టీడీపీ నేతల స్వైరవిహారం
క్రైం (కడప అర్బన్) : సిద్దవటం పరిధిలోని భూముల వద్దకు వెళ్లిన దాసరి శ్రీనివాసులు అనే వ్యక్తిని ఆదివారం మధ్యాహ్నం టీడీపీ నేతలైన అతికారి వెంకటయ్య, అతికారి కృష్ణయ్య మరికొందరితో కలిసి హత్యా యత్నానికి పాల్పడ్డారు. బాధితులు తన బంధువులతో కలిసి రిమ్స్‌కు వస్తుండగా భాకరాపేట వద్ద కాపుకాచి సుమోను వెంబడించి మరణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఈ సంఘటనలో శ్రీనివాసులుతోపాటు అతని సోదరుడు శివ తీవ్రగాయాల పాలయ్యారు. సినీ ఫక్కీలో టీడీపీ నేతలు స్వైరవిహారం చేసి మరణాయుధాలతో దాడులు నిర్వహించారు. బాధితుల కథనం మేరకు... సిద్దవటం ఆకలివీధికి చెందిన దాసరి శ్రీనివాసులు, అతని సోదరుడు దాసరి శివ తమకున్న నాలుగెకరాల పొలం ఉంది.
ఇతర గ్రామస్తులకు చెందిన భూములకు వెళ్లే దారులను, వంక పొరంబోకు స్థలాన్ని బ్రిటీష్ కాలంలో నిర్మించిన చెరువు కాలువను అతికారి వెంకటయ్య, అతని సోదరుడు కృష్ణయ్య, వెంకట సుబ్బయ్య అలియాస్ వైఎస్, పోలిశెట్టి శ్రీనివాసులు అలియాస్ ఎల్‌సీ శ్రీను అనే వారు గతంలో తమ భూములకు ఆనుకుని ఉన్న స్థలాల కబ్జాకు పాల్పడ్డారు.
ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. ఆగస్టు నెలలో దీనిపై పలు కేసులు నమోదు చేసి ఇప్పటికే నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే దాసరి శ్రీనివాసులు పొలం వద్ద ఉండగా, పై వారు దాడి చేశారు. పోలీసుస్టేషన్‌ను ఆశ్రయిస్తే రిమ్స్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని తెలిపారు. దీంతో శ్రీనివాసులు తమ బంధువులతో కలిసి సుమోలో కడపకు వస్తుండగా భాకరాపేట వద్ద టీడీపీ నేతలు కాపు కాచి వారిని వెంటాడి హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు.
దాడి చేసిన వారిలో అతికారి వెంకటయ్య, కృష్ణయ్య, వెంకట సుబ్బయ్య, శ్రీనివాసులు, రాజశేఖర్, గంగయ్య, గంగాధర్, సుధాకర్, నాగేంద్ర, మునిస్వామి, వెంకటయ్య, తాడిపత్రి నుంచి వచ్చిన వెంకటయ్య మనుషులు ఉన్నారని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలించారు. మరోవైపు పోలిశెట్టి శ్రీనివాసులు స్వల్ప గాయాలతో రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇరువర్గాల వారి ఫిర్యాదు మేరకు సిద్దవటం ఎస్‌ఐ అన్సర్‌బాషా కేసులు నమోదు చేశారు.