామాలకు సంబంధించి క్లియర్‌ మ్యాపుల్లో 233 గ్రామాల మ్యాపులు కనిపించకుండా పోయాయి. ఇందులో చాలావరకు భీమిలి, మధురవాడ ప్రాంతాల్లోని భూములకు సంబంధించినవే ఉన్నాయి. ఇలా భూ కుంభకోణం బట్టబయలైంది.  జిల్లా టీడీపీలో కీలకంగా ఉన్న నేతల్లో చాలామంది భూ దందాల ఆరోపణలు ఎదుర్కొన్న వారే.  అప్పటి అనకాపల్లి  ఎమ్మెల్యే పీలా గోవింద్‌పై ఏకంగా పోలీసు కేసు కూడా నమోదైంది.

సిట్‌ నివేదిను తొక్కిపెట్టిన టీడీపీ సర్కారు 
విశాఖ భూ కుంభకోణంపై ప్రతిపక్షాల ఆందోళనను దిగొచ్చిన సర్కారు 2017 జూన్‌ 20న సిట్‌ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో అప్పటి  జాయింట్‌ కలెక్టర్‌గా వ్యవహరించిన జి.సృజన సభ్యురాలిగా ఏర్పాటు చేసిన సిట్‌కు అందిన 2875 ఫిర్యాదుల్లో  మూడొంతులు అధికార పార్టీకి చెందిన నేతలపైనే వచ్చాయి.   వివిధ వర్గాల ప్రజలు, భూ బాధితులు కూడా టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతల భూకబ్జాలపైనే సిట్‌కు ఫిర్యాదులు చేశారు. సుదీర్ఘంగా సాగిన సిట్‌ విచారణలో వందలాది డాక్యుమెంట్లు, వేలాది భూ రికార్డులను పరిశోధించి.. క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 2018 జనవరి 29న సిట్‌ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా తొక్కిపెట్టిన సర్కారు చివరికి అదే ఏడాది నవంబర్‌ 6న కేబినెట్‌కు ముందుకు తీసుకొచ్చింది. కానీ నేటికీ బహిర్గతం చేయకపోవడం గమనార్హం.

టీడీపీ దందాలకు అధికారుల బలి
మొత్తంగా భూ కుంభకోణంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులపై చర్యలకు సిట్‌ సిఫార్సు చేసినా పట్టించుకోని సర్కారు తహసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులను మాత్రం బలి చేసింది. తహసీల్దార్‌ నుంచి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, ఐఏఎస్‌ స్థాయి అధికారులకు సంబంధించి సుమారు 48 మందిపై క్రిమినల్‌ కేసుల నమోదుకు సిఫార్సు చేసింది. సుమారు 140 మంది వివిధ స్థాయి అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసింది.

కొత్త సిట్‌ ఏర్పాటైతే..
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విశాఖ  భూ కుంభకోణంలో అక్రమాలను వెలికితీయడంతోపాటు దోషులేవరో నిగ్గుతేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భీమిలీ, మధురవాడ తదితర ప్రాంతాల్లో అత్యంత విలువైన భూ  రికార్డులను తారుమారు చేసి కొందరు టీడీపీ నేతలు సొంతం చేసుకున్నట్లు పక్కా ఆధారాలున్నా వారి పేర్లు దోషుల జాబితాలో లేకుండా తప్పించినట్లు  ఆరోపణలున్నాయి. అందువల్ల ఈ భాగోతంపై మరోసారి ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా నిష్పక్షపాతంగా లోతైన విచారణ జరిపించాలని ప్రస్తుత ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలన్న సదుద్దేశంతో నిజాయతీ గల ఐఏఎస్, లేదా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులతో విచారణ జరిపించాలని భావిస్తోంది. కొత్తగా సిట్‌ ఏర్పాటు చేస్తే జిల్లాలో జరిగిన భూదందాల్లో మరిన్ని వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి  ఫిర్యాదుల స్వీకరణ, విచారణ విషయంలో పరిమితులను విధించింది. దీంతో కొన్ని దందాలకు మాత్రమే అప్పటి సిట్‌ పరిమితమైంది. సిట్‌కు పరిమితులు విధించొద్దంటూ ప్రజాసంఘాలు, బాధితులు ప్రభుత్వానికి నివేదించినా పట్టించుకోలేదు. దీంతో అనేక భూ దందాలు మరుగున పడిపోయాయి. ఇవన్నీ కొత్త సిట్‌ ద్వారా వెలుగులోకి వస్తాయని అందరూ భావిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement