పాపాల పుట్ట పగిలేనా..!  | TDP Leaders Scams In Govt Milk Dairy | Sakshi
Sakshi News home page

పాపాల పుట్ట పగిలేనా..! 

Published Sun, May 5 2019 11:36 AM | Last Updated on Sun, May 5 2019 11:36 AM

TDP Leaders Scams In Govt Milk Dairy - Sakshi

ఒంగోలు సబర్బన్‌: ఒంగోలు డెయిరీలో తోడే కొద్దీ అక్రమాల పుట్ట కదులుతోంది..రూ.కోట్లకు కోట్లు కొల్లగొట్టిన తెలుగుదేశంకు చెందిన డెయిరీ పాత పాలకమండలి పాలు, పాల పదార్థాల రూపంలో తాగేసిన, తినేసిన దాదాపు రూ.100 కోట్ల లెక్కలు మాయం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అందుకే పాత అధికారులను పక్కన పెట్టి డెయిరీకి నూతనంగా ముగ్గురు అధికారులను నియమించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో డెయిరీ లెక్కలను ఆడిట్‌ చేసిన చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ నివేదికలో చూపించిన రిపోర్టులు మాయం చేసే పనిలో కొత్త అధికారులు నిమగ్నమయ్యారు. గతంలో అక్రమాలు చేసి కాజేసిన డెయిరీ సొమ్మును తిరిగి చెల్లించాలని రూపొందించిన రికవరీ ఫైళ్లు కనుమరుగు చేసినట్లు సమాచారం.

బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు చూపించిన డెయిరీలోని నిల్వలు మాయంచేసి చివరకు బ్యాంకులకే కుచ్చుటోపీ పెట్టిన ఘనత పాత కమిటీ చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావుది. చివరకు రూ.కోట్ల కొద్దీ బొక్కి ఒట్టిపోయిన గేదెను చేసి అధికారులతో ఏర్పాటైన నూతన కమిటీకి డెయిరీని అప్పగించిన చల్లా ఇప్పటికీ అధికార పార్టీని అడ్డంపెట్టుకొని మరీ డెయిరీలో తన పెత్తనమే చెలాయిస్తున్నారు. అందుకే ఆయన చేసిన పా‘‘పాలు’’బయటకు రానీయకుండా ప్రస్తుతం ఉన్న అధికారులపై అధికార తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో బెదిరింపులకు దిగిమరీ తన తప్పులు బయట పెట్టకుండా తన జులుం ప్రదర్శిస్తున్నారు. అందుకే నూతనంగా డెయిరీలోని అక్రమాలు బయటకు తీసేందుకు ఏర్పాటు చేసిన హైదరాబాద్‌కు చెందిన ఆడిట్‌ కమిటీకి ఇక్కడ సహాయ నిరాకరణ ఎదురవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ప్రస్తుతం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి, ఐఏఎస్‌ అధికారి అయిన జుజ్జవరపు మురళిని కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నాగలక్ష్మితో పాటు పలువురు అధికారుల జిల్లా అధికారులు, రాష్ట్రంలోని పలు డెయిరీలకు చెందిన అధికారులను కమిటీలో వేశారు. అయితే పూర్తి స్థాయి కమిటీ 2018 జూన్‌ నెలలో మొదలు పెట్టి జూలై 19 కల్లా ఏర్పాటు చేశారు. కమిటీ ఏర్పాటై దాదాపు 11 నెలలు కావస్తుంది. కానీ ఇప్పటికీ డెయిరీలో జరిగిన కోట్ల రూపాయల అక్రమాలు వెలికితీయటంలో కమిటీ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో పాడి రైతులకు అర్థం కావటం లేదు. అది కేవలం ఒంగోలు డెయిరీని సర్వ నాశనం చేయటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం కాబట్టి డెయిరీ అక్రమాలు బయట పెట్టడానికి చివరకు అధికారులు కూడా భయపడుతున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇదిలా ఉంటే డెయిరీని అభివృద్ధి చేయటానికంటూ నూతన పాలక మండలి కొత్తగా ముగ్గురు అధికారులను నియమించింది.

అయినా వారివల్ల డెయిరీ అభివృద్ధి కాదు కదా పాత అక్రమాలను కూడా ఒక్క పైసా కూడా వెలికితీయలేదు. నూతనంగా నియమించిన వారిలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ), క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్‌ (క్యూసీఓ), బాయిలర్‌ జూనియర్‌ ఇంజినీర్‌లను నియమించి వారి ముగ్గురికి జీతాలతో కలుపుకొని అదనపు సౌకర్యాలు అన్నీ కలిపి నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు డెయిరీకి అదనపు భారం మాత్రం చివరకు మిగిలిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2016–17 ఆర్ధిక సంవత్సరంలో రూ.7.29 కోట్ల నష్టాల్లో ఉన్న డెయిరీని, 2017–18లో రూ.58.34 కోట్లు నష్టాల్లోకి నెట్టిన ఘనత చల్లా శ్రీనివాసరావుది. మొత్తం పూర్తి లెక్కలు తేల్చకముందు నష్టాల రూపంలో చూపించింది రూ.65.63 కోట్లు వాటి ఊసు ఇప్పటి వరకూ అంతూ పంతూ లేదు.

ఒంగోలు డెయిరీ నూతన కమిటీ గతంలో పాపాలు చేసి రూ.100 కోట్లకు పైగా దోచుకున్న పాత పాలక మండలి తప్పులకు సంబంధించిన లెక్కల రికార్డులను మాయం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో ఎన్నో అక్రమాలు బయట పడుతుంటే అందుకు ప్రస్తుతం ఉన్న అధికారులు రికార్డులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు. లాభాలతో సాగిపోతున్న డెయిరీని చల్లా శ్రీనివాసరావు కంపెనీ చట్టంలోకి మార్చటం వెనుకే దోచుకునే దుర్మార్గమైన ఆలోచన ఉన్నట్లు అప్పట్లో విమర్శలు గుప్పుమన్నాయి.

  • 2017 మార్చి 31 నాటికి డెయిరీ ముగింపు నిల్వ కింద రూ.14,07,80,470 లెక్కల్లో చూపించారు. అదే 2017 ఏప్రిల్‌ 1 నాటికి 2017–18 ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రారంభ నిల్వ కింద రూ.2,57,39,160 చూపించ చారు. అంటే ఒకరాత్రి గడిచేలోపే రూ.11,50,41,310 మాయం అయిపోయాయి. ఆ లెక్కలను చూసిన పాత ఆడిట్‌ కంపెనీ గుడ్లు వెళ్లబెట్టింది. అదేంది తెల్లవారే సరికి రూ.11.50 కోట్లు ఏమయ్యాయని ఆడిట్‌లో అభ్యంతరం తెలిపింది. అది ఇంత వరకూ బయటకు రాలేదు. ఇలా ఎన్నో ఆడిట్‌ తనిఖీల్లో బయట పడితే వాటిని పట్టించుకుంటున్న పాపాన పోవటం లేదు. వీటితో పాటు అనేకరకాల అక్రమాలు ఆడిట్‌
     
  • తనిఖీల్లో బయటపెట్టారు.
  • వాణిజ్య చెల్లింపులు, ఇతర అప్పులు, వ్యాపార ఆదాయాలు, అడ్వాన్సులు, ఇతర ఆదాయాల ఊసే లెక్కల్లో లేవు.
  • ఉద్యోగుల ఈపీఎఫ్‌ చెల్లింపులు చెల్లించకుండా రూ.42,90,691 మాయం చేసినట్లు బయట పడింది.
  • గతంలో అప్పుడప్పుడూ నగదు రూపంలోకి మార్చిన బయటి వ్యక్తుల సరుకు నిల్వలకు సంబంధించి వ్యయాన్ని, రుణాలను కంపెనీ తన పద్దులలో చూపింది. కానీ ఆయా వాటాల మొత్తం నగదు విలువ రూ.24,03,65,841 మాత్రం మాయం అయింది.
  • కర్నాటక ఫెడరేషన్‌కు సంబంధించిన పాలపొడి కాజేసిన దానిలో కాజేసిన దాదాపు రూ.2 కోట్లకు సంబంధించిన రికార్డులు మాయం.
  • విశాఖ డెయిరీ నుంచి సంఘ డెయిరీ నుంచి బజాజ్‌ సంస్థల నుంచి తీసుకున్న దాదాపు రూ.7 కోట్లు ఏం చేశారో లెక్కలు లేవు.
  • 2013 నుంచి 2016 వరకు ప్రతి నెల రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు మెషినరీ కొనుగోలు  చేశామని మినిట్స్‌లో రాసి కొనుగోలు పేరుతో దోచుకున్న రూ.కోట్లకు సంబంధించిన మిషనరీ అక్కడ లేదు.
  • గతంలో విజిలెన్స్‌ కమిటీ పాలలో ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతం తక్కువగా ఉందని దాని ద్వారా రూ.1.20 కోట్లు కాజేశారని ఇచ్చిన నివేదిక రికార్డులు బయట పెట్టటం లేదు. 
  • పాడి రైతులకు ఇచ్చిన గేదెల రుణాలను రైతులు డెయిరీకి తిరిగి చెల్లించారు. అవి దాదాపు రూ.2.60 కోట్ల మేరకు ఉన్నాయి. కానీ ఆ నిధులు పాత కమిటీ, అధికారులు దోచుకున్నారు. ఆ డబ్బులు బ్యాంకుకు చెల్లించలేదు. దానికి సంబంధించి రైతుల వద్ద నుంచి వసూలు చేసిన సొమ్ము ఏమైందో తేలలేదు.
  • వీటన్నింటిపై హైదరాబాద్‌కు చెందిన ఆడిట్‌ సంస్థ అక్రమాల రికార్డులు బయటకు తీసేనా..వారిపై కూడా ఉన్నతాధికారులు వత్తిడి తెచ్చి అటకెక్కిస్తారా అన్నది తేలాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement